జగన్‌ పై ఆరా మస్తాన్‌ సంచలన వ్యాఖ్యలు!

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అంతా ఆరా మస్తాన్‌ ఎగ్జిట్‌ పోల్‌ కోసం ఎదురుచూశారు.

Update: 2024-07-04 12:30 GMT

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అంతా ఆరా మస్తాన్‌ ఎగ్జిట్‌ పోల్‌ కోసం ఎదురుచూశారు. గతంలో ఏపీ, తెలంగాణ ఎన్నికల సందర్భంగా ఆయన ఎగ్జిట్‌ పోల్స్‌ నిజం కావడంతో ఆయనకు ప్రాధాన్యత పెరిగింది. ముఖ్యంగా గతేడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీకి 65 సీట్లు రావచ్చని ఆరా మస్తాన్‌ అంచనా వేయగా కాంగ్రెస్‌ 64 సీట్లను గెలుచుకుంది. ఈ నేపథ్యంలో ఏపీ ఎన్నికల సందర్భంగా ఆరా మస్తాన్‌ ఎగ్జిట్‌ పోల్‌ కోసం అటు మీడియా సంస్థలు, ఇటు సాధారణ ప్రజలు ఎదురుచూశారు.

ఈ క్రమంలో వైసీపీ మరోమారు విజయం సాధిస్తుందని ఆరా మస్తాన్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే. వైసీపీకి 94–104 స్థానాల వరకు వస్తాయని ఆయన అన్నారు. దీనికి మరో 10 స్థానాలు ఎక్కువే రావచ్చు కానీ తక్కువ వచ్చే పరిస్థితి లేదని చెప్పారు. అయితే ఆరా ఎగ్జిట్‌ పోల్స్‌ ఘోరంగా అంచనాలు తప్పాయి.

ఎన్నికల ఫలితాల రోజు మొదటి రెండు గంటల వరకు ఒక మీడియా సంస్థకు వచ్చిన ఆరా మస్తాన్‌ అప్పుడు కూడా తన నమ్మకాన్ని వదల్లేదు. అయితే ఆ రోజు ఉదయం 10 గంటలకు దాదాపు ఫలితాల సరళి తెలిసిపోవడంతో ఆరా మస్తాన్‌ ఆ మీడియా సంస్థ నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత అప్పటి నుంచి అదృశ్యమయ్యారు.

మళ్లీ కొద్ది రోజుల క్రితం ఒక యూట్యూబర్‌ కు ఆరా మస్తాన్‌ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతా నిజమే చెబుతానంటూ భగవద్గీత, ఖురాన్‌ లపై ప్రమాణం కూడా చేశారు.

వైఎస్‌ జగన్‌ ఎప్పుడూ తనను కలవలేదని.. అలాగే తానెప్పుడూ ఈ ఎన్నికల కోసం కలవలేదని ఆరా మస్తాన్‌ స్పష్టం చేశారు. అలాగే జగన్‌ తరఫున తనను ఎవరూ సంప్రదించడం చేయలేదన్నారు. అయితే వైసీపీలో ఉన్న కొందరు నేతలు వ్యక్తిగతంగా తనతో సర్వే చేయించుకున్నారని చెప్పారు.

వైసీపీకి అనుకూలంగా సర్వే ఇవ్వాలని ఎవరైనా మిమ్మల్ని కోరారా అని యూట్యూబర్‌ ప్రశ్నించగా ఆరా మస్తాన్‌ అదేమీ లేదని తేల్చిచెప్పారు. తనకు తెలిసి కూడా జగన్‌ వ్యక్తిత్వం కూడా అలాంటిది కాదన్నారు. ఒకరిని పిలిచి తనకు అనుకూలంగా ఉండాలని కోరే తత్వం జగన్‌ ది కాదన్నారు. అలా అయితే పార్టీని వీడి వెళ్లిపోయిన వల్లభనేని బాలశౌరి, రఘురామకృష్ణరాజు, కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డి తదితర నేతలను జగన్‌ పిలిపించి మాట్లాడేవారని ఆరా మస్తాన్‌ గుర్తు చేశారు. వాళ్లందరినీ జగన్‌ వదులుకున్నారన్నారు.

జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు వెళ్లి చంద్రబాబును కలిసొచ్చిన తర్వాత కూటమికి అనుకూలంగా పరిస్థితులు బాగా మారాయని ఆరా మస్తాన్‌ అభిప్రాయపడ్డారు. ఏపీ ఎన్నికల్లో పవన్‌ కళ్యాణ్‌ చాలా క్రియాశీలక పాత్ర పోషించారన్నారు.

తాను ఈ ఎన్నికల సందర్భంగా ప్రీ పోల్, పోస్ట్‌ పోల్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ నిర్వహించానన్నారు. తాము చేసిన సర్వేను మరోసారి కూడా నిర్ధారించుకున్నామన్నారు. తాము సర్వే చేసిన చోట్ల ప్రజలు ఎక్కువ మంది వైసీపీకే ఓటేశామని చెప్పారన్నారు. మరి ఎక్కడ పొరపాటు జరిగిందో అర్థం కావడం లేదని ఆరా మస్తాన్‌ తెలిపారు. మరోసారి క్షేత్ర స్థాయి నుంచి కేంద్ర స్థాయి వరకు తమ ఎగ్జిట్‌ పోల్‌ ను పరిశీలించుకుంటున్నామని చెప్పారు.

తాము సర్వే చేపట్టిన సమయంలో (ఎన్నికల ముందు) ప్రభుత్వ పథకాలు అందుకుంటున్న ఓటర్లు జగన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెబితే ఆ పథకాలు రావేమోనన్న భయంతో అసలు నిజం చెప్పలేదేమోనన్న అనుమానం ఇప్పుడు కలుగుతుందన్నారు. అందుకే ప్రస్తుతం ఎక్కడ తేడా కొట్టిందో తెలుసుకుంటున్నామన్నారు.

తనకు సర్వేలు ఆపే ఉద్దేశం లేదన్నారు. ప్రస్తుతం హరియాణా ఎన్నికలకు సంబంధించి సర్వే చేస్తున్నామన్నారు. దీని తర్వాత మరికొన్ని రాష్ట్రాలకు సంబంధించిన సర్వేలు కూడా చేస్తామని ఆరా మస్తాన్‌ చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News