50 గ్రాముల రాయి.. విలువ రూ.850 కోట్లు.. తాజాగా పట్టేశారు
తాజాగా బిహార్ సరిహద్దులోని మోటార్ బైక్ మీద వస్తున్న ఇద్దరిని తనిఖీ చేస్తున్నప్పుడు ఈ విలువైన రాయి దొరికింది.
అవును.. ఆ రాయి బరువు అక్షరాల 50 గ్రాములే. కానీ.. దాని విలువ తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఖనిజాల్లో ఒకటైన దీన్ని బిహార్ నుంచి అక్రమంగా తరలిస్తున్న వేళ పోలీసులు పట్టేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో దీని విలువ గురించి తెలిసినంతనే నోరెళ్లబెడుతున్న పరిస్థితి. ఇంతకూ ఈ రాయి ఏంటి? దాని ప్రత్యేకత ఏంటి? సదరు రాయి గ్రాము ధర రూ.17 కోట్లు పలికే దీని ఇస్పెషల్ లోకి వెళితే..
'కాలిఫోర్నియం' అత్యంత అరుదైన రేడియో ధార్మిక పదార్థంగా చెబుతారు. ఇది సహజంగా దొరకదు. కేవలం ల్యాబుల్లో మాత్రమే దీన్ని తయారు చేసే అవకాశం ఉంది. అది కూడా తీవ్ర పీడనంతో కూడిన ఐసోటోప్ రియాక్టర్లలో మాత్రమే దీన్ని తయారు చేసే వీలుంది. ఎంతో వ్యయప్రయాసలతోనే దీన్ని తయారు చేసే అవకాశం ఉంది. ఈ అరుదైన కాలిఫోర్నియంను తయారు చేసే సామర్థ్యం ఉన్న అణు రియాక్టర్లు రెండే ఉన్నాయి.
అందులో ఒకటి అమెరికాలో ఉంటే.. రెండోది రష్యాలో మాత్రమే ఉంది. తాజాగా బిహార్ సరిహద్దులోని మోటార్ బైక్ మీద వస్తున్న ఇద్దరిని తనిఖీ చేస్తున్నప్పుడు ఈ విలువైన రాయి దొరికింది. దీని విలువ గురించి మొదట తెలీలేదు. ఆ తర్వాత తెలిసిన తర్వాత చెక్ చేస్తే.. అసలు విషయం తెలిసి అవాక్కు అయిన పరిస్థితి. ఈ విలువైన రాయి గురించి అణు ఇంధన శాఖకు సమాచారాన్ని అందించారు.
కాలిఫోర్నియం రాయిని 1950లో భౌతిక శాస్త్ర పరిశోధకులు స్టోన్లీ గెరాల్డ్ థాంప్సన్.. కెనెత్ స్ట్రీట్ జూనియర్.. అల్బర్ట్ గిరోసో.. గ్లెన్ టి. సీబోర్గ్ తయారు చేశారు. ఇంత విలువైన రాయిని దేనిలో వాడతారంటే.. భూగర్భంలోని బంగారు. వెండి నిల్వల అన్వేషణలతో పాటు చమురు.. నీటి పొరల్ని గుర్తించేందుకు ఉపయోగిస్తారు. ఇంతకూ ఈ విలువైన రాయి స్మగ్లింగ్ వెనుక ఎవరున్నారు? బిహార్ కు ఎలా వచ్చి చేరింది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.