బెజవాడలో బీరుపై నటుడు సెటైర్... వీడియో వైరల్!
ఏపీలో లభిస్తున్న మధ్యం బ్రాండ్ లపై ఎప్పటినుంచో సెటైర్స్ పడుతున్న సంగతి తెలిసిందే
ఏపీలో లభిస్తున్న మధ్యం బ్రాండ్ లపై ఎప్పటినుంచో సెటైర్స్ పడుతున్న సంగతి తెలిసిందే. ప్రెసిడెంట్ మెడల్, బూం బూం, యంగ్ స్టార్, గెలాక్సీ, బ్లాక్ బాస్టర్ అనే పేర్లతో కొత్త మద్యం అమ్ముడవుతున్న సంగతి తెలిసిందే. దీంతో... ఈ పేర్లు గతంలో ఎప్పుడూ వినలేదని బాదపడుతూనే సంతోషంగా తాగుతున్నారు మందుబాబులు అనే కామెంట్లు వినిపిస్తుంటాయి.
అయితే... చంద్రబాబు తన పాలన ముగుస్తున్న సమయంలో ఈ కొత్త బ్రాండ్ లన్నింటికీ హుటాహుటిన అనుమతులు ఇచ్చారని, గత ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను ఇప్పటి ప్రభుత్వం కొనసాగించడం మినహా మరో ఆప్షన్ లేదని, అన్నీ తెలిసి ఏపీ సర్కార్ పై బురదజల్లుతున్నారని టీడీపీ నేతలపై ఏపీ మంత్రులు అసెంబ్లీ సాక్షిగా ఫైరయైన సంగతులు తెలిసిందే. ఈ సమయంలో జీవోలను కూడా ప్రస్థావించారు!
దీంతో ఇప్పుడున్న కొత్త బ్రాండ్ లకు గత ప్రభుత్వ హయాంలోనే అనుమతులు వచ్చాయా.. ఇదంతా ఇప్పటికిప్పుడు పుట్టిన వ్యవహారం కదా అనే చర్చ ఏపీలో జరిగింది! ఈ సమయంలో తాజాగా సినీ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ బూం బీర్ తాగుతూ.. ఇంట్లో కూడా చెప్పలేదు, తనకు ఏమైనా అయితే మరిచిపోవద్దు అని చెబుతూ ఒక వీడియో విడుదల చేశారు.
అవును... ఏపీలో లభించే బీరు గురించి మాట్లాడుతూ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో... "మద్యపానం, దూమపానం ఆరోగ్యానికి హానికరం.. బాధ్యత గల పౌరుడిని" అని మొదలుపెట్టిన ఆయన... "ఇవాళ బెజవాడలో ఉన్నాను. డిప్రెషన్ లో ఉండి బీరు తెచ్చుకున్నాను" అని ఆ బాటిల్ ని చూపించారు.
"ఇది మామూలు బీరు కాదు. మా ఇంట్లో కూడా చెప్పలేదు, మిత్రులకు కూడా చెప్పలేదు. మీ అందరికీ చెబుతున్నా.. అంటూ బీర్ బాటిల్ ని చూపించారు! అనంతరం.. "ఏమవుతాదో తెలియదు. నన్ను గుర్తుపెట్టుకోండి మరిచిపోవద్దే.. ఇట్లు శ్రీకాంత్ అయ్యంగార్" అంటూ గ్లాస్ ఎత్తారు! ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది.