భారత్ కు వస్తున్న నౌక హైజాక్.. ఇజ్రాయల్ కు లింకేంటి?

అయితే.. ఈ నౌకకు యజమానిగా అబ్రహాం రామి ఉంగర్ అనే వ్యాపారిదిగా చెబుతున్నారు

Update: 2023-11-20 04:35 GMT

ఎర్ర సముద్రంలో భారత్ కు వస్తున్న వాణిజ్య నౌక 'గెలాక్సీ లీడర్' హైజాక్ కు గురైంది. యెమెన్ కు చెందిన హౌతీ రెబల్స్ కు చెందిన కొందరు ఇజ్రాయల్ కు చెందిన నౌకను హైజాక్ చేసినట్లుగా ఆ దేశం ప్రకటించింది. తాజా పరిణామంతో ఇజ్రాయెల్.. హమస్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగాయని భావిస్తున్నారు. అయితే.. ఈ నౌకలో ఇజ్రాయెల్ పౌరులు ఎవరూ లేకపోవటం గమనార్హం. కేవలం ఈ నౌక ఇజ్రాయల్ కు చెందిన సంపన్నుడిది. ఈ నౌక బ్రిటన్ కంపెనీ యాజమాన్యంలో ఉండగా.. జపాన్ కు చెందిన కంపెనీ ఒకటి నిర్వహిస్తోంది.

అయితే.. ఈ నౌకకు యజమానిగా అబ్రహాం రామి ఉంగర్ అనే వ్యాపారిదిగా చెబుతున్నారు. ఇజ్రాయెల్ లో అత్యంత సంపన్నుడైన ఆయన.. తన నౌక హైజాక్ అయిన విషయాన్ని ధ్రువీకరించారు. ఇజ్రాయెల్ ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని తెలియజేస్తూ.. తమ దేశానికి చెందిన పౌరులు ఎవరూ లేరని వెల్లడించింది. అంతేకాదు.. భారత్ కు చెందిన పౌరులు కూడా ఎవరూ లేకపోవటం గమనార్హం. నౌకలో బల్గేరియా.. ఫిలిప్పీన్స్.. మెక్సికో.. ఉక్రెయిన్కు చెందిన పాతిక మంది సిబ్బందితో ఈ నౌక ఇండియాకు వస్తోంది.

తాజా పరిణామం అంతర్జాతీయ సంక్షోభానికి దారి తీసే తీవ్ర చర్యగా ఇజ్రాయెల్ అభివర్ణించింది. ఈ చర్య ఇరానియన్ తీవ్రవాద చర్యగా ఇజ్రాయల్ ప్రధాని కార్యాలయం ఖండించింది. హైజాక్ చేసిన నౌకను తమ అధీనంలో ఉంచుకున్నట్లుగా హౌతీ రెబల్స్ ప్రకటించారు. ఈ చిక్కుముడి రానున్న రోజుల్లో మరింత ఉద్రిక్తతలకు కారణమవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరేం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News