రష్యాకు వణికిన అమెరికా.. ఉక్రెయిన్ ఎంబసీ హడావుడిగా మూసివేత
అలాంటిది తాజాగా అమెరికా రష్యా పైకి దీర్ఘశ్రేణి క్షిపణులను (ఆర్మీ టాక్టికల్ మిస్సైల్ సిస్టమ్) ప్రయోగించేందుకు అనుమతిచ్చింది.
బహుశా ఇటీవలి కాలంలో రష్యాను చూసి అమెరికా బెదిరిన సందర్భం ఇదేనేమో..? ప్రచ్ఛన్న యుద్ధం ముగిసి.. ప్రపంచంలో ఏకైక సూపర్ పవర్ గా మారిన తర్వాత అమెరికాకు తిరుగులేకుండా పోయింది. ఇరాక్, అఫ్ఘానిస్థాన్ యుద్ధాల్లో ఎదురుదెబ్బలు తిన్నా.. అది వారి గడ్డ మీద కాదు. అయితే, తాజా రష్యా భయానికి ఒకడుగు వెనక్కు వేసింది. అది కూడా విదేశీ గడ్డపైన కావడం గమనార్హం.
ఇరు దేశాల యుద్ధం.. ఉక్రెయిన్ లో..
అమెరికా-రష్యా రెండు దేశాలు ఉక్రెయిన్ లో తలపడుతున్నాయని చెప్పొచ్చు. వీటి మధ్యలో ఉక్రెయిన్ ఆట బొమ్మగా మారిందా? అనే అనుమానాలూ కలుగుతున్నాయి. ఎందుకంటే.. రెండున్నరేళ్లుగా ఉక్రెయిన్ కు అమెరికా సహా నాటో దేశాలు ఆయుధాలను సరఫరా చేస్తున్నాయి. అలాంటిది తాజాగా అమెరికా రష్యా పైకి దీర్ఘశ్రేణి క్షిపణులను (ఆర్మీ టాక్టికల్ మిస్సైల్ సిస్టమ్) ప్రయోగించేందుకు అనుమతిచ్చింది. ఇలాంటి ఆరు క్షిపణులను ఉక్రెయిన్ ప్రయోగించినట్లు రష్యా తెలిపింది.
రష్యా గురి అమెరికా రాయబార ఆఫీసుపై..
తమపైకి అమెరికా ఆయుధాలు ప్రయోగిస్తే రష్యా ఎందుకు సహిస్తుంది..? అమెరికాను ఎక్కడైనా లక్ష్యంగా చేసుకుంటుంది. ఈ కోణంలో ఉక్రెయిన్ రాజధాని కీవ్ లోని ఆ దేశ రాయబార కార్యాలయాన్ని టార్గెట్ చేసిందనే అనుమానం కలింది. దీంతో ఆ కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేసింది అమెరికా. బుధవారం రష్యా భారీ వైమానిక దాడులకు పాల్పడే ప్రమాదం ఉన్నట్లు సమాచారం రావడంతోనే ఈ చర్యకు పాల్పడింది. రాయబార కార్యాలయం ఉద్యోగులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కూడా సూచించింది. ఎయిర్ అలర్ట్ లు ప్రకటించగానే కీవ్ లోని అమెరికన్ పౌరులు షెల్టర్లలోకి వెళ్లిపోవాలని పేర్కొంది.