ఆళ్ళ రాజీనామా.. స్పీకర్ ఏం చేస్తారు...?

అధికార పార్టీకి చెందిన ఒక శాసన సభ్యుడు రాజీనామా చేశారు. దాని మీద శాసన సభ స్పీకర్ హోదాలో తమ్మినేని సీతారాం ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారు అన్నది చర్చనీయాంశం అవుతోంది.

Update: 2023-12-12 03:42 GMT

అధికార పార్టీకి చెందిన ఒక శాసన సభ్యుడు రాజీనామా చేశారు. దాని మీద శాసన సభ స్పీకర్ హోదాలో తమ్మినేని సీతారాం ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారు అన్నది చర్చనీయాంశం అవుతోంది. స్పీకర్ గా తమ్మినేని బాధ్యతలు స్వీకరించాక ఇది రెండవ రాజీనామా. సరిగ్గా మూడేళ్ల క్రితం విపక్ష తెలుగుదేశం పార్టీ నుంచి విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా చేసి స్పీకర్ కి పంపారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేస్తామని కేంద్రం ప్రకటించడాన్ని తప్పుపడుతూ ఆయన రాజీనామా చేశారు. అయితే ఆయన స్పీకర్ ఫార్మెట్ లో రాజీనామా చేయలేదని పేర్కొనడంతో మరోమారు తన రాజీనామా ఫార్మెట్ లోనే రాసి పంపించారు. అంతే కాదు శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో ఉన్న స్పీకర్ తమ్మినేని సీతారాం ఇంటికి వెళ్ళి మరీ స్వయంగా రాజీనామా నిర్ణయాన్ని గంటా ఆయనకు తెలియచేశారు.

అయినా సరే ఆయన రాజీనామా ఆమోదం పొందలేదు. ఇక ఆ తరువాత గంటా తన పని తాను చేసుకుని పోతున్నారు. ఇపుడు మరో రాజీనామా వచ్చింది. ఎన్నికలకు ఆరు నెలల వ్యవధి కూడా లేని ఈ స్థితిలో రాజీనమా ఆమోదించినా ఏమీ జరగదు, ఉప ఎన్నికలు వచ్చే ప్రసక్తే లేదు. ఇక ఆళ్ళ స్పీకర్ ఫార్మెంట్ లోనే రాజీనామా రాశారు. అంతే కాదు ఆయన స్పీకర్ ని కలవడానికి కార్యాలయానికి వెళ్లారు. కానీ స్పీకర్ శ్రీశైలంలో దైవ దర్శనంలో ఉన్నారు.

దాంతో ఆయన స్పీకర్ సెక్రటరీకి రాజీనామా లేఖను ఇచ్చారు. ఇక ఆయన హైదరాబాద్ వెళ్లిపోయారు అని అంటున్నా సోమవారం పొద్దుపోయాక మీడియా ముందుకు వచ్చి తాను వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేసినట్లుగా ప్రకటించారు. తన రాజకీయ ప్రస్థానం 1995లో మొదలైందని, 2004లో సత్తెనపల్లి టికెట్ ఆశించాను దక్కలేదని, అలాగే 2009లో పెదకూరపాడు టికెట్ ఆశించినా దక్కలేదని చెప్పారు. వైసీపీలో చేరి రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యాను అని వివరించారు.

మొత్తానికి ఆయన రాజీనామా తన సొంత నిర్ణయం అని చెబుతున్నారు. ఈ క్రమంలో అది ఆమోదించడం అన్నది స్పీకర్ విచక్షణాధికారాల మీద ఆధారపడి ఉంది. అయితే స్పీకర్ తమ్మినేని సీతారాం దీని మీద మీడియాతో మాట్లాడుతూ తాను మీడియాలో వార్తల ద్వారానే ఆళ్ళ రాజీనామా విషయం తెలుసుకున్నాను అని అన్నారు.

రాజీనామా చేయడానికి గల కారణాలను తాను తెలుసుకున్న మీదటనే స్పందిస్తాను అని స్పీకర్ చెప్పారు. రాజీనామా చేసినంతమాత్రాన ఆమోదించడం జరగదు అని ఆయన అన్నారు. ఏది ఏమైనా గంటా రాజీనామా మాదిరిగా ఆళ్ళ రాజీనామా కూడా పెండింగులో ఉంటుందా అన్నదే చర్చకు వస్తోంది. ఆమోదించినా ఏమీ జరగదు కాబట్టి అలాగే ఉంచుతారా అన్నది కూడా చూడాలి. అయితే ఆళ్ల వైసీపీ అధినాయకత్వానికి కావలసిన వారు కాబట్టి ఈ విషయంలో చాలా ఆలోచించే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అని అంటున్నారు.

Tags:    

Similar News