నేటి నుంచి ఏపీలో పవర్స్ అన్నీ ఈసీ చేతుల్లోకి!

దీంతో నేటి నుంచి ఆయా రాష్ట్రాల్లో అధికారాలు ఈసీ చేతుల్లోకి వెళ్లిపోబోతున్నాయి!!

Update: 2024-03-16 05:51 GMT

ఈ రోజు ప్రజాస్వామ్య పండుగకు నగారా మోగబోతోంది. ఇందులో భాగంగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ను మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో 18వ లోక్ సభతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించనున్నారు. దీంతో నేటి నుంచి ఆయా రాష్ట్రాల్లో అధికారాలు ఈసీ చేతుల్లోకి వెళ్లిపోబోతున్నాయి!!

అవును... ఎన్నికల షెడ్యూల్ వెలువడేందుకు వేళైంది. అయితే... 2019లో ఎన్నికల షెడ్యూల్‌ మార్చి 10న విడుదల కాగా, ఈసారి ఆరురోజులు ఆలస్యంగా విడుదలవుతోంది. దీంతో... పోలింగ్ తేదీ, ఫలితాల ప్రకటనకు కూడా ఆ మేరకు తేడా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌.. మిగిలిన ఇద్దరు కమిషనర్లు జ్ఞానేశ్‌ కుమార్‌, సుఖ్‌ బీర్‌ సింగ్‌ సంధులతో కలిసి షెడ్యూల్ ని విడుదల చేయనున్నారు.

దీంతో ప్రధానంగా ఏపీలో ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పైగా దక్షిణాదిలో కర్ణాటక, తమిళనాడుల్లో బీజేపీకి వరుస దెబ్బలు తగలడంతో.. ఏపీలో మోడీ & కో ని ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఆ కూటమిని ఏ మేరకు ఆదరిస్తారు అనేది మరింత ఆసక్తిగా మారింది. వాస్తవానికి గత ఎన్నికలు ఏప్రిల్ 11న జరిగిన సంగతి తెలిసిందే. దీంతో పైన చెప్పుకున్నట్లు ఆరు రోజులు ఎక్కువ వేసుకుంటే... ఏప్రిల్ 17న పోలింగ్ జరిగే అవకాశం ఉందని అంటున్నారు!

ఆ సంగతి అలా ఉంటే... ఎన్నికల కోడ్ వచ్చిందంటే రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వానికి ఎలాంటి అధికారాలూ ఉండవనేది తెలిసిన సంగతే! ఒక్కసారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత.. రాష్ట్రం మొత్తం ఎన్నికల కమిషన్ పాలనలోకి వెళ్లిపోతుంది! దీంతో... ఎన్నికల సంఘం అధికారుల ఆదేశాల మేరకే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు నడుచుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఒకవేళ ఏదైనా అత్యవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తే... అందుకు ఈసీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

ఈ సమయంలో ఈసీ అనుమతి లభించని పక్షంలో... ఎన్నికల పోలింగ్ ముగిసి, ఫలితాలు వెలువడి, కొత్త ప్రభుత్వం కొలువుదీరే వరకూ ఎదురుచూడక తప్పదు! ఇక రానున్న ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వైసీపీ వస్తుందా.. కూటమే కైవసం చేసుకుంటుందా అనేది వేచి చూడాలి. అన్నీ అనుకూలంగా జరిగితే మే నెలలో ఎన్నికల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది!

Tags:    

Similar News