అమరావతి అప్పు కోసం అన్ని గంటలు చర్చలా...?
అప్పు ఇస్తున్న ప్రపంచ బ్యాంకు ఏడీబీ ఒప్పందంలో ఏ ఏ అంశాలు పొందుపరచాలి అన్న దాని మీద కేంద్ర రాష్ట్ర అధికారులతో కలసి తీవ్రమైన కసరత్తునే చేశాయి.
అమరావతి రాజధానికి ప్రపంచ బ్యాంకు నిధులు అందిస్తోంది అని రాష్ట్ర ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో చెప్పారు. నిధులు వస్తున్నాయని ఆయన చెప్పారు కానీ అది అప్పు అని వామపక్షాల నేతలు బడ్జెట్ మీద తరువాత చేసిన విమర్శలలో స్పష్టం చేశారు. ఇపుడు అదే మరింతగా స్పష్టం అయింది. అవును అప్పు వస్తోంది. అమరావతి రాజధానికి ప్రపంచ బ్యాంక్, అలాగే ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ రెండూ కలసి అప్పు ఇస్తున్నాయి.
ఈ అప్పు పదిహేను వేల కోట్ల రూపాయలు. ఇంతటి అప్పు ఇవ్వడానికి ఎన్నో గంటల పాటు చర్చలు కూడా జరిగాయి. కేంద్ర రాష్ట్ర అధికారుల సమక్షంలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ అధికారులు అనేక అంశాల మీద సుదీర్ఘంగా చర్చించాయి. ఏకంగా ఎనిమిది గంటల పాటు ఈ చర్చలు సాగాయి. అప్పు ఇస్తున్న ప్రపంచ బ్యాంకు ఏడీబీ ఒప్పందంలో ఏ ఏ అంశాలు పొందుపరచాలి అన్న దాని మీద కేంద్ర రాష్ట్ర అధికారులతో కలసి తీవ్రమైన కసరత్తునే చేశాయి.
మొత్తానికి ఈ కసరత్తు పూర్తి అయింది. ఇక ఒప్పందాలలో ఏ ఏ అంశాలు ఉంటాయో అయితే తెలియలేదు. అయితే ఒక్క మాట ప్రపంచ బ్యాంకు ఇచ్చే రుణాల మీద షరతులు అయినా ఒప్పందాలు అయినా కొంత కచ్చితంగానే ఉంటాయని అంటున్నారు. అదే సమయంలో ప్రపంచ బ్యాంకు అన్ని విషయాలనూ పూర్తిగా పరిశీలించిన మీదటనే రుణాలు ఇస్తుంది. ముఖ్యంగా పర్యావరణం వంటి వాటి విషయంలో ఎక్కువగా ఫోకస్ పెడుతుంది అని అంటున్నారు.
అలాగే ఇచ్చిన రుణాలను దేని కోసం అయితే ఉద్దేశించారో వాటికే ఖర్చు చేయాలని కూడా కీలక షరతులు ఉంటాయని అంటున్నారు. ఇక ఏపీ అధికారులు ప్రపంచ బ్యాంకు ఏడీబీల మధ్య ఒప్పందాలు కుదిరితే దానికి కేంద్రం తరఫున అధికారులు పూచీకత్తుగా ఉంటారరని తెలుస్తోంది. ఒక విధంగా కేంద్ర ప్రభుత్వమే ఈ ఒప్పందంలో ఉంటూ కుదుర్చుకుందని కూడా భావించాల్సి ఉందని అంటున్నారు.
రేపటి రోజున రుణాల విషయంలో పూచీకత్తుగా ఉన్న కేంద్రమే బాధ్యత వహిస్తుందని అంటున్నారు. ఈ విధంగా తుది ఒప్పంద పత్రాలు అయితే పూర్తి అయ్యాయి. అందులో చేర్చిన అంశాలు అన్నీ కూడా ఇపుడు తుది ఒప్పంద పత్రాలలో ఉన్నాయి. వాటిని ప్రపంచ బ్యాంక్ అలాగే ఏడీబీ అధికారులు పూర్తి స్థాయిలో పరిశీలించి ఆమోదముద్ర వేయనున్నాయి.
అంటే ఒక్క అడుగు దూరంలో అప్పు నిలిచి ఉంది అన్న మాట. అక్కడ పరిశీలన పూర్తి అయి అధికారిక ఆమోదముద్ర కనుక పడితే ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి పదిహేను వేల కోట్ల రూపాయలు అప్పు పుట్టినట్లే అని అంటున్నారు. అయితే ఈ ఆర్ధిక సంవత్సరం నాలుగు నెలలు మాత్రమే ఉంది. ఈ ఏడాది ఎంత రుణం ఇస్తారు వచ్చే ఏడాది ఎంత ఇస్తారు అన్నది తొందరలోనే తేలనుంది అని అంటున్నారు.
మొత్తం మీద చూస్తే కనుక అమరావతి రాజధానికి రుణం అయితే వచ్చేస్తోంది. ఇప్పటికే సీఆర్డీయేకు ఏఏ పనులు ఈ పదిహేను వేల కోట్ల రూపాయలతో చేపట్టాలి అన్న దాని మీద రాష్ట్ర ప్రభుత్వం నిర్దేసించింది అన్నది తెలిసిందే. ఆ ప్రకారం మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేయనున్నారు అని అంటున్నారు. ఇక మూడేళ్ల కాల వ్యవధిలో అమరావతి రాజధాని పనులను ఈ భారీ మొత్తంతో పూర్తి చేయాలని కూడా డెడ్ లైన్ పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది.