అమెరికా షట్ డౌన్? ఏమిటీ గోల..? మనోళ్లకూ కటకటే?
గుర్తుందా..? 2018-19 మధ్య సమయం.. అప్పటికి ఇంకా కొవిడ్ లేదు. కానీ, అమెరికా ‘షట్ డౌన్’ అయింది. దీంతో ప్రపంచమే ఆశ్చర్యపోయింది
గుర్తుందా..? 2018-19 మధ్య సమయం.. అప్పటికి ఇంకా కొవిడ్ లేదు. కానీ, అమెరికా ‘షట్ డౌన్’ అయింది. దీంతో ప్రపంచమే ఆశ్చర్యపోయింది. అగ్ర రాజ్యంలోనూ ఇలా జరుగుతుందా? అని నోరెళ్లబెట్టింది. వాస్తవానికి కొవిడ్ సమయంలో ‘లాక్ డౌన్’ అనే మాట బాగా పాపులర్ అయింది. అమెరికన్ ఇంగ్లిష్ లో లాక్ డౌన్ ను షట్ డౌన్ అంటారు. అయితే, ఇది అలాంటి షట్ డౌన్ కాదు.
ఈ రాత్రి లోగా..
తాజాగా ప్రతిపాదించిన ప్రభుత్వ వ్యయాల బిల్లు (కార్యకలాపాలు, జీతాల వంటి కీలక బిల్లులు) ఆమోదానికి నోచుకోకపోవడంతో అమెరికా ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించే ముప్పు పొంచి ఉంది. దీనంతటికీ కారణం.. బైడెన్ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ తిరస్కరించడమే. ఈ నేపథ్యంలో ప్రతినిధుల సభ స్పీకర్ మైక్ జాన్సన్ మార్చి 14కు ప్రభుత్వానికి నిధులు సమకూర్చేలా కొత్త బిల్లును ప్రవేశపెట్టారు. రెండేళ్ల పాటు రుణాలపై సీలింగ్ సస్పెన్షన్ వంటి ట్రంప్ డిమాండ్లను చేర్చి.. ట్రంప్ కూడా మద్దతు తెలుపుతూ, మిగిలినవారూ అనుకూల ఓటేయాలని పిలుపునిచ్చారు. కానీ, దిగిపోతున్న అధ్యక్షుడు బైడెన్ పార్టీకి చెందిన డెమోక్రాట్లు మాత్రం గట్టి వ్యతిరేకించారు. అయితే, ప్రతినిధుల సభ సైతం 235-174తో తిరస్కరించింది. ట్రంప్ పార్టీకి చెందిన 38 మంది రిపబ్లికన్ సభ్యులు.. డెమోక్రాట్లతో కలిసి బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశారు. ఇక సెనెట్ లో డెమోక్రాట్లకే ఇంకా పట్టుంది. ఈ నేపథ్యంలో అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రిలోగా ప్రభుత్వానికి నిధులు సమకూర్చడంలో కాంగ్రెస్ విఫలమైతే షట్ డౌన్ ఖాయం.
అప్పట్లో 35 రోజులు..
అదే జరిగితే.. అమెరికాకు ఇటీవలి కాలంలో ఇది రెండో షట్ డౌన్ అవుతుంది. అమెరికా చరిత్రలోనే అత్యధికంగా 2018-19 మధ్య 35 రోజులు ఇలానే జరిగింది. అప్పుడు ట్రంప్ అధ్యక్షుడు కావడం గమనార్హం.
సర్కారీ ఉద్యోగులపైనే భారం
షట్ డౌన్ జరిగితే.. లక్షలమంది ఉద్యోగులపై ప్రభావం పడనుంది. 8.75 లక్షల మంది పనులు నిలిచిపోతాయట. ఇప్పటికే చాలామందిని పని ప్రదేశంలో రిపోర్టు చేయొద్దని కోరారు. అత్యవసర సేవలైన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వంటి విభాగాల్లోని 14 లక్షల మంది విధులు కొనసాగించాలి. రవాణా, ఇతర రంగాలపై షట్ డౌన్ ప్రభావం అధికంగా ఉంటుంది.