ఆడపిల్లే ముద్దు... దత్తత విషయంలో దంపతుల నిర్ణయం!

"కంటే కూతుర్నే కనాలిరా.. మనసుంటే మగాడిలా పెంచాలిరా" అనే పాట ఎంత ఫేమస్ అనేది తెలిసిన విషయమే

Update: 2024-05-23 04:12 GMT

"కంటే కూతుర్నే కనాలిరా.. మనసుంటే మగాడిలా పెంచాలిరా" అనే పాట ఎంత ఫేమస్ అనేది తెలిసిన విషయమే! ప్రతీ ఇంటిలోనూ అబ్బాయిలు ఎంతమంది ఉన్నా.. ఒక్క ఆడపిల్ల నట్టింట్లో తిరుగుతుంటే ఆ కళే వేరని అంటారు. అయినప్పటికీ ఇప్పటికీ ఆడపిల్లలలపై వివక్ష ఉందని బాదపడాలా.. ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పట్టిందని సంతోషించాలా అనే ప్రశ్నల సంగతి కాసేపు పక్కనపెడితే... తాజాగా అమ్మాయిల దత్తత వైపే దంపతుల మొగ్గు అనే విషయం తాజాగా తెరపైకి వచ్చింది.

అవును... సంతానం కలగని దంపతులు భగవంతుడిని నిందిస్తూ కూర్చోకుండా తల్లితండ్రులకు దూరమైన చిన్నారులు అనాథలుగా మిగిలిపోకుండా వారిని చేరదీసి మమకారాన్ని పంచేందుకు కదులుతున్నారు. పలువురు బుజ్జాయిలను దత్తత తీసుకున్నారు. ఈ క్రమంలో దత్తత విషయంలో అబ్బాయిల కంటే అమ్మాయిలవైపే దంపతులు ఎక్కువ మొగ్గు చూపుతున్నారనే విషయం తాజాగా తెరపైకి వచ్చింది.

ఇదే క్రమంలో... చిన్నారులను దత్తత తీసుకుంటున్న వారిలో ప్రవాసులూ భారీగానే ఉన్నారని అంటున్నారు. ఇందులో భాగంగా... అమెరికా, ఆస్ట్రేలియా, స్పెయిన్, యూకే, ఇటలీ, బెల్జియం, కెనడా తదితర దేశాలకు చెందిన ప్రవాసాంధ్రులే కాదు... ఆయా దేశాల వారూ మన చిన్నారుల్ని దత్తత తీసుకున్నారట. ఇదే క్రమంలో... మన రాష్ట్రంతోపాటు తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళకు చెందిన వారూ దత్తత తీసుకున్న వారిలో ఉన్నారట.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 14 శిశు గృహాల్లో 110 మంది చిన్నారులున్నారని అంటున్నారు. వీరంతా 0-6 ఏళ్లలోపు వారు కాగా.. వీరి దత్తత కోసం 1,018 మంది దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. ఇదే క్రమంలో గత నాలుగేళ్లలో దత్తత వెళ్లిన శిశువులు 325 మంది ఉండగా వారిలో అమ్మాయిలు 186 మంది కాగా.. అబ్బాయిల సంఖ్య 139గా ఉంది!

వీరిలో ఈ నాలుగేళ్లలో ఇతర దేశాలకు చెందిన వారు దత్తత తీసుకున్న పిల్లల విషయానికొస్తే... వారి మొత్తం సంఖ్య 63 ఉండగా.. వారిలో అమ్మాయిలు 39, అబ్బాయిలు 24గా ఉన్నారు!

Tags:    

Similar News