పాతికేళ్లకే రాలిపోతుందట.. షాకిచ్చేలా తాజా అధ్యయనం!

పాతికేళ్లకే జుట్టు రాలే సమస్యను దేశంలోని కుర్రాళ్లు ఎదుర్కొంటున్నట్లుగా తాజా అధ్యయనం స్పష్టం చేసింది.

Update: 2023-10-17 04:41 GMT

చెట్టంత మగాడికి వచ్చిపడే సమస్యల్లో ఎవరూ తీర్చలేని వ్యధ జుట్టు రాలిపోవటం. గతానికి భిన్నంగా మారిన పరిస్థితుల్లో బట్టతల ముందే వచ్చేస్తోంది. ముఖవర్చసులో కీరోల్ ప్లే చేసే కేశాలు రాలిపోతూ.. కొత్త గుబులుకు కారణమయ్యే జుట్టు సమస్యపై దేశ వ్యాప్తంగా నిర్వహించిన అధ్యయానికి సంబంధించిన రిపోర్టు ఆసక్తికరంగానే కాదు.. కుర్రాళ్ల ఆందోళనను అద్దం పట్టేలా ఉంది. పాతికేళ్లకే జుట్టు రాలే సమస్యను దేశంలోని కుర్రాళ్లు ఎదుర్కొంటున్నట్లుగా తాజా అధ్యయనం స్పష్టం చేసింది.

దేశ వ్యాప్తంగా 50 వేల మంది పురుషులపై జరిపిన అధ్యయనంలో చేదు నిజం వెలుగు చేసింది. జుట్టు రాలే సమస్య ఉన్న భారతీయ పురుషఉల్లో 50.3 శాతం మంది పాతికేళ్ల కుర్రాళ్లేనని స్పష్టం చేసింది. 21 ఏళ్ల కంటే తక్కువ వయసులోనే జుట్టు రాలే సమస్యను ఎదుర్కొంటున్న వారు 25.8 శాతం కాగా.. సగటున 28 ఏళ్ల వారిలో జుట్టు రాలటం పెద్ద సమస్యగా మారిందని గుర్తించారు.

జుట్టు రాలే సమస్య ఆందోళనకరంగా మారుతోందన్న అధ్యయనం.. ప్రతి పదిమంది పురుషుల్లో ఆరుగురికి ఇదే ఇష్యూగా పేర్కొన్నారు. వివిధ రకాల అనారోగ్య సమస్యలు.. ఒత్తిడి.. జీర్ణకోవ సమస్యలు కూడా జుట్టు రాలే అంశాన్ని ప్రభావితం చేస్తున్నట్లుగా చెప్పారు.

గ్యాస్.. ఆహారం జీర్ణం కాకపోవటం వల్ల కూడా జుట్టు రాలే సమస్య ప్రతి పది మందిలో ముగ్గురి మీద ఉందని చెబుతున్నారు. అంతేకాదండోయ్.. జుట్టు రాలే సమస్య ఉన్న వారిలో పలువురు నిద్ర లేమితోనూ బాధ పడుతున్నట్లుగా గుర్తించారు.

జుట్టు రాలే సమస్యను తొలిదశలోనే గుర్తించి.. చికిత్స తీసుకుంటే దానికి చెక్ పెట్టటం కష్టం కాదంటున్నారు. కాకుంటే.. సరైన డాక్టర్ ను సంప్రదించాల్సిన అవసరం ఉందన్నది మర్చిపోకూడదు.

Tags:    

Similar News