ప్రజాభవన్ గా మారే ప్రగతిభవన్ ప్రజల సందర్శనకు వీలు కల్పిస్తారా?
వంద మాటలు అనాల్సిన అవసరం లేదు. ప్రత్యర్థిపై ఆరోపణల కత్తులు దూయాల్సిన పని అసలే లేదు
వంద మాటలు అనాల్సిన అవసరం లేదు. ప్రత్యర్థిపై ఆరోపణల కత్తులు దూయాల్సిన పని అసలే లేదు. జరిగిన విషయాల్ని.. జరిగినట్లుగా చూపిస్తే చాలు.. ప్రజలకు అన్నీఅర్థమైపోతాయి. ఇదే సూత్రాన్ని రాబోయే రోజుల్లో తెలంగాణకు కాబోయే సీఎం రేవంత్ చేతల్లో చేసి చూపిస్తారా? అన్నదిప్పుడు హాట్ చర్చగా మారింది. తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం కొలువు తీరిన కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన భవనాల్లో అత్యంత చర్చకు తెర తీసింది సీఎం అధికారిక నివాసమైన ప్రగతిభవన్. వందల కోట్లు ఖర్చు చేసి మరీ నిర్మించిన ఈ భవన్ గురించి వచ్చిన వార్తలు అన్ని ఇన్ని కావు.
ఈ భవన్ వైభోగం గురించి చెప్పే కన్నా.. కళ్లారా చూడాల్సిందేనని చెబుతుంటారు. అయితే.. ఇందులోకి పరిమిత సంఖ్యలో మాత్రమే పర్మిషన్ ఉంటుందని చెప్పాలి. రాజభోగాన్ని కళ్లకు కట్టేలా ఉండే ఈ భవనం ఎంత విలాసవంతంగా ఉంటుందన్న విషయాన్ని కొన్ని సందర్భాల్లో విడుదలయ్యే అధికారిక ఫోటోల్ని చూసినప్పుడు ప్రజలకు తెలిసేది. అయితే.. ఈ రాజరిక పోకడల్ని సామాన్యులు సైతం తెలుసుకునేందుకు వీలుగా కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త ఆలోచన చేస్తున్నట్లుగా చెబుతున్నారు.
ఇప్పటికే ప్రగతి భవన్ ను అంబేడ్కర్ ప్రజాభవన్ గా మారుస్తామని.. ఆ భవనంలో తమ ముఖ్యమంత్రి నివాసం ఉండరన్న విషయాన్ని కాంగ్రెస్ నేత రేవంత్ ఇప్పటికే స్పష్టం చేయటం తెలిసిందే. ఇదే మాట మీద నిలబడటంతో పాటు.. ప్రగతి భవన్ ను సామాన్యులు తమ కళ్లారా చూసేందుకు వీలుగా.. ప్రజల సందర్శనార్థం అనుమతిస్తే సరిపోతుందంటున్నారు. ప్రజాసొమ్ముల్ని ఎలాంటి లగ్జరీకి వినియోగించారో అర్థమవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే కానీ చేస్తే.. తెలంగాణ ప్రజల్లో జరిగే చర్చ కాంగ్రెస్ ప్రభుత్వానికి మరింత మేలు చేస్తుందన్న వాదన బలంగా వినిపిస్తోంది. మరి.. ఈ అంశాన్ని మరో రెండు రోజుల్లో కొలువు తీరే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంత త్వరగా అమలు చేస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.