భారతీయుడ్ని చంపిన పాక్ డాన్ ను ఏసేశారు!
పంజాబ్ లోని భికివింద్ కు చెందిన రైతు.. 1990లలో అక్రమంగా పాక్ సరిహద్దుల్లోకి ప్రవేశించారన్న కారణంగా అరెస్టు అయ్యారు
దాయాది పాకిస్థాన్ లో మోస్ట్ వాంటెడ్ డాన్ గా.. లష్కరే తొయిబా ఉగ్రసంస్థ వ్యవస్థాపకుడు హఫీజ్ సయిద్ కు అత్యంత సన్నిహితుడిగా పేర్కొన్న అమీర్ సర్పరాజ్ తాంబాను తాజాగా గుర్తు తెలియని దుండగులు ఏసేవారు. లాహోర్ లో చోటు చేసుకున్న ఈ ఘటన సంచలనంగా మారింది. పొరపాటున సరిహద్దు దాటిన రైతును పాక్ జైల్లో చంపేసిన నిందితుల్లో ఒకడైన ఈ పాక్ డాన్ హత్యకు గురి కావటం సంచలనంగా మారింది.
పంజాబ్ లోని భికివింద్ కు చెందిన రైతు.. 1990లలో అక్రమంగా పాక్ సరిహద్దుల్లోకి ప్రవేశించారన్న కారణంగా అరెస్టు అయ్యారు. ఇతనిపై పాక్ ప్రభుత్వం కర్కశంగా వ్యవహరించిందన్న విమర్శలు ఉన్నాయి. పొరపాటున పాక్ లోకి అడుగుపెట్టిన అతడిపై.. పంజాబ్ ప్రావిన్సులో అనేక బాంబు పేలుళ్లలో పాల్గొన్నట్లుగా అభియోగాలు మోపి జైలుపాలు చేయటమే కాదు.. అర్థం పర్థం లేని వాదనలతో అతడికి అక్కడి కోర్టు మరణశిక్షను విధించింది.
ఈ క్రమంలో అతడ్ని లాహోర్ జైల్లోని ఖైదీలు ఇనుపకడ్డీలు.. ఇటుకలతో జైల్లో దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో అతడు కోమాలోకి వెళ్లిపోయారు. చివరకు 2013 మే 2న అతడు ప్రాణాలు కోల్పోయాడు. జైల్లో సరబ్ జిత్ పై దాడికి పాల్పడిన నిందితుల్లో సర్ఫరాజ్ ఒకరు.
సరబ్ జిత్ ను విడుదల చేయాలని.. అతడు నిర్దోషిగా ప్రకటించాలని పేర్కొంటూ అతడి కుటుంబ సభ్యులు సుదీర్ఘకాలం పోరాటం చేశారు. పొరపాటున తన సోదరుడు సరిహద్దు దాటినందుకు అతడి మీద తీవ్ర ఆరోపణలతో జైలు పాలు చేశారంటూ అతడి సోదరి దల్బీర్ కౌర్ పెద్ద ఎత్తున పోరాడారు. చివరకు పాక్ జైల్లో ఉన్న తన సోదరుడ్ని చూసేందుకు పాక్ కు వెళ్లి వచ్చారు కూడా.
దీనికి సంబంధించి 2016లో బాలీవుడ్ లో ఒక బయోపిక్ వచ్చింది. ఇందులో సరబ్ జిత్ గా రణదీప్ హుడా నటిస్తే.. అతడి సోదరిగా ఐశ్వర్యరాయ్ లు నటించారు. గత ఏడాది సరబ్ జిత్ సోదరి మరణించారు. ఇదిలా ఉండగా..తాజాగా సరబ్ జిత్ ను హత్య చేసిన పాక్ డాన్ హత్యకు గురి కావటం సంచలనంగా మారింది. ఇంతకూ అతడ్ని హతమార్చింది ఎవరు? అన్నదిప్పుడు హాట్ టాపిక్ గా మారింది.