ఓట్ల లెక్కింపు జరిగేదిలా.. రూల్ బుక్ చెప్పేదిదే
కేంద్ర ఎన్నికల సంఘం మాన్యువల్ ప్రకారం ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి కచ్ఛితమైన విధివిధానాలు ఉన్నాయి.
సార్వత్రిక ఎన్నికలతో పాటు కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో చివరి అంకం షురూ అయ్యింది. ఓట్ల లెక్కింపు ఈ రోజు (మంగళవారం) ఎనిమిది గంటలకు మొదలైంది. ఇంతకూ ఓట్ల లెక్కింపు ఎలా జరుగుతుంది? దాని ప్రాసెస్ ఏంటి? రూల్ బుక్ లో ఓట్ల లెక్కింపు గురించి ఏం చెప్పారు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికితే ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తాయి.
కేంద్ర ఎన్నికల సంఘం మాన్యువల్ ప్రకారం ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి కచ్ఛితమైన విధివిధానాలు ఉన్నాయి. 1961లో చట్టంగా వచ్చిన దీన్ని ‘ఎన్నికల నిర్వహణ నిబంధనలు-1961గా వ్యవహరిస్తారు. రూల్ 54ఏ ప్రకారం పోస్టల్ బ్యాలెట్ పత్రాల్ని తొలుత లెక్కిస్తారు. రిటర్నింగ్ అధికారి టేబుల్ వద్ద ఈ ప్రక్రియ మొదలవుతుంది. కౌంటింగ్ ప్రారంభ సమయానికి ముందు అందిన పోస్టల్ బ్యాలెట్లను లెక్కింపు కోసం వీటిని పరిగణలోకి తీసుకుంటారు.
పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు మొదలైన అరగంట తర్వాత ఈవీఎంలలోని ఓట్లను లెక్కించటం మొదలు పెడతారు. ఒకవేళ ఏదైనా నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్లు ఏమీ లేకుంటే.. 8 గంటల నుంచే ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. కౌంటింగ్ కు ఫారం 17 సీతో పాటు.. ఈవీఎంలలోని కంట్రోల్ యూనిట్లు ఉంటే సరిపోతుంది. సీయూల నుంచి ఫలితాల్ని వెల్లడించే ముందు వాటిపై పేపర్ సీల్ చెదిరిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మొత్తం పోలైన ఓట్లను ఫారం 17సీలో పేర్కొన్న సంఖ్యతో సమానంగా ఉన్నాయా? లేదా? అన్నది చూసుకోవాల్సి ఉంటుంది.
సీయూలోని రిజల్ట్ ను కౌంటింగ్ సూపర్ వైజర్.. మైక్రో అబ్జర్వర్.. అభ్యర్థుల తరఫు కౌంటింగ్ ఏజెంట్లకు చూపాలి. అనంతరం అభ్యర్థుల వారీగా వచ్చిన రిజల్ట్ ను ఫారం 17సీలో పార్టు 2లో నమోదు చేయాల్సి ఉంటుంది. సీయూలోని డిస్ ప్లే ప్యానెల్ లో ఒకవేళ ఫలితం కనిపించకుంటే.. అన్ని సీయూల లెక్కింపు పూర్తి అయ్యాక.. ఆయా వీవీ ప్యాట్ లలోని స్లిప్పుల్ని లెక్కించాలి. ప్రతి పోలింగ్ స్టేషన్ కు చెందిన ఫారం17సీని తుది ఫలితాన్ని అధికారికి పంపాలి. ఆ అధికారి వాటిని ఫారం 20లో పొందుపరుస్తారు.
ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక.. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం లేదా లోక్ సభ సీటు పరిధిలోని ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఐదు పోలింగ్ స్టేషన్లను ర్యాండమ్ గా ఎంపిక చేసుకొని.. వాటిలో పోలైన ఓట్లతో వీవీ ప్యాట్ స్లిప్పులను సరిచూసుకోవాలి. రిజెక్టు అయిన పోస్టల్ బ్యాలెట్ల సంక్య కంటే మెజార్టీ తక్కువగా ఉంటే.. రిజెక్టు అయిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లను తప్పనిసరిగా పున:పరిశీలించాలి. ఆ తర్వాతే తుది ఫలితాన్ని వెల్లడించాల్సి ఉంటుంది. చివరగా.. ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు వస్తే డ్రా విధానంలో ఫలితాన్ని ప్రకటిస్తారు.