పోలింగ్ కు 78 రోజులు... నేతల కష్టాలు పగోడికి కూడా రాకూడదు!!
ఇక నామినేషన్స్ ఉపసంహరణకు చివరి తేదీ ఏప్రిల్ 26 కాగా... పోలింగ్ తేదీ మే 13 అని ప్రకటించింది ఎన్నికల కమిషన్.
ఎన్నాళ్లో వేచిన ఉదయం వచ్చేసింది.. నేటి నుంచి ఏపీలో ఎన్నికల కోడ్ అమలులో ఉండనుంది.. ఈ నెల 18న గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుంది.. తర్వాత సుమారు రెండు నెలల 18 రోజులకు (78 రోజులు) మే 13న పోలింగ్ జరగనుంది. తర్వాత ఒక 20 రోజులు ఆ టెన్షన్ తట్టుకోగలిగితే జూన్ 4న కౌంటింగ్ జరగనుంది. దీంతో... ఈ నోటిఫికేషన్ నేతల గుండెల్లో పెద్ద బాంబు వేసినట్లే అని అంటున్నారు పరిశీలకులు.
అవును... లోక్ సభ ఎన్నికలతో పాటు ఏపీలోనూ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఇందులో భాగంగా... ఈ నెల 18న గెజిట్ నోటిఫికేషన్ వెలువడనుండగా... నామినేషన్ల స్వీకరణకు ఏప్రిల్ 25 ఆఖరి తేదీగా ఉంది. ఇక నామినేషన్స్ ఉపసంహరణకు చివరి తేదీ ఏప్రిల్ 26 కాగా... పోలింగ్ తేదీ మే 13 అని ప్రకటించింది ఎన్నికల కమిషన్. ఈ క్రమంలోనే జూన్ 4న కౌంటింగ్ అని తెలిపింది.
ఎలా చూసుకున్నా జూన్ 6 అనేది ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ముగియడానికి చివరి తేదీ అని ఈసీ వెల్లడించింది. అదంతా భాగానే ఉంది కానీ... ఏపీలో నేటి నుంచి మొదలుపెట్టుకుంటే... సుమారు రెండు నెలల 18 రోజుల తర్వాత పోలింగ్ జరగనుంది. దీంతో... ఇది చిన్న విషయం కాదని, నేతల నెత్తిపై పిడుగుపడినట్లేనని, ఇప్పటికే పలువురు నేతలు బెంగపట్టుకుని మంచమెక్కి ముసుగుతన్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి!
వాస్తవానికి ఎన్నికల నోటిఫికేషన్ రాగానే నెల రోజుల్లో ఎన్నికలు పూర్తయిపోతాయి.. కేడర్ లోనూ, జనాల్లోనూ ఆ వేడి అలా ఉండగానే అన్ని పనులూ పుర్తయిపోతాయి.. ఈ క్రమంలో ఒక నెల రోజుల పాటు కేడర్ ను మెయింటైన్ చేస్తూ, ప్రచార కారక్రమాలు నిర్వహిస్తూ, ఓటర్లలో ఆ టెంపో మెయింటైన్ చేస్తూ పోలింగ్ ముగించడం అంటే సరే! కానీ... సుమారు రెండు నెలల 18 రోజులు పాటు ఈ పైన చెప్పుకున్న పనులన్నీ చేయాలంటే...?
ఇప్పుడు ఇదే బిగ్ టాస్క్! ఈ విషయమే ఇప్పుడు నేతలకు ఈ రాత్రి నుంచే కంటిమీద కునుకులేకుండా చేసే విషయమని.. ప్రధానంగా ఖర్చుల లెక్కలు తలచుకుని తల్లడిల్లిపోతున్నారని.. ఇప్పటి వరకూ వేసిన లెక్కలు అన్నీ ఒక్కసారిగా తారుమారైపోయాయని.. గెలుపోటముల సంగతి కాసేపు పక్కనపెట్టి ఇప్పుడు ఈ టెన్షనే ఇప్పుడు వారిలో ఎక్కువైపోయిందని అంటున్నారు.
వాస్తవానికి ప్రచారం చేసుకోవడానికి ఇన్ని ఎక్కువ రోజులు ఉండటం ఒక రకంగా శుభవార్తే. కానీ... రోజు మారాయి, ఖర్చులు విపరీతంగా పెరిగాయి, దానికి తోడు ఈ ఏడాది ఎండలు మార్చిలోనే దుమ్ములేపుతున్నాయి.. ఈ సమయంలో ఈ పరిస్థితులన్నీ తట్టుకుని సుమారు రెండు నెలల 18 రోజుల పాటు ప్రధానంగా ఒక అభ్యర్థి నిలవాలంటే... కచ్చితంగా ఇది వారికి బ్యాడ్ న్యూస్ అనే అంటున్నారు. సమ్మర్ లో పడిన పిడుగని చెబుతున్నారు!