అమరావతిలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం.. వివరాలివే!
ఇదే సమయంలో దేశంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంకు అమరావతి కేరాఫ్ కాబోతోందని అంటున్నారు.
అమరావతిని అన్ని రకాలుగానూ ప్రపంచపటంలో చూపించాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... అమరావతిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్శిటీ నుంచి మొదలు అన్ని రకాలుగానూ టాప్ లో పెట్టాలని యోచిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో దేశంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంకు అమరావతి కేరాఫ్ కాబోతోందని అంటున్నారు.
అవును... దేశంలో ఇప్పటి వరకూ గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఉన్న నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియం మాత్రమే పెద్దది. ఈ స్టేడియం సామర్ధ్యం 1,32,000 మంది కాగా... అంతకంటే పెద్దగా అమరావతిలో ప్లాన్ చేస్తున్నారంట. ఈ మేరకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ఈ సందర్భంగా.. ఈ భారీ స్టేడియం ప్రత్యేకతలు వెల్లడించారు.
ఇందులో భాగంగా... అమరావతిలో సుమారు 200 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీని నిర్మించాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని చెబుతున్న నేపథ్యంలో.. అందులోని ఓ 60 ఎకరాల స్థలంలో అతిపెద్ద క్రికెట్ స్టేడియంను నిర్మాణాన్ని నిర్ణయించనున్నట్లు చెబుతున్నారు. దీని నిర్మాణానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నుంచి ఆర్థిక సాయం తీసుకోవాలని నిర్ణయించారని అంటున్నారు.
ఇదే సమయంలో... 2029 జాతీయ క్రీడలు అమరావతిలో నిర్వహించడానికి బిడ్ వేయనున్నట్లు శివనాథ్ తెలిపారు. క్రికెట్ కోసం ప్రత్యేకంగా మూడు అకాడమీలు ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా.. అవి విజయవాడ, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఏర్పాటు అవుతాయని తెలిపారు. వీటి నిర్మాహణకు ఎంపిక చేసుకునే క్రికెటర్ల పేర్లూ వెల్లడించారు.
ఇందులో భాగంగా... టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ సింగ్, మహిళా స్టార్ క్రికెటర్ మిథాలీ రాజ్ లను తీసుకొంటూన్నామని.. వారి ఆధ్వర్యంలోనే క్రికెట్ శిక్షణ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రధానంగా వచ్చే రెండేల్లలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు ఏపీ నుంచి కనీసం 15 మందికి తక్కువ కాకుండా ఎంపిక కావాలన్న లక్ష్యంతోనే పనిచేస్తున్నామని ఆయన వెల్లడించారు.
దీంతో... 2029 కంటే చాలా ముందే అమరావతిలో స్పోర్ట్స్ సిటీ కూడా డెవలప్ అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. అన్నీ అనుకూలంగా జరిగితే 2029 నేషనల్ గేమ్స్ అమరావతిలోనే జరగనున్నాయన్నమాట!