‘డాక్టర్..ఇక నీ వంతు’..సిరియా అసద్ శకం ముగించిన 11 ఏళ్ల బాలుడి రాత
‘‘ఓ డాక్టర్.. ఇకమీదట నీ వంతు’’.. పశ్చిమాసియాలో పెద్ద దేశమైన సిరియాలో 50 ఏళ్లకు పైగా సాగిన ఓ నియంత తరహా పాలనకు ఈ నాలుగే నాలుగు వ్యాఖ్యాలు చరమ గీతం పాడాయి..?
‘‘ఓ డాక్టర్.. ఇకమీదట నీ వంతు’’.. పశ్చిమాసియాలో పెద్ద దేశమైన సిరియాలో 50 ఏళ్లకు పైగా సాగిన ఓ నియంత తరహా పాలనకు ఈ నాలుగే నాలుగు వ్యాఖ్యాలు చరమ గీతం పాడాయి..? నమ్మినా.. నమ్మకున్నా.. ఇది నిజం. ఈ రాతలు రాసింది కూడా ఓ 14 ఏళ్ల బాలుడు.. ఇది కూడా నిజం. కాకపోతే ఇది జరిగింది 2011లో.
అరబ్ విప్లవం..
సహజంగా అరబ్ దేశాలంటేనే రాచరికం. లేదా నియంత పాలన. ఇలాంటి దేశాల్లో 2010-11లో అరబ్ విప్లవం మొదలైంది. ట్యునీసియాలో చిరు వ్యాపారి మహమ్మద్ బువాజీజీతో అధికారి దురుసు ప్రవర్తన.. ఆపై వ్యాపారి ఆత్మహత్యతో విప్లవం రేగింది.
అది ట్యునీషియా పాలకుడిని దించేసేవరకు వెళ్లింది. ఆ తర్వాత వంతు ఈజిప్ట్, యెమెన్, లిబియా.
సున్నీల రాజ్యంలో షియా పాలకుడు..
సిరియా సున్నీ ముస్లిం ప్రాబల్య దేశం. కానీ, అసద్ తండ్రి హఫీజ్ అల్ అసద్ ది షియాలోని ఉప వర్గం. వీరికి అలబైట్ మరో రెండు ప్రాంతాల్లోనే పట్టుంది. ఆ దేశ జనాభాలో వీరి శాతం 12 మాత్రమే. కానీ, 55 ఏళ్లుగా సిరియాను పాలిస్తున్నారు. 1971-2000 వరకు ఈయన, ఆ తర్వాత కుమారుడు బషర్ పాలన చేపట్టారు.
వరుస కరవులతో 2011 నాటికి బషర్ పాలనపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అయితే, దానిని సైన్యం, పోలీసులతో తొక్కేశాడు.
ఆ నాలుగు పదాలు..
సిరియాలో దారా ఓ పెద్ద నగరం. 2011 ఫిబ్రవరి 26న మౌవియా సియాస్నే అనే 14 ఏళ్ల బాలుడు స్కూల్ గోడపై ‘ఎజాక్ ఎల్ దూర్ య డాక్టర్’ (ఇప్పుడు నీ వంతు వచ్చింది డాక్టర్) అని పెద్ద అక్షరాలతో రాశాడు. బషర్.. కంటి డాక్టర్. అందుకే ఆయనను ఉద్దేశించి బాలుడు ఇలా రాశాడు.
అతడితో పాటు బాలలను బంధించి
బషర్ పై తాను రాసిన పదాలను మౌవియా సియాస్నే తన తండ్రికి చెప్పాడు. ఆ తర్వాత అసద్ కు సన్నిహితుడైన ప్రాంతీయ భద్రతాధికారి ఆతిఫ్ నజీబ్ కు విషయం తెలిసింది. దీంతో మౌవియాతో పాటు 20 మంది పిల్లలను భద్రతా దళాలు బంధించి హింసిచాయి. ఎంత వేడుకున్నా కనికరించలేదు. దీంతో ప్రజలు వీధుల్లోకి వచ్చారు. ఆందోళనలు దేశమంతా వ్యాపించడంతో జైళ్ల తలుపులు తెరుచుకున్నాయి. అయితే, అసద్ తరఫున కొందరు దారాలోని పెద్దలను కలిసి.. 26 రోజులుగా నిర్బంధంలో ఉన్న పిల్లలను విడిపించేలా చూశారు. పాలకులకు వ్యతిరేకంగా ఆందోళనలు చేయబోమంటూ సంతకాలు పెట్టించుకొన్నారు. అయితే, బయటకు వచ్చాక ఆ పిల్లలు మరింత ఇబ్బంది ఎదుర్కొన్నారు. 2011 మార్చి 15న తొలిసారి అత్యంత సమన్వయంతో దేశవ్యాప్తంగా ‘డే ఆఫ్ రేజ్’ పాటించారు.
పాలకులు మళ్లీ హింసనే ఎంచుకొన్నారు. అటు ఆందోళనలు మరింత పెట్రేగాయి. సిరియా సైన్యంలో రెండుగా చీలింది. 2011 జూలైలో ఫ్రీ సిరియన్ ఆర్మీ(ఎఫ్‌ఎస్‌ఏ) అంటూ అసద్ కుటుంబానికి వ్యతిరేకంగా ఒకటి ఏర్పడింది. మిలిటెంట్ సంస్థలు ఐసిస్, జబాత్ అల్ నుస్రా, అల్ ఖైదా, ఖుర్దు గ్రూప్ లు చొరబడ్డాయి. అమెరికా, రష్యా, ఇరాన్, తుర్కియే, ఇజ్రాయెల్ వంటి దేశాలు కూడా అంతర్యుద్ధంలో చేరాయి. అయితే, రష్యా, ఇరాన్ మద్దతుతో అసద్ వీటిని అణచివేశారు. ఇప్పుడు ఇజ్రాయెల్ తో యుద్ధంలో ఇరాన్, ఉక్రెయిన్ తో యుద్ధంలో రష్యా బలహీనం కావడంతో మళ్లీ తిరుగుబాటుదారులు పుంజుకొన్నారు. అసద్ ను సాగనంపారు.
ఆ బాలుడు ఇప్పుడు యువకుడు..
2011లో అసద్ కు వ్యతిరేకంగా రాతలు రాసిన ఆ బాలుడు ఇప్పుడు 25 ఏళ్ల యువకుడు అయ్యాడు. అయితే, అతడు రాసిన రాతలు 55 ఏళ్ల సామ్రాజ్యాన్ని కూల్చాయి. అసద్ దేశం వదిలి పారిపోయేలా చేశాయి.