చంద్రబాబుకు తలపోటుగా కీలక నియోజకవర్గం!

ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లాలో కీలక నియోజకవర్గమైన పెడన సీటు ఆయనకు పెద్ద పీటముడిగా మారుతోందని అంటున్నారు.

Update: 2024-02-09 12:30 GMT

ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుతున్నారు... టీడీపీ అధినేత చంద్రబాబు. ఇప్పటికే ఓవైపు నారా లోకేశ్‌ ‘శంఖారావం’ పేరుతో సభలకు సిద్ధమవుతున్నారు. మరోవైపు చంద్రబాబు రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. జనసేనతో పొత్తుతో వెళ్తున్న చంద్రబాబు ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లాలో కీలక నియోజకవర్గమైన పెడన సీటు ఆయనకు పెద్ద పీటముడిగా మారుతోందని అంటున్నారు.

పెడన నుంచి ప్రస్తుతం వైసీపీ తరఫున జోగి రమేశ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన జగన్‌ ప్రభుత్వంలో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నారు. చంద్రబాబు, లోకేశ్, పవన్‌ కళ్యాణ్‌ లపైన తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవారిలో జోగి రమేశ్‌ ఒకరు. ఈ వ్యాఖ్యల ఫలితంగానే ఆయనకు అసలు మంత్రి పదవి వచ్చిందనేవారూ ఉన్నారు. ఈసారి జోగి రమేశ్‌ కు నియోజకవర్గంలో అనుకూల పరిస్థితులు లేవని తేలడంతో వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఆయనను పెనమలూరు నియోజకవర్గానికి మార్చారు.

వచ్చే ఎన్నికల్లో పెడన అసెంబ్లీ సీటు నుంచి వైసీపీ తరఫున ఉప్పాల రాము పోటీ చేస్తారని జగన్‌ ప్రకటించారు. కృష్ణా జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ ఉప్పాల హారిక భర్తే ఉప్పాల రాము.

ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో పెడనలో టీడీపీ గెలుపొందాలని చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నారు. ప్రస్తుతం పెడన నియోజకవర్గ టీడీపీ ఇంచార్జిగా కాగిత కృష్ణప్రసాద్‌ ఉన్నారు. 2014లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన కాగిత వెంకట్రావు కుమారుడే కృష్ణప్రసాదే. ఆయన కన్నుమూయడంతో కృష్ణప్రసాద్‌ పెడన టీడీపీ ఇంచార్జిగా బాధ్యతలు చేపట్టారు.

మరోవైపు పెడన సీటును మాజీ డిప్యూటీ స్పీకర్‌ బూరగడ్డ వేదవ్యాస్‌ కూడా ఆశిస్తున్నారు. ఈయన కృష్ణా జిల్లాలో బలమైన కాపు సామాజికవర్గానికి చెందినవారు. పెడనలో కాపుల ఓట్లు 40 వేలకు పైగా ఉన్నాయి. టీడీపీ ఇంచార్జి కాగిత కృష్ణప్రసాద్, వైసీపీ అభ్యర్థి ఉప్పాల రాము గౌడ సామాజికవర్గానికి చెందినవారు. గౌడల ఓట్లు కూడా పెడన నియోజకవర్గంలో 35 వేల వరకు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పెడనలో వివిధ పార్టీల తరఫున పోటీ చేసేవారిలో కాపు, గౌడ అభ్యర్థులే ఉంటున్నారు.

కాగా మల్లేశ్వరం నియోజకవర్గం రద్దయి 2009లో పెడన నియోజకవర్గం ఏర్పాటైంది. 2009లో ఇక్కడ కాంగ్రెస్‌ తరఫున జోగి రమేశ్‌ విజయం సాధించారు. 2014లో బూరగడ్డ వేదవ్యాస్‌ వైసీపీలోకి రావడంతో ఆయనకు జగన్‌ సీటు ఇచ్చారు. జోగి రమేశ్‌ ను మైలవరం నుంచి బరిలో దించారు. అయితే పెడనలో బూరగడ్డ, మైలవరంలో జోగి ఇద్దరూ ఓడిపోయారు. ఇంతలో బూరగడ్డ వేదవ్యాస్‌ వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్‌ అయ్యారు. మచిలీపట్నం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ముడా) చైర్మన్‌ గా పదవి దక్కించుకున్నారు. దీంతో 2019లో జోగి రమేశ్‌ పెడన నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.

ఈ నేపథ్యంలో టీడీపీ తరఫున పెడన నుంచి పోటీ చేసేది తానేనంటూ బూరగడ్డ వేదవ్యాస్‌ తాజాగా ప్రకటించడం హాట్‌ టాపిక్‌ గా మారింది. బూరగడ్డ ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. అయితే ప్రస్తుతం పెడన టీడీపీ నియోజకవర్గ ఇంచార్జిగా ఉన్న కాగిత కృష్ణప్రసాద్‌ తనకే సీటు లభిస్తుందని చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితం చంంద్రబాబును కలిసిన తనను నియోజకవర్గంలో పని చేసుకోవాలని చెప్పారని అంటున్నారు. సీటు తనకే అని స్పష్టం చేశారని అంటున్నారు.

మరోవైపు పెడనలో జనసేన కూడా బలంగా ఉంది. గత ఎన్నికల్లో ఇక్కడ ఆ పార్టీ అభ్యర్థి 25 వేలకు పైగా ఓట్లు సాధించారు. టీడీపీ–జనసేన పొత్తు కుదిరితే జనసేన కూడా ఈ సీటును ఆశించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పెడన సీటును చంద్రబాబు ఎవరికి కేటాయిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News