ఇది సంబరాలు చేసుకునే విజయమేనా బాబుగారూ!
ఒక విజయం ఏ పార్టీకైనా ఉత్సాహాన్నిస్తుంది. పైగా 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయిన వైసీపీలో ఇప్పుడు ఒక్క స్థానంలో వేచి ఉన్న విజయం చూసుకుని మురిసిపోతోంది
ఒక విజయం ఏ పార్టీకైనా ఉత్సాహాన్నిస్తుంది. పైగా 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయిన వైసీపీలో ఇప్పుడు ఒక్క స్థానంలో వేచి ఉన్న విజయం చూసుకుని మురిసిపోతోంది. అదే విశాఖపట్నం స్థానిక సంస్థల కోటాలో వచ్చిన ఎమ్మెల్సీ ఉప ఎన్నికల వ్యవహారం. ఈ ఎన్నికలో వైసీపీకి ఏకపక్షంగా విజయం దక్కుతుందని అనుకున్నా.. స్వతంత్ర అభ్యర్థి రూపంలో ఎన్నికల పోలింగ్ అనివార్యంగా మారింది. ఈ ఎన్నికలో సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ పోటీలో ఉన్నారు. అయితే.. కూటమి ఆది నుంచి పోటీ చేయాలని అనుకున్నా..చివరి నిముషంలో వెనక్కి తగ్గింది.
దీంతో బొత్స సత్యనారాయణ విజయం అయితే.. 90 శాతం ఖాయమైంది. ఇక, ఎన్నికల పోలింగ్ సమయానికి స్వతంత్ర అభ్యర్థికి కనుక కూటమి పార్టీలు మద్దతుగా ఉంటే.. అప్పుడు ఖచ్చితంగా ఏం జరుగుతుందనేది చెప్పడం కష్టం. అయితే.. ఇంతలోనే సంబరాల అంబటి రాంబాబు తెరమీదికి వచ్చారు. బొత్స విజయం వైసీపీ పూర్వవైభవానికి బీజం వేసిందంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేశారు. కానీ, ఈ విజయం నిజానికి ఒక విజయం కాదు. ఎందుకంటే.. కూటమి పార్టీలు పోటీలో లేవు. పైగా ఎన్నికల పోలింగ్ కూడా జరుగుతోంది. చివరి వరకు నరాలు తెగే ఉత్కంఠే! దీనికి కారణం స్వతంత్ర అభ్యర్థి వెనుక కీలక కూటమి నాయకులు ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది.
అయినప్పటికీ.. దీనిని తమ విజయం(ఇంకా కన్ఫర్మ్ కాకుండానే) అనే దోరణిలో అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు. వాస్తవానికి స్థానిక సంస్థల్లో వైసీపీ ఎలా గెలిచిందనేది అందరికీ తెలిసిందే. ఈ విషయం పక్కన పెడితే.. స్థానికంగా ఉన్న వైసీపీ నాయకులే ఇప్పుడు వైసీపీ నాయకుడిని ఎన్నుకునే పరిస్థితి వచ్చింది తప్ప.. ప్రజలు కాదు. కాబట్టి నైతికంగా చూస్తే.. దీనిని ప్రజలు ఇచ్చిన తీర్పుగా చూసే పరిస్థితి అయితే లేదు. ఇదిలావుంటే.. కూటమి తప్పుకొంది. అదే కూటమి రంగంలోకి దిగిన తర్వాత.. వైసీపీ విజయం దక్కించుకుని ఉంటే.. అప్పుడు కొంత మేరకు వారి విజయాన్ని ప్రశంసించవచ్చు.
ఇలాంటివేమీ జరగకుండా.. కూటమి తప్పుకొని వైసీపికి ఒక రకంగా మార్గం సుగమం చేసింది. ఈ పరిణామాలను మరిచిపోయిన అంబటి రాంబాబు సంబరాలు చేసుకోవడం విస్మయం కలిగిస్తోంది. ఏదేమైనా.. ఇది సంబరాలు చేసుకునే విజయమేనా రాంబాబుగారూ! అంటున్నారు పరివీలకులు. అయితే.. అసలు ఏ చెట్టూ లేని చోట వెంపలి చెట్టే మహావృక్షమైనట్టుగా అంబటి సంబరపడుతున్నారని సరిపుచ్చుకోవాలి.