అంబటి రాంబాబుపై కేసు నమోదు.. కారణం ఇదే!
ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో పోలీసు కేసులు కీలక పాత్ర పోషిస్తున్నాయంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే!
ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో పోలీసు కేసులు కీలక పాత్ర పోషిస్తున్నాయంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే! ఈ సమయంలో తాజాగా మరో వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై గుంటూరు జిల్లా పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. అందుకు గల కారణం ఆసక్తిగా ఉందని అంటున్నారు.
అవును... గుంటూరు జిల్లా పట్టాభిపూరం స్టేషన్ లో వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే సమయంలో అంబటితో పాటు పలువురు వైసీపీ నేతలపైనా కేసు నమోదయ్యింది. తమ విధులకు ఆటకం కలిగించారనే కారణంతో మాజీమంత్రి అంబటి రాంబాబు, వైసీపీ నేతలపై కేసు ఫైల్ చేసినట్లు చెబుతున్నారు.
ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేదికగా అభ్యంతర పోస్టులు పెట్టిన పలువురుని పోలీసులు అరెస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలపైనా, వారి కుటుంబ సభ్యులపైనా అసభ్యకరమైన పోస్టులు పెట్టిన టీడీపీ కార్యకర్తలను కూడా అరెస్ట్ చేయాలంటూ అంబటితో పాటు పలువురు వైసీపీ నేతలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేశారు.
అయితే... తాము ఫిర్యాదులు చేసి ఎన్ని రోజులు అవుతున్నా, ఎన్ని ఫిర్యాదులు చేస్తున్నా కేసులు నమోదు చేయడం లేదని.. పోలీసులు పక్షపాత వైఖరి ప్రదర్శిస్తున్నారన్నట్లు ఆరోపిస్తూ, ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు అంబటి & కో. ఇందులో భాగంగా.. రెండు రోజుల పాటు వైసీపీ నేతలతో కలిసి పట్టాభిపురం స్టేషన్ ముందు బైఠాయించారు అంబటి.
ఈ సందర్భంగా ఫ్లకార్డులు చేతపట్టి.. తాము చేసిన ఫిర్యాదులపై కేసులు నమోదు చేయాలని, చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఇలా తాము చేసిన ఫిర్యాదులపై ఎప్పటిలోగా చర్యలు తీసుకుంటారో చెప్పాలంటూ నిరసన తెలపడంతో.. తమ విధులకు ఆటంకం కలిగించారంటూ అంబటి రాంబాబుపై కేసు పెట్టారు పోలీసులు!
దీంతో... అంబటి రాంబాబుకు పోలీసులు నోటీసులు ఇచ్చి, విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అంబటి రాంబాబు.. గుంటూరులోని ఆయన నివాసంలో ఉన్నారు. దీంతో... ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.