చేరికలు అన్నీ టీడీపీలోకేనా... జనసేన సంగతేంటి ?

మరి జనసేన బీజేపీల సంగతేంటి అన్న ప్రశ్నలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు 21 అసెంబ్లీ సీట్లు రెండు ఎంపీ సీట్లు గెలుచుకున్నారు.

Update: 2024-07-17 02:45 GMT

గత ఆరు నెలలుగా చూస్తే ఎన్నికల ముందూ తరువాత కూడా చేరికలు అన్నీ టీడీపీలోకి ఎక్కువగా సాగుతున్నాయి. ఎన్నికల ముందు టీడీపీలో పది మంది చేరితే జనసేనలో ఒకరిద్దరు చేరేవారు. ఎన్నికలు అయి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కూటమి ప్రభుత్వంలో మూడు పార్టీలూ ఉన్నాయి.

ఏపీలో టీడీపీ ఆల్ రెడీ బలమైన పార్టీ. ఆ పార్టీకి నాయకులు క్యాడర్ పుష్కలంగా ఉంది. అయితే చంద్రబాబు 2029 ఎన్నికల గురించి ఆలోచిస్తూ ఎక్కువ మంది నేతలను చేర్చుకుంటున్నారు అని అంటున్నారు. రానున్న కాలంలో మరో యాభై సీట్లు పెరిగితే సమర్ధులైన నేతలు అవసరం కాబట్టి అన్న ముందు చూపుతో బాబు చేరికలను ప్రోత్సహిస్తున్నారు అని అంటున్నారు.

రానున్న రోజులలో రాజ్యసభ ఎంపీల నుంచి ఎమ్మెల్సీల నుంచి కీలక నేతల దాకా వైసీపీ నుంచి టీడీపీలో చేరుతారు అని అంటున్నారు. టీడీపీ వరకూ ఇది బాగానే ఉంది. టీడీపీ ఒక రాజకీయ పార్టీ కాబట్టి చేరికలను ఎవరూ తప్పుపట్టరు. అధికారంలో ఉన్నపుడు బలోపేతం కావాల్సిందే.

మరి జనసేన బీజేపీల సంగతేంటి అన్న ప్రశ్నలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు 21 అసెంబ్లీ సీట్లు రెండు ఎంపీ సీట్లు గెలుచుకున్నారు. ఆయా చోట్ల జనసేనకు కొత్త నాయకత్వం అక్కరలేదు. అదే విధంగా పార్టీ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రాలో కొన్ని చోట్ల బలంగా ఉంది.

అయితే వీక్ గా ఉన్న చోట పటిష్టం కావాల్సిందే. మరి ఆ పార్టీ దీనికి ఏమి చేస్తుంది అన్న ప్రశ్నలు వస్తున్నాయి. జనసేన రాయలసీమ తో పాటు క్రిష్ణా గుంటూరు ప్రాంతాలలో మరింతగా బలోపేతం కావాల్సి ఉంది. అయితే వైసీపీ నేతలు అంతా టీడీపీ వైపు చూస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి తప్ప జనసేన వైపు ఎవరూ వెళ్ళడం లేదు.

మరి వద్దు అని జనసేన అనుకుంటోందా లేక వారే టీడీపీ బెస్ట్ అని అటు వైపు వెళ్తున్నారా అన్న చర్చ వస్తోంది. జనసేనకు నిజంగా ఇదే బెటర్ టైం అని అంటున్నారు. పార్టీ అధికారంలో ఉంది. మంత్రి పదవులు దక్కాయి. ఇపుడు కనుక రాష్ట్రవ్యాప్తంగా గట్టిగా ఫోకస్ పెట్టి బలపడితే 2029 నాటికి పొత్తులు ఎలా ఉన్నా జనసేనకు రాజకీయంగా సొంత నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అని అంటున్నారు.

మరో వైపు చూస్తే 2014లో పార్టీని స్థాపించినా కూడా గత పదేళ్ళుగా పార్టీని పవన్ పెద్దగా పటిష్టం చేసినది లేదు అని అంటారు. అయితే ఆనాడు జనసేన విపక్షంలో ఉంది కాబట్టి అవకాశం కుదరలేదు అని అనుకోవచ్చు. కానీ ఇపుడు అధికారంలో ఉన్నారు కాబట్టి చేయవచ్చు కదా అని అంటున్నారు.

జనసేన సంస్థాగత నిర్మాణం మీద దృష్టి పెట్టినట్లుగా ఉంది. సభ్యత్వ నమోదు చేయిస్తోంది. అయితే బలమైన నాయకులు మచ్చ లేని వారు ఇతర పార్టీల నుంచి వస్తే వారిని చేర్చుకోవడంలో తప్పు లేదు అని అంటున్నారు. ముఖ్యంగా రాయలసీమలో వైసీపీ నేతలు చాలా మంది రాజకీయంగా ఆల్టర్నేషన్ కోసం చూస్తున్నారు. వారికి టీడీపీలోకి వెళ్ళడం అంటే ఇబ్బందే.

అలాంటపుడు వారిని తమ వైపు తిప్పుకుంటే అక్కడ పార్టీకి సీమలో దూసుకుని పోయేందుకు అవకాశం ఉంటుందని అంటున్నారు. బలిజలు ఎటూ పెద్ద సంఖ్యలో అక్కడ ఉన్నారు కాబట్టి జనసేన రాజకీయానికి అనుకూలిస్తుంది అని అంటున్నారు.

అయితే ఏపీలో మాత్రం కండువాలు కప్పేందుకు టీడీపీయే సిద్ధంగా ఉంది. ఎవరు చేరినా టీడీపీలోకే అంటున్నారు. మరి జనసేన బీజేపీ ఈ విషయంలో తొందర పడాల్సి ఉంది అని అంటున్నారు. రాజకీయాల్లో టైమింగ్ చాలా ముఖ్యమని అది కనుక లేకపోతే చిక్కుల్లో పడడం ఖాయమని అంటున్నారు.

Tags:    

Similar News