`ఆదిమూలం - అత్యా*చారం`.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన ఎమ్మెల్యే!
కోనేటి ఆదిమూలం. ఇప్పుడు సోషల్ మీడియాలోనే కాదు.. ప్రధాన మీడియా స్రవంతిలోనూ.. హాట్ టాపిక్‌గా మారిన పేరు.
కోనేటి ఆదిమూలం. ఇప్పుడు సోషల్ మీడియాలోనే కాదు.. ప్రధాన మీడియా స్రవంతిలోనూ.. హాట్ టాపిక్‌గా మారిన పేరు. చిత్తూరు జిల్లా ఎస్సీ నియోజకవర్గం సత్యవేడు నుంచి టీడీపీ తరఫున గెలిచిన ఆయన అంతకుముందు.. వైసీపీలోనే ఉన్నారు. తాజాగా టీడీపీ మహిళా కార్యకర్తపై ఆయన పదే పదే అత్యాచారం చేశారన్న వార్త వెలుగు చూడడంతో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. వెంటనే ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు.అయితే.. ఆదిమూలం అత్యాచారానికి సంబంధించి ఓ రహస్య వీడియో మీడియాలో జోరుగా వైరల్ అయింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా.. ఇదే విషయం రాజకీయంగా చర్చకు వస్తోంది.
ఇదిలావుంటే.. తాజాగా ఎమ్మెల్యే ఆదిమూలం బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. బాధితురాలు తనకు సోదరి లాంటిదని చెప్పుకొచ్చారు. ఆమె టీడీపీలో మండలస్థాయి నాయకురాలని.. ఎన్నికల సమయంలో తనతో కలిసి ప్రచారం చేసిన మాట వాస్తవమేనని చెప్పారు. ఎన్నికలకు ముందు నుంచి ఆమె తనతో కలిసి ప్రజాక్షేత్రంలో పర్యటించి ప్రచారం చేసిందన్నారు. అలాంటి ఆమెపై తాను అఘాయిత్యానికి ఎలా ఒడిగడతానని ఆయన ఎదురు ప్రశ్నించారు. తనపై ప్రత్యర్థులు(వైసీపీ) కుట్రం చేస్తున్నారని ఆదిమూలం బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. వాస్తవానికి వీడియో కళ్లముందు కనిపిస్తుంటే.. కుట్ర ఏంటనేది ఆయనకే తెలియాలి.
ఇక, తాను ప్రజాసేవకుడినని.. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని.. చెప్పుకొచ్చారు. తాను ఇలాంటి పనులు ఎప్పుడూ చేయలేదన్నారు. తనపై కుట్రతోనే `ఆమె` ప్రత్యర్థులతో చేతులు కలిపి ఇలా చేస్తున్నారని ఆరోపించారు. నిజానిజాలు దేవుడికే తెలియాలని వ్యాఖ్యానించారు. తాజాగా ఆయన మీడియాకు సందేశం పంపించారు. ``నేను ఎలాంటి తప్పు చేయలేదు. విశ్వసనీయత ఉన్న వ్యక్తిని. ఆమె ఎలా వచ్చిందో, ఎలా పోయిందో నాకు తెలీదు. దేవుడి సాక్షిగా, నా బిడ్డల సాక్షిగా చెబుతున్నా. నేను ఏమైనా తప్పు చేశానా లేదా అనేది ఆమెనే అడగండి. ఆమెతో చర్చించేందుకు కూడా నేను సిద్ధం`` అని ఆదిమూలం వ్యాఖ్యనించారు.