పవన్...లోకేష్...షర్మిల...ముగ్గురూ ముగ్గురే...!

అలాగే పాలిటిక్స్ కి మించిన మత్తు గమ్మత్తూ కూడా వేరేది లేదు.

Update: 2024-02-13 14:55 GMT

ఏపీ రాజకీయాలలో ఈ ముగ్గురు నేతల గురించే ఎక్కువగా చెప్పుకోవాల్సి ఉంటుంది. రాజకీయాలు ఎన్నికలు అంటే అందరూ బరిలోకి దిగాలని చూస్తారు. అలాగే పాలిటిక్స్ కి మించిన మత్తు గమ్మత్తూ కూడా వేరేది లేదు. ఎన్నికల్లో పోటీ చేయడం గెలవడం అన్నది పెద్ద విద్యగానే చూడాలి. ఇక తమతో పాటు ఉన్న పార్టీలను కూడా గెలిపించాలంటే చాలానే ఉండాలి.

ఏపీ పాలిటిక్స్ అంటే వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగుతోంది. టీడీపీలో చూస్తే అందరి కంటే అత్యధిక శాతం అనుభవం కలిగిన నాయకుడు చంద్రబాబు ఉన్నారు. ఆయన ఇప్పటికి ముమ్మారు సీఎం గా పనిచేశారు. అంతే కాదు ఆయన ఇప్పటికి తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన రాజకీయ జీవితంలో గెలుపోటములు స్థాయిని ఎపుడో దాటిపోయారు. 2024 ఎన్నికల్లో టీడీపీ ఒకవేళ ఓడినా దాన్ని నడిపించే సత్తా చంద్రబాబుకు ఉంది. ఆయన రాజకీయంగా ఇంకా కొనసాగే అవకాశాలు ఉన్నాయి.

అదే సీఎం జగన్ విషయం తీసుకుంటే ఆయన రాజకీయ జీవితం అచ్చంగా పదిహేనేళ్లు. ఆయన్ రెండు సార్లు ఎంపీగా గెలిచారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రతిపక్ష నేతగా పనిచేశారు. సీఎం గా ఉన్నారు. రేపటి ఎన్నికల్లో జగన్ గెలిస్తే ఓకే లేక ఓడితే ఆయన మరింత ధీటుగా పార్టీని నడుపుతారు. 2029ని టార్గెట్ గా చేసుకుని దూసుకుని వస్తారు. ఆయన కూడా గెలుపోటముల స్థాయిని దాటేశారు.

ఇక ఇపుడు ముగ్గురు రాజకీయ నేతల గురించి చెప్పుకోవాలి. ఈ ముగ్గురుకీ ఒక పోలిక ఉంది. ఈ ముగ్గురూ ఇప్పటిదాకా అసెంబ్లీ ముఖం చూడలేదు. వారే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ యువ నేత నారా లోకేష్, కాంగ్రెస్ ఏపీ ప్రెసిడెంట్ షర్మిల. ఇక పవన్ లోకేష్ లను తీసుకుంటే వారిద్దరూ 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. పవన్ భీమవరం గాజువాకలలో పోటీ చేసి ఓడితే లోకేష్ మంగళగిరిలో ఓటమి చూశారు. ఈసారి ఎన్నికల్లో మంగళగిరి నుంచి మరోసారి పోటీ చేయాలని లోకేష్ తన రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

పవన్ చూస్తే ఎక్కడ నుంచి పోటీ చేస్తారో తెలియదు. అయితే ఆయన ఈసారి కచ్చితంగా గెలవాలి.అంతేకాదు తనతో పాటు పార్టీకి కూడా చెప్పుకోదగిన సీట్లు సంపాదించాలి. అపుడే జనసేనకూ పవన్ రాజకీయ భవిష్యత్తుకూ గ్యారంటీ ఉంటుంది అని అంటున్నారు. అలాగే నారా లోకేష్ కూడా ఈసారి గెలిచి టీడీపీలో కీలక పాత్ర పోషిస్తేనే ఆయన రాజకీయం నిలుస్తుంది. ఒక గాటిన పడుతుంది. చంద్రబాబు వారసత్వం సాఫీగా ఆయనకు అందుతుంది.

ఇపుడు వైఎస్ షర్మిల గురించి చెప్పుకోవాలి. ఆమె అన్న చాటు చెల్లెలుగా రాజకీయాల్లోకి వచ్చి 2019 దాకా ప్రచారం చేశారు. ఆ తరువాత అంటే 2021లో తెలంగాణాలో రాజకీయం వెతుక్కుంటూ సొంత పార్టీ పెట్టారు. గత ఏడాది చివరిలో జరిగిన తెలంగాణా ఎన్నికల్లో పోటీ చేయకుండానే పార్టీని విలీనం చేసి ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు స్వీకరించారు. ఇది నిజంగా ఆమెకు టఫ్ జాబ్. కాంగ్రెస్ ఏపీలో దయనీయ స్థితిలో ఉంది.

అయినా సరే షర్మిల గెలవాలి ఒక ఎమ్మెల్యేగా అయినా. అదే విధంగా తనతో పాటు ఒకరో ఇద్దరో కాంగ్రెస్ నేతలను ఎమ్మెల్యేలుగా గెలిపించుకుంటేనే ఆమె రాజకీయ జీవితం కొనసాగుతుంది. లేకపోతే ఇబ్బందులో పడుతుంది. మొత్తానికి చూస్తే పవన్ లోకేష్ షర్మిల ముగ్గురూ ఒక విషయంలో ఒక్కటే అని అంటున్నారు. తొలిసారి ఈ ముగ్గురూ అసెంబ్లీలో అడుగు పెడతారా వారి రాజకీయాన్ని పండించుకుంటారా అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News