అనకాపల్లి ఎంపీగా గుడివాడ పోటీ...?

అనకాపల్లి నుంచి ఈసారి వైసీపీ తరఫున ఎంపీగా మంత్రి గుడివాడ అమరనాధ్ ని పోటీ చేయించాలని వైసీపీ అధినాయకత్వం భావిస్తోంది అని అంటున్నారు.

Update: 2023-11-27 17:30 GMT

అనకాపల్లి నుంచి ఈసారి వైసీపీ తరఫున ఎంపీగా మంత్రి గుడివాడ అమరనాధ్ ని పోటీ చేయించాలని వైసీపీ అధినాయకత్వం భావిస్తోంది అని అంటున్నారు. అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో ఈసారి కొంచెం పొజిషన్ టైట్ అయ్యేలా ఉందని భావిస్తున్న హై కమాండ్ గట్టి అభ్యర్ధి కోసం అన్వేషిస్తోంది. టీడీపీ కూడా అనకాపల్లి జిల్లాలో గతం కంటే పుంజుకుంది అని వార్తలు వస్తున్నాయి.

నర్శీపట్నం, పాయకరావుపేట, అనకాపల్లి, చోడవరం, ఎలమంచిలి, పెందుర్తి, మాడుగుల అసెంబ్లీ సీటు అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోకి వస్తాయి. ఇందులో నర్శీపట్నం, అనకాపల్లి, ఎలమంచిలిలలో టీడీపీకి కొంత అనుకూలత ఉందని ప్రచారం సాగుతోంది. దాంతో పాటు పాయకరావుపేట, చోడవరం అసెంబ్లీ నియోజకవర్గాలలో నువ్వా నేనా అన్నట్లుగా సీన్ ఉంది. పెందుర్తి మాడుగులలలో మాత్రం వైసీపీకి కొంత సానుకూలత ఉంది.

మరో వైపు చూస్తే అనకాపల్లి అసెంబ్లీ సీటును బలమైన గవర సామాజికవర్గం నేతలు కోరుకుంటున్నారు. గతసారి గుడివాడ ఇక్కడ నుంచి పోటీ చేసి గెలుపొందారు. కాపు సామాజిక వర్గానికి చెందిన గుడివాడను ఎంపీగా పంపించడం ద్వారా పార్లమెంట్ పరిధిలో ఆ సామాజికవర్గం ఓట్లను రాబట్టుకోవచ్చునని, అదే టైం లో జనసేన టీడీపీ పొత్తులో ఆ వర్గం ఓట్లు కూటమికి పూర్తి స్థాయిలో పోకుండా నిలువరించవచ్చు అన్నది వైసీపీ ఎత్తుగడగా ఉంది అంటున్నారు.

ఇక టీడీపీ నుంచి భైరా ఫౌండేషన్ అధినేత పారిశ్రామికవేత్త అయిన భైరా దిలీప్ చక్రవర్తి రేసులోకి వచ్చారని అంటున్నారు. ఆయన గతంలో ప్రజారాజ్యం, జనసేనలలో కూడా పరిచయాలు ఉన్న వారు, పైగా కాపు సామాజిక వర్గం నేతగా ఉన్నారని అంటున్నారు. దాంతో ఆయన అంగబలం అర్ధబలం కలసి వస్తే పొత్తులతో ఎంపీ సీటుతో పాటు ఎక్కువగా అసెంబ్లీ సీట్లను గెలుచుకోవచ్చునని టీడీపీ భావిస్తోంది.

దీంతో చంద్రబాబు భైరా దిలీప్ చక్రవర్తి అభ్యర్ధిత్వం పట్ల సుముఖంగా ఉన్నారని అంటున్నారు. దాంతో ధీటైన అభ్యర్ధి కోసం అన్వేషణలో వైసీపీ అనేకమైన పేర్లను పరిశీలిస్తోంది అని అంటున్నారు. ఒక దశలో అనకాపల్లి కోసం భీమిలీ సిట్టింగ్ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావుని పోటీ చేయించాలని ఆలోచించారు. అలాగే మాజీ మంత్రి కొణతాల రామక్రిష్ణను కూడా పార్టీలోకి తెచ్చి పోటీకి దించాలని అనుకున్నారని ప్రచారం జరిగింది.

ఇపుడు చూస్తే వారూ వీరూ కాదు ఏకంగా గుడివాడ అమరనాధ్ నే ఎంపీ అభ్యర్ధిగా పోటీలో దించితే గెలుపు సునాయాసం అవుతుంది అని లెక్కలు వేస్తున్నారు. అయితే మంత్రి మాత్రం అనకాపల్లి నుంచే మరోసారి పోటీ అంటున్నారు. ఆయన ఈసారి కూడా అక్కడ నుంచి గెలిచి వైసీపీ అధికారంలోకి వస్తే మంత్రిగా మరోమారు హవా చలాయించాలని చూస్తున్నారు అంటున్నారు. మరి ఏమి జరుగుతుందనేది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News