సెన్సివిటీ పాలిటిక్స్: ఒక్కసారి శీనన్న ముఖం చూడండి.. అనగానే మహిళలు ఏం చేశారంటే!
తాజాగా ఆయన ఎన్నికల ప్రచారానికి సంబంధించి సొంత గ్రామం రుద్రంగిలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడి నాయకులు మహిళలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
మహిళలు అనగానే సునిశిత మనస్తత్వానికి ప్రతీక. ఎక్కడో ఒకరిద్దరు మాత్రమే కఠోరంగా ఉంటారు. మెజారిటీ మహిళల మనసు వెన్న. బహుశ ఈ విషయాన్ని గుర్తించారో .. ఏమో.. ప్రస్తుత తెలంగాణ ఎన్నికల్లో అభ్యర్థులు మహిళల సెన్సివిటీ పాలిటిక్స్ ను ప్లే చేస్తున్నారు. ఈ క్రమంలో మహిళలను మరింతగా తమవైపు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. మహిళా ఓటు బ్యాంకు ఎక్కువగా ఉండడం.. వారి ఓటు పడితే తప్ప.. గెలుపు గుర్రం ఎక్కలేమని భావిస్తున్న నేపథ్యంలో అభ్యర్థులు మహిళల కేంద్రం గా రాజకీయాలు చేస్తున్నారు.
తాజాగా వేములవాడ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ ఇదే పనిచేశారు. ఈయన వరుసగా నాలుగు సార్లు ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నా.. విజయాన్ని అందుకోలేకపోతున్నారు. తాజా ఎన్నికలలోనూ మరోసారి ఆయన టికెట్ దక్కించుకుని బరిలో నిలిచారు. ఈ క్రమంలో ఆయన మహిళా ఓటు బ్యాంకును తనవైపు తిప్పుకొనేందుకు సెన్సిటివిటీ పాలిటిక్స్‌ను ప్లే చేశారు. తాజాగా ఆయన ఎన్నికల ప్రచారానికి సంబంధించి సొంత గ్రామం రుద్రంగిలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడి నాయకులు మహిళలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
"ఒక్కసారి శీనన్న ముఖం చూడండి. నాలుగుసార్లు ఓడినా మన వెంటే ఉన్నారు. ఏ చిన్న సమస్య వచ్చినా అండగా నిలిచారు. అధికారంలో లేకున్నా మన బతుకుల్లో వెలుగులు చూస్తూ ఆయన జీవితాన్ని మరిచిపోయారు. ఈసారైనా హర్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించుకుందాం. ఇక్కడున్న తల్లులు, అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములకు పాదాభివందనం చేస్తున్నాం. అందరినీ అర్థిస్తున్నాం. చేతులెత్తి మొక్కుతున్నాం" అంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. దీంతో, రోడ్ షోకు హాజరైన మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. ఆది శ్రీనివాస్‌కు జేజేలు కొట్టారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిపించి తీరుతామని మహిళలు ముక్తకంఠంతో చెప్పుకొచ్చారు. ఇదీ.. సంగతి!!