బాబూ బీజేపీని నమ్మొద్దు.. ఆ పదవిని తీసుకోండి!
ఈ నేపథ్యంలో శివసేన (ఉద్ధవ్) విభాగం నేత ఆదిత్య ఠాక్రే.. చంద్రబాబుకు కీలక సూచన చేశారు. లోక్ సభ స్పీకర్ పదవిని తీసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ, లోక్ సభ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. కూటమి ధాటికి వైసీపీ కకావికలమైంది. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులోనూ టీడీపీ చక్రం తిప్పనుంది. టీడీపీకి 16 లోక్ సభ స్థానాలు వచ్చాయి. జనసేన పార్టీ రెండు ఎంపీ స్థానాలను గెలుచుకుంది. ఈ 18 స్థానాలు మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా ఎన్నిక కావడంలో కీలక పాత్ర పోషించనున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 272 మంది ఎంపీలు అవసరం కాగా బీజేపీ 240 స్థానాలకే పరిమితమైన సంగతి తెలిసిందే. మెజార్టీకి 32 స్థానాల దూరంలో బీజేపీ ఆగిపోయింది.
ఈ నేపథ్యంలో ఎన్డీయే కూటమిలో బీజేపీ తర్వాత అతిపెద్ద పార్టీగా టీడీపీ ఉంది. ఆ తర్వాత జేడీయూ నిలుస్తోంది. జేడీయూకి 12 ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఈ క్రమంలో కేంద్రంలో సంకీర్ణ సర్కారులో టీడీపీదే కీలక పాత్ర. ఈ నేపథ్యంలో తమకు నాలుగైదు కేబినెట్ మంత్రి పదవులు, రెండు సహాయ మంత్రి పదవులను చంద్రబాబు అడుగుతున్నట్టు తెలుస్తోంది. అలాగే గతంలో లోక్ సభ స్పీకర్ పదవిని టీడీపీ చేపట్టి ఉండటంతో ఈసారి కూడా తమకు లోక్ సభ స్పీకర్ పదవిని కేటాయించాలని అడుగుతున్నట్టు సమాచారం.
అయితే స్పీకర్ తో సహా కీలక శాఖలను మిత్ర పక్షాలకు కేటాయించే ఉద్దేశంలో బీజేపీ లేదని అంటున్నారు. కీలక శాఖలు మినహాయించి ఇతర శాఖలనే మిత్ర పక్షాలకు కేటాయించవచ్చని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో శివసేన (ఉద్ధవ్) విభాగం నేత ఆదిత్య ఠాక్రే.. చంద్రబాబుకు కీలక సూచన చేశారు. లోక్ సభ స్పీకర్ పదవిని తీసుకోవాలని కోరారు. ఆ పదవిని బీజేపీకి వదిలేయొద్దన్నారు. తమ అనుభవాల దృష్ట్యా ఈ సూచన చేస్తున్నామని ఆయన సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ లో పోస్టు చేశారు.
మిత్ర పక్షాలను చీల్చి లబ్ధి పొందడం బీజేపీకి అలవాటు అని ఆదిత్య ఠాక్రే గుర్తు చేశారు. గతంలో తమ పార్టీని ఇలాగే చీల్చారన్నారు. అందువల్ల స్పీకర్ పదవిని టీడీపీ తీసుకోవాలన్నారు. స్పీకర్ పదవిని తీసుకుంటే బీజేపీ మిత్రపక్షాలను చీల్చే అవకాశం ఉండదన్నారు.
జేడీయూకూ కూడా ఆదిత్య ఠాక్రే ఇదే సూచన చేశారు. స్పీకర్ పదవిని మిత్ర పక్షాలు తీసుకోవాలని సూచించారు. బీజేపీ స్పీకర్ పదవిని తీసుకుంటే పార్టీలను చీల్చడం ఖాయమని హెచ్చరించారు. మరి శివసేన నేత సూచించినట్టు టీడీపీ, జేడీయూ స్పీకర్ పదవి కోసం పట్టుబడతాయో, లేదో వేచిచూడాల్సిందే.