టీడీపీలోకి విజయసాయిరెడ్డి.. బాంబుపేల్చిన టీడీపీ నేత!

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే.

Update: 2024-09-27 09:53 GMT

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. కేవలం 11 అసెంబ్లీ స్థానాలు, 4 ఎంపీ స్థానాలను మాత్రమే గెలుచుకుంది. ఈ నేపథ్యంలో వైసీపీకి రాజీనామాలు చేసే నేతల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మేయర్లు, మున్సిపాలిటీ చైర్మన్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఆ పార్టీని వీడారు.

కాగా రాజ్యసభలో వైసీపీకి 11 మంది ఎంపీలు ఉన్నారు. వీరిలో ఇప్పటికే ముగ్గురు రాజీనామా చేశారు. మోపిదేవి వెంకట రమణారావు, బీద మస్తాన్‌ రావు, ఆర్‌.కృష్ణయ్య తమ రాజ్యసభ పదవులకు రాజీనామాలు ప్రకటించారు. మోపిదేవి, బీద టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఆర్‌.కృష్ణయ్య బీజేపీలో చేరతారని టాక్‌ నడుస్తోంది.

మరోవైపు వైసీపీలో నంబర్‌ టూగా చక్రం తిప్పుతున్న విజయసాయిరెడ్డి కూడా టీడీపీలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారని టీడీపీ సీనియర్‌ నేత, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు బాంబుపేల్చారు.

విజయసాయిరెడ్డి గత రెండు పర్యాయాలుగా వైసీపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. అంతేకాకుండా వైసీపీ రాజ్యసభా పక్ష నేతగా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా లోక్‌ సభ, రాజ్యసభలో వైసీపీ ఎంపీల అందరికీ పార్లమెంటరీ పార్టీ నేతగా కూడా ఉన్నారు.

ఈ ఏడాది జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో విజయసాయిరెడ్డి నెల్లూరు నుంచి లోక్‌ సభకు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి ఆయనపై విజయం సాధించారు.

గతంలోనే విజయసాయిరెడ్డి బీజేపీలో చేరతారని వార్తలు వచ్చాయి. జగన్‌ తో విభేదాలు వచ్చినట్టు ప్రచారం జరిగింది. వైసీపీలో విజయసాయిరెడ్డికి ఒక దశలో ప్రాధాన్యత బాగా తగ్గిపోవడం.. అదే సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డికి ప్రాధాన్యత పెరగడం ఇందుకు నిదర్శనమని టాక్‌ నడిచింది.

అయితే విజయసాయిరెడ్డి వైసీపీలోనే కొనసాగారు. ఈ నేపథ్యంలో తాజాగా అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ విజయసాయిరెడ్డి తమ పార్టీలో చేరతానని తమను వేడుకున్నట్టు బాంబుపేల్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులయితే టీడీపీలో చేరతానంటూ విజయసాయిరెడ్డి 95 రోజులపాటు తమను ప్రాధేయపడ్డారని అచ్చెన్నాయుడు వెల్లడించారు. అయితే టీడీపీలో చేరేందుకు అలాంటివారికి చోటు లేదని ముఖం మీదే చెప్పేశామన్నారు.

టీడీపీలో చేరేందుకు విజయసాయిరెడ్డి అన్ని విధాలుగా ప్రయత్నించారని అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ క్రమంలో ఏం చేయడానికైనా ఆయన సిద్ధపడ్డారని చెప్పారు. ఈ నేపథ్యంలో అచ్చెన్నాయుడి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరి విజయసాయిరెడ్డి ఈ వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే.

Tags:    

Similar News