ఉడకని పంది మాసం తిన్న ఫలితం... ఏమిటీ సిస్టీసెర్కోసిస్?

డాక్టర్.. డాక్టర్.. అరికాళ్ల నుంచి నడుము వరకూ తీవ్రమైన నొప్పి వస్తోంది అంటూ ఆస్పత్రికి వెళ్లాడు ఓ వ్యక్తి.

Update: 2024-09-01 12:30 GMT

డాక్టర్.. డాక్టర్.. అరికాళ్ల నుంచి నడుము వరకూ తీవ్రమైన నొప్పి వస్తోంది అంటూ ఆస్పత్రికి వెళ్లాడు ఓ వ్యక్తి. దీంతో... ఆ రోగికి సిటీ స్కాన్ చేశారు. అనంతరం వచ్చిన రిపోర్ట్ చూసి అవాక్కయ్యారు. కారణం... అతడి కాళ్లలో ఎక్కడబడితే అక్కడ పరాన్న జీవులు దర్శనమిచ్చాయి. ఈ విషయాలను డాక్టర్ ఎక్స్ లో పేర్కొన్నారు.

అవును... అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్ ఫ్లోరిడా హెల్త్ జాక్సన్ విల్లే మెడికల్ కాలేజీలోని హాస్పటల్ కు ఓ రోగి వచ్చాడు. తనకు పాదాల నుంచి నడుము వరకూ విపరీతమైన నొప్పి అని చెప్పాడు. దీంతో.. అతడికి సిటీ స్కాన్ చేయగా.. అందులో పరాన్న జీవులు తిష్టవేసినట్లు కనిపించింది.

తాజాగా ఈ విషయాలను ఎక్స్ లో పంచుకున్న డాక్టర్ శామ్ ఖలీ... ఎమర్జెన్సీ ట్రీట్ మెంట్ కోసం అంటూ ఆగస్టు 25వ తేదీన ఆ రోగిని తమ హాస్పటల్ కి వస్తే.. ఎమర్జెన్సీ రూమ్ లో చేర్పించారని.. వెంటనే తనకు సిటీ స్కాన్ చేస్తే ఆ రిపోర్ట్ చూశాక నా నోట మాట రాలేదని పేర్కొన్నారు.

ఆ రోగి కాళ్లలో ఎక్కడపడితే అక్కడ పరాన్న జీవులు ఉన్నాయని.. సరిగ్గా ఉడకని పందిమాంసం తినడం వల్ల రోగి శరీరంలోకి నులిపురుగులు ప్రవేశించి రెండు కాళ్ల కండరాలను మొత్తం ఆక్రమించేశాయని తెలిపారు. ఈ పరిస్థితినే సిస్టీసెర్కోసిస్ గా వ్యవహరిస్తారని అన్నారు!

ఏమిటీ సిస్టీ సెర్కోసిస్..?

సరిగా ఉడకని పంది మాంసం తినడం వల్ల అందులోని నులిపురుగులు మనిషి శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఈ సమయంలో వాటి లార్వాలు.. మెదడు, కండరాల్లోకి చేరతాయి. దీంతో... చర్మ కింద గడ్డలు, తలనొప్పి వస్తాయి. ఈ సమయంలో ఆ ఇన్ఫెక్షన్ వెన్నుపూస, మెదడు వరకూ చేరితే మూర్చ వ్యాధి రావొచ్చు.

ఈ వ్యాదినే సిస్టీ సెర్కోసిస్ అని అంటారు. వాస్తవానికి దీన్ని తొలిదశలోనే గుర్తిస్తే నివారించడం చాలా సులభమని వైద్యులు చెబుతున్నారు. అయితే... ఆలస్యం చేసి, వ్యాధి ముదిరితే మాత్రం మరణం తప్పదని హెచ్చరిస్తున్నారు. ప్రతీ సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా సుమారు 5 కోట్ల మంది ఈ వ్యాధి బారినపడుతున్నారని అంటున్నారు.

వారిలో సుమారు 50,000 మంది మరణిస్తున్నారంటే తీవ్రత అర్ధం చేసుకోవచ్చని చెబుతున్నారు. ప్రధానంగా.. తినేటప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవాలని.. కలుషిత ఆహారం, కలుషిత నీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు వైద్యులు!

Tags:    

Similar News