కల్తీ నెయ్యి అపచారంపై ఆగమ సలహాదారుల మల్లగుల్లాలు!

అయితే.. ఈ విధానంలో మూడు రోజుల పాటు భక్తుల దర్శనాలకు ఇబ్బందులు ఎదురయ్యే వీలుంది. అదే జరిగితే లక్షలాది మంది భక్తులకు ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి.

Update: 2024-09-22 05:12 GMT

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వినియోగించిన ఆవునెయ్యిలో జంతుకొవ్వులు ఉండటం.. దీనిపై వెలుగు చూసిన అంశాలు సంచలనంగానే కాదు షాకింగ్ గా మారాయి. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బ తిన్న పరిస్థితి. ఇలాంటి వేళ.. జరిగిన అపచారంపై ఏం చేయాలి? శాంతికి ఉన్న అవకాశాలేంటి? ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు సంప్రోక్షణ ఏమిటి? అదెలా ఉండాలి? లాంటి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఆవునెయ్యి పేరుతో జంతు కొవ్వులతో తయారు చేసిన నెయ్యిని స్వామి వారి ప్రసాదం కోసం వినియోగించిన వైనంపై దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ఈ నేపథ్యంలో టీడీపీ పరిపాలనా భవనంలో ఆగమ సలహాదారులు. అర్చకులతో ఈవో శ్యామలరావు భేటీ అయ్యారు. జరిగిన అపచారానికి పరిష్క్రతి ఏంటి? సంప్రోక్షణ కింద ఏం చేయాలి? దానికున్న దారులు ఏమిటన్న దానిపై ఎడతెరిపి లేకుండా చర్చలు సాగుతున్నాయి. జరిగిన అపచారాన్ని పరిహారం చేసేందుకు ఆగమ కమిటీ పలు సూచనలు చేసింది. అందులో భాగంగా మూడు రోజుల పాటు ఆలయంలో మహాశాంతి యాగం నిర్వహించాలనే ప్రతిపాదన వచ్చింది.

అయితే.. ఈ విధానంలో మూడు రోజుల పాటు భక్తుల దర్శనాలకు ఇబ్బందులు ఎదురయ్యే వీలుంది. అదే జరిగితే లక్షలాది మంది భక్తులకు ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి. దీంతో.. ప్రత్యామ్నాయ దారులు ఇంకేం ఉన్నాయన్న దానిపై చర్చ జరుగుతోంది. శనివారం మొత్తం చర్చ జరిగినా.. తుది నిర్ణయం తీసుకోకపోవటంతో ఆదివారం మరోసారి భేటీ కావాలని డిసైడ్ అయ్యారు. ఈ రోజు (ఆదివారం) మరోసారి ఆగమ సలహాదారులు.. అర్చకులతో ఈవో శ్యామలరావు భేటీ కానున్నారు. వేణుగోపాల దీక్షితులు.. నలుగురు ఆగమ సలహాదారులు.. అదనపు ఈవో వెంకయ్య చౌదరి తదితరులు భేటీ కానున్నారు.

ఇప్పటివరకు జరిగిన చర్చల ప్రకారం లడ్డూలో వాడకూడని పదార్థాల్ని వినియోగించిన నేపథ్యంలో తిరుమల అపవిత్రం అయ్యిందని భావించి.. తిరుమల క్షేత్రాన్ని పవిత్రం చేయాల్సిన కార్యక్రమాలను రూట్ మ్యాప్ సిద్ధం చేయనున్నారు. ఇందులో భాగంగా తొలుత లడ్డూలు తయారు చేసే పోటుతో పాటు.. నెయ్యి భద్రపరిచిన ప్రదేశాలను సంప్రోక్షణ చేయనున్నారు. దీనికి గాను వైదిక.. ఆగమ శాస్త్ర పద్దతుల్ని ఆచరించాలని నిర్ణయించారు.

సాధారణంగా చిన్న చిన్న తప్పిదాలకు పరిహారం కింద రోజూ రెండు పూటల నిత్య హోమం నిర్వహిస్తుంటారు. కైంకర్యాలు.. నైవేద్యాలు.. స్వామికి నిర్వహించే ఇతర కార్యక్రమాల్లో దోషాలు.. తప్పులు ఉంటే మన్నించాలని వేడుకుంటూ ప్రతి ఏటా పవిత్రోత్సవాలు నిర్వహిస్తుంటారు. ఇప్పుడు జరిగింది మహాపచారమని.. దీనికి మహాసంప్రోక్షణ చేయాలన్నది చర్చగా మారింది. అయితే.. దీన్ని కొత్తగా నిర్మించిన ఆలయాలకు.. విగ్రహ ప్రతిష్టలకు మాత్రమే చేస్తారన్నది కొందరి వాదన. ఈ నేపథ్యంలో మహా శాంతియాగం.. శాంతియాగం.. సంప్రోక్షణలపైనా చర్చలు జరిగాయి. నిర్ణయం ఏదైనా మరో పన్నెండు రోజుల్లో జరిగే బ్రహ్మోత్సవాలకు ముందే చేపట్టాలన్నది ఆలోచనగా చెబుతున్నారు.

Tags:    

Similar News