హైదరాబాద్ లో కొత్త వైరస్: నో టెన్షన్.. ఓన్లీ ఫైవ్ డేస్!
హైదరాబాద్ లో కొత్త వైరస్ ఒకటి కలకలం రేపుతోందని తెలుస్తోంది.
హైదరాబాద్ లో కొత్త వైరస్ ఒకటి కలకలం రేపుతోందని తెలుస్తోంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, తక్కువ ఆక్సిజన్ లెవల్స్ వంటి లక్షణాలతో చాలా మంది ఈ మేరకు ఆస్పత్రుల్లో చేరుతున్నారని అంటున్నారు. ఈ వైరస్ కు సంబంధించిన లక్షణాలు ఉన్నవారికి గాంధీ హాస్పిటల్, ఫీవర్ హాస్పిటల్, ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ లలో పరీక్షలు నిర్వహిస్తున్నారని సమాచారం!
అవును... మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో స్వైన్ ఫ్లూ కేసుల సంఖ్య పెరుగుతోన్నట్లు కథనాలొస్తున్న నేపథ్యంలో... వాటికి పొరుగున ఉన్న హైదరాబాద్ లో కూడా ఆ లక్షణాలకు దగ్గరగా మరో వైరస్ వ్యాప్తి చెందుతుందని అంటున్నారు. ఈ వైరస్ సోకిన వారు తీవ్రమైన శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారని తెలుస్తుంది.
అయితే... మొదట దీనిని స్వైన్ ప్లూ, కోవిడ్ 19 కేసులుగా భావించి పరీక్షలు నిర్వహించారు. కానీ.. ఈ రెండు పరీక్షల్లో నెగెటివ్ రిజల్ట్ రావడంతో ఇదేదో కొత్త తరహా వైరస్ అనే చర్చ మొదలైంది. దీంతో... ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ లో స్వైన్ ఫ్లూ, కోవిడ్-19 తోపాటు ఇన్‌ఫ్లుఎంజా ఏ, ఇన్‌ఫ్లుఎంజా బీ పరీక్షలు చేస్తున్నారు.
సాధారణంగా ఆక్సిజన్ లెవెల్స్ తగ్గినప్పుడు స్వైన్ ఫ్లూ, కోవిడ్ -19 చేసే పరీక్షల్లో పాజిటివ్ వస్తుందని... అయితే తాజా పరిస్థితి అలా లేదని గాంధీ హాస్పిటల్ వైద్యులు చెబుతున్నారని సమాచారం. దీంతో... ఇది కొత్త తరహా శ్వాసకోశ వైరస్ కావచ్చని అభిప్రాయపడుతున్నారట.
అయితే ఈ కొత్త వైరస్ ప్రమాదకర స్థాయిలో లేదని వైద్యులు చెబుతుండటం శుభసూచికం. ఈ తరహా కొత్త కేసులన్నింటిలోనూ రికవరీ రేటు ఇప్పటి వరకు 100% ఉందని.. రోగ లక్షణాలు ఉన్న వ్యక్తి చికిత్స ద్వారా దాదాపు ఐదు రోజుల్లో పూర్తిగా కోలుకుంటున్నారని వైద్యులు చెబుతున్నారు!
100 డిగ్రీల ఫారెన్ హీట్ దాటిన జ్వరం, కంటిన్యూస్ గా వచ్చే దగ్గు, గొంతు నొప్పి, బాడీ పెయిన్స్, తలనొప్పి, నీరసం, ముక్కు కారడం ఈ వ్యాధి లక్షణాలుగా చెబుతున్నారు. అయితే... బాగా పెద్దవారు, పిల్లలతోపాటు రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో ఈ వైరస్ తొందరగా వచ్చే ఛాన్స్ ఉందని వైద్యులు చెబుతున్నారు!
ఈ లక్షణాలు ఉన్నవారు వైద్య పరీక్షలు చేయించుకుని, సరైన ట్రీట్ మెంట్ తీసుకుంటే ఐదు రోజుల్లోనే కోలుకుంటున్నారని గాంధీ ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు. ఈ కేసుల సంఖ్య హైదరాబాద్ లో తక్కువగానే ఉందని స్పష్టం చేస్తున్నారు. పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు!