నలుగురు అమెరికా ప్రెసిడెంట్స్ ని మర్డర్ చేశారా?
ఇలా అమెరికా అధ్యక్షుడు ఏదైనా దేశానికి వెళ్లే పని ఉంటే... ఆ తేదీకి మూడు నెలలు ముందుగా సీక్రెట్ సెక్యూరిటీ ఆ దేశంలో దిగిపోతారు.
ఈ నెల 9, 10 తేదీల్లో ఢిల్లీలో జరిగే జీ-20 శిఖరాగ్ర సదస్సు కోసం ప్రపంచ దేశాధినేతలు భారత్ కు వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో దేశరాజధాని ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో తాజాగా అమెరికా అధ్యక్షుడి భద్రతా ఏర్పాట్లు హాట్ టాపిక్ గా మారాయి.
అవును... అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడి సెక్యూరిటీ గురించి చాలా హాలీవుడ్ సినిమాల్లో చూపించారు! అయితే అదంతా బిల్డప్ అనుకుంటే పొరపాటే! అంతకు మించి అన్నట్లుగా అమెరికా అధ్యక్షుడి భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. తాజాగా జో బైడెన్ సెక్యూరిటీ మొత్తం ఢిల్లీలో దర్శనమిచ్చింది. ఇది పైకి కనిపించే సెక్యూరిటీ మాత్రమే!
ఎందుకంటే... మూడు నెలల ముందే యునైటెడ్ స్టేట్స్ సీక్రెట్ సర్వీస్ ఢిల్లీలో బైడెన్ టూర్ కి సంబంధించి భద్రతా ఏర్పాట్లు ప్రారంభించేసింది. అమెరికా అధ్యక్షుడి భద్రతలో కీలక భూమిక పోషించే ఈ యూఎస్ సీక్రెట్ సర్వీస్ తనను ఒంటరిగా వదిలేయాలని స్వయంగా అధ్యక్షుడు కోరినా, ఆ ఆదేశాలను స్వీకరించదు.
పైగా... అమెరికా అధ్యక్షుడు వేరే ఏ దేశానికైనా వెళ్లాలని నిర్ణయించుకుంటే.. దాదాపు మూడు నెలల ముందు నుంచే యూఎస్ సీక్రెట్ సర్వీస్ తమ పనులు ప్రారంభించేస్తుంది. సుమారు ఏడు వేల మంది ఏజెంట్లు, అధికారులు ఉండే ఈ సీక్రెట్ సర్వీస్ 1865లో ఏర్పడినప్పటికీ.. 1901 నుంచి అమెరికా అధ్యక్షుడికి భద్రతా బాధ్యతలను చూస్తుంది.
ఈ స్థాయిలో అమెరికా అధ్యక్షుడి భద్రతా ఏర్పాట్లు ఎందుకు చేస్తారు.. ప్రపంచంలో ఏ దేశాధ్యక్షుడిగా లేనంతగా అన్నట్లుగా ఉందుకు మల్టీ లేయర్ సెక్యూరిటీ వ్యవస్థ ఉంటుంది అని అంటే... అగ్రరాజ్యం అమెరికా నలుగురు అధ్యక్షులు హత్యకు గురికావడాన్ని చూసింది. దీంతో అధ్యక్షుడి భద్రత విషయంలో తగ్గేదేలే అన్నట్లుగా ఉంటుంది.
అవును... అబ్రహాం లింకన్ (1865), జేమ్స్ గార్ ఫీల్డ్ (1881), విలియమ్ మెకిన్లే (1901), జాన్ ఎఫ్ కెనడీ (1963) లు హత్యకు గురయ్యారు. దీంతో ఇలాంటి సంఘటనలు ఇంకెప్పుడూ పునరావృతం కాకూడదని బలంగా ఫిక్సయిన అగ్రరాజ్యం అధ్యక్షుడి భద్రత విషయంలో మూడు సెక్యూరిటీ లేయర్లు ఏర్పాటు చేసుకుంది.
