ఎలాన్ మస్క్ కు చేదు అనుభవం.. ఆకాశంలో పేలిన స్టార్ షిప్!
ప్రయోగంలో భాగంగా నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్ కొద్దిసేపటికే ఆకాశంలో పేలిపోయింది.
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కలల ప్రాజెక్టు స్టార్ షిప్ ఫెయిల్ అయ్యింది. ప్రయోగంలో భాగంగా నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్ కొద్దిసేపటికే ఆకాశంలో పేలిపోయింది. అయితే.. ఈ ప్రయోగంలో ఒక భారీ ఊరట ఆయనకు దక్కింది. 400 అడుగుల పొడవైన రాకెట్ భూమి మీద నుంచి ఆకాశంలోకి దూసుకెళ్లిన కాసేపటికే పేలిపోయిన వేళ.. నిప్పుల వర్షం చిమ్మినట్లైంది. శకలాలు కరీబియన్ సముద్రంలో పడిపోయాయి.
ఎలాన్ మాస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ ఎప్పటి నుంచో ఒక భారీ ప్రాజెక్టును చేపట్టింది. భారీ పునర్ వినియోగ రాకెట్ అయిన స్టార్ షిప్ ను సక్సెస్ చేయాలని తపిస్తోంది. తాజా ప్రయోగంలో ఎదురుదెబ్బ తగిలినప్పటికి.. రాకెట్ బూస్టర్ మాత్రం క్షేమంగా భూమి మీదకు తిరిగి రావటం.. ఆ సంస్థకు.. ఎలాన్ మస్క్ కు ఊరట కలిగించే అంశంగా చెప్పాలి.
టెక్సాస్ లోని మెక్సికో సరిహద్దులోని బొకా చికా బీచ్ నుంచి అమెరికా కాలనమానం ప్రకారం గురువారం సాయంత్రం 4.37 గంటల వేళలో స్టార్ షిప్ రాకెట్ ను ప్రయోగించారు. ఈ రాకెట్ లో పది డమ్మీ శాటిలైట్లనను నింగిలోకి మోసుకెళ్లేలా ప్లాన్ చేశారు. ఈ ప్రయోగం మొదలైన ఎనిమిది నిమిషాలకు రాకెట్ తో సంబంధాలు తెగిపోయాయి. స్పేస్ క్రాఫ్టులోని ఆరు ఇంజిన్లు ఒకదాని తర్వాత మరొకటి పని చేయటం ఆగిపోయింది.
రాకెట్ భూమిపైకి తిరిగి వస్తూ గాల్లోనే పేలిపోయింది. అయితే.. ఈ ప్రయోగాన్ని ప్రయోగాత్మకంగానే స్టార్ షిప్ ప్రయోగించినట్లు పేరకొన్నారు. రాకెట్ పేలిపోయిన బాధలో ఉన్నప్పటికి.. బూస్టర్ మాత్రం క్షేమంగా తిరిగి రావటం సంతోషకరమైన అంశంగా చెబుతున్నారు. ఈ బూస్టర ను టెక్సాస్ లోని లాంచ్ ప్యాడ్ పట్టేసుకున్నట్లుగా వెల్లడించారు. తాజా ప్రయోగం ఫెయిల్ అయినప్పటికీ స్టార్ షిప్ విశ్వసనీయతను మాత్రం మరింత పెంచేలా చేసిందని చెబుతున్నారు. ఇలాంటి వైఫల్యాలు రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని స్పేస్ ఎక్స్ చెబుతోంది. మరోవైపు తన ప్రయోగం ఫెయిల్ అయిన.. రాకెట్ శకలాలు సముద్రంలో పడిపోతున్న ద్రశ్యాల్ని ఎలాన్ మస్క్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.