పర్చూరు నుంచి ' ఆమంచి ' అవుట్... బీ ఫామ్ గ్యారెంటీ లేదు..!
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పర్చూరు, అద్దంకి, చీరాల నియోజకవర్గాలు వైసీపీ అధినేత జగన్‌ను ముప్పుతెప్పులు పెడుతున్నాయి
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పర్చూరు, అద్దంకి, చీరాల నియోజకవర్గాలు వైసీపీ అధినేత జగన్‌ను ముప్పుతెప్పులు పెడుతున్నాయి. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని 23 సీట్లకు పరిమితం చేసినా ఈ మూడు చోట్ల ఆ పార్టీ ఎమ్మెల్యేలు విజయం సాధించారు. ఈ ఐదేళ్లలో ఈ మూడు నియోజకవర్గాలలో ఇప్పటికీ బలమైన ఇన్చార్జిలను పెట్టుకోలేని దీనస్థితిలో జగన్ ఉన్నారు. అద్దంకిలో నాలుగేళ్లుగా కష్టపడుతూ వచ్చిన బాచిన కృష్ణ చైతన్యను తప్పించి ఎక్కడో గుంటూరు జిల్లా పల్నాడు నుంచి హనిమిరెడ్డిని దిగుమతి చేశారు. ఈ ఈక్వేషన్ పూర్తిగా తప్పు.
చీరాలలో పట్టు ఉన్న మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కు యేడాది క్రిందట పరుచూరు పగ్గాలు అప్పగించారు. ఇక్కడ పోటీ చేయటం ఆయనకు సుతరాము ఇష్టం లేదు. అద్దంకిలో పట్టున్న కరణం కుటుంబానికి చీరాలలో స్వేచ్ఛ ఇవ్వటం కూడా రాంగ్ ఈక్వేషన్. ఇక పరుచూరు విషయానికి వస్తే ఆమంచి ప్లేస్ లో మరో కొత్త కృష్ణుడు ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధమవుతోంది. ఈ ఐదేళ్లలో కొత్తగా వచ్చే నేత నాలుగో కృష్ణుడు అవుతాడు. ఇక్కడ 2014 ఎన్నికలలో గొట్టిపాటి భరత్ పోటీ చేసి ఏలూరి సాంబశివరావుపై ఓడిపోయారు. అనంతరం భరత్ యాక్టివ్గా లేకపోవడంతో రావి రామనాథం బాబును పరిచూరు ఇన్చార్జిగా నియమించారు.
గత ఎన్నికలకు ముందు దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు జగన్ టిక్కెట్ ఇవ్వడంతో రామనాథం బాబు టిడిపిలోకి జంప్ చేశారు. ఎన్నికల తర్వాత అదే రామనాథం బాబుకు వైసీపీ కండువా కప్పి పరుచూరు పగ్గాలు తిరిగి అప్పగించారు. చీరాలలో ఉన్న గొడవ సర్దుబాటు చేసే క్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కు ఆ తర్వాత పరుచూరు ఇన్చార్జి పగ్గాలు అప్పగించారు. అయినా ఇక్కడ పార్టీ గ్రాఫ్ ఏ మాత్రం పెరగలేదు. ఇక ఇప్పుడు ఎన్నికలకు ముందు ఆమంచి ఇక్కడ పోటీ చేసేందుకు ఇష్టపడకపోవడంతో చీరాలలో 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిన ఎడం బాలాజీని రంగంలోకి దింపి ఇన్చార్జి బాధ్యతలు ఇవ్వాలన్న ఆలోచనలో వైసిపి అధిష్టానం ఉంది.
2014లో చీరాలలో వైసీపీ నుంచి పోటీ చేసిన ఎడం బాలాజీ మూడో ప్లేసుతో సరిపెట్టుకున్నాడు. ఆ తర్వాత టీడీపీలోకి వచ్చి కొద్ది రోజుల పాటు చీరాల ఇన్‌చార్జ్‌గా ఉండి.. మళ్లీ అటూ ఇటూ కుప్పిగంతులేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి బాలినేని సూచన మేరకే ఇప్పుడు పరుచూరు వైసీపీ పగ్గాలు ఎడం బాలాజీకి ఇస్తున్నారంటూ జిల్లా వైసీపీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఎడం బాలాజీ మామూలు వీక్ క్యాండెట్ కాదు... చీరాలలోనే మూడో ప్లేస్‌లో ఉంటే పరుచూరులో రెండుసార్లు వరుసగా గెలిచిన ఏలూరిని ఢీ కొట్టాలంటే అతడి శక్తి సామర్థ్యాలు ఏ మాత్రం సరిపోవని వైసీపీ వాళ్లే చెపుతున్నారు.
ఏదో అధిష్టానం నుంచి పిలుపు వచ్చిందని మాంచి ఉత్సాహంగా ఉన్నా పరుచూరు గ్రౌండ్‌లోకి దిగితే కానీ అక్కడ చుక్కలు కనపడడం మొదలవుతుందని.. అసలు ఆట ఎంత టఫ్‌గా ఉంటుందో తెలుస్తుందన్న సెటైర్లు కూడా బాలాజీ మీద పడుతున్నాయి. మరో ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు ఎడం బాలాజీకి పరుచూరు ఇన్‌చార్జ్ ఇచ్చినా రేపు ఎన్నికల ముందు ఇతడి చేతికి బీ ఫామ్ వస్తుందా ? లేదా మరో కృష్ణుడు మారి గొట్టిపాటి భరత్ చేతిలో పడుతుందా ? లేదా మరో నేత వస్తాడా ? అన్నది మాత్రం ప్రస్తుతానికి పిచ్చ సస్పెన్సే..!