ఇందులో ఆయనకు పక్కనే అధ్యక్షుడి ప్రొటెక్టివ్ డివిజన్ ఏజెంట్ సెక్యూరిటీ ఉండగా.. అనంతరం సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ ఉంటారు. ఇక మూడో లేయర్ గా పోలీసులు ఉంటారు. ప్రస్తుతం ఢిల్లీ వస్తున్నారు కాబట్టి ఆ మూడు లేయర్ లకు తోడు ఢిల్లీ పోలీసులు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సి.ఆర్.పిల్.ఎఫ్.) తో కూడిన మరొక సెక్యూరిటీ లేయర్ కూడా ఉంటుంది.
ఇలా అమెరికా అధ్యక్షుడు ఏదైనా దేశానికి వెళ్లే పని ఉంటే... ఆ తేదీకి మూడు నెలలు ముందుగా సీక్రెట్ సెక్యూరిటీ ఆ దేశంలో దిగిపోతారు. అధ్యక్షుడు బ్బస చేసే హోటల్ నుంచి అన్ని విషయాలను పరిశీలించి తమ ఆధీనంలోకి తెచ్చుకుంటారు. ఇక పర్యాటక దేశంలో విమానాశ్రయంలో దిగింది మొదలు వ్యవస్థ మొత్తం ఆ సెక్యూరిటీ చేతిలోకి వెల్లిపోతుంది.
ఇందులో భాగంగా ముందుగా ఎయిర్ పోర్ట్ లో అమెరికా అధ్యక్షుడి కోసం ప్రత్యేకంగా ల్యాండింగ్ స్పేస్ ఇవ్వాల్సి ఉంటుంది. కారణం... ఆయన ప్రయాణించే ఎయిర్ ఫోర్స్ వన్ విమానంతోపాటూ, మరో ఆరు బోయింగ్ సీ17 విమానాలు కూడా అక్కడ ల్యాండ్ అవుతాయి. వాటిలో స్టాఫ్ మెంబర్స్ తో పాటు అనేక వాహనాలు ఉంటాయి.
ఆ ఆరు బోయింగ్ విమనాల్లోనూ ఒక హెలికాప్టర్.. లిమోజిన్ కార్లు.. కమ్యూనికేషన్ ఎక్విప్‌మెంట్ ఉంటుంది. అనంతరం అక్కడ నుంచి ఆయన బస చేసే హోటల్ కు బయలుదేరతారు. ఆ సమయంలో ఆ హోటల్ చుట్టుపక్కల మార్గాల్లో పార్క్ చేసిన కార్లు, వాహనాలను మొత్తం తొలగిస్తారు.
అనంతరం ఆయన బస చేసే హోటల్ కు చేరుకుంటారు. అధ్యక్షుడు బస చేసిన హోటల్లో ఆయన గది ఉన్న ఫ్లోర్ తోపాటు దానికి పైన, కింద ఉన్న ఫ్లోర్ కూడా ఖాళీ చేయిస్తారు. వాటిని అధ్యక్షుడి స్టాఫ్ మాత్రమే ఉపయోగిస్తారు. సాధారణంగా హోటల్స్ లో ఉండేటీవీ, ఫోన్ లను కూడా తొలగిస్తారు. కిటికీలకు బులెట్ ప్రూఫ్ షీల్డ్ బిగిస్తారు.
ఇక హోటల్ గది నుంచి సదస్సుకు వెళ్లేందుకు లిమోజిన్ కార్లో ప్రయాణిస్తారు. ఆ కారుకు "ద బీస్ట్" అనే పేరుంది. ఈ కారులో అన్ని రకాల ఎక్విప్‌మెంట్స్ ఉంటాయి. కెమికల్ దాడులను కూడా తట్టుకోగలిగేలా ఈ కారు అత్యంత సురక్షితంగా ఉంటుంది. ఈ కారు నడిపే డ్రైవర్లు ఎలాంటి దాడి జరిగినా.. కారును 180 డిగ్రీల్లో వెనక్కు తిప్పగలిగేలా శిక్షణ పొంది ఉంటారు.
ఈ స్థాయిలో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడి సెక్యూరిటీ ఉంటుంది. ఈ నెల 9, 10 తేదీల్లో ఢిల్లీలో ఆయన సెక్యూరిటీని మరోసారి చూడవచ్చు!