'కూటమి అధికారంలోకి వస్తే ఉగ్రవాదం విజృంభిస్తుంది;... షా సంచలన వ్యాఖ్యలు!

ఈ సందర్భంగా ప్రసంగించిన అమిత్ షా... గణేష్ చతుర్థి రోజున బీజేపీ తొలి ఎన్నికల ర్యాలీ ప్రారంభం కావడం యాదృచ్చికం అని అన్నారు.

Update: 2024-09-07 15:30 GMT

దేశంలో మరోసారి ఓ ఆసక్తికరమైన ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగా... కేంద్రపాలిత ప్రాంతం జమూకశ్మీర్ లో తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో తాజాగా జరిగిన బహిరంగ సభలో మైకందుకున్న అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా జమ్మూకశ్మీర్ కు రాష్ట్ర హోదా అంశాన్నీ తెరపైకి తెచ్చారు. ఇదే సమయంలో కూటమి పార్టీలపై విరుచుకుపడ్డారు.

అవును... త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ కేంద్రమంత్రి అమిత్ షా ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా నేడు జమ్మూకశ్మీర్ లో ఉన్న పరిస్థితులకు మూడు కుటుంబాలే కారణం అని.. ఆ మూడు కుటుంబాలే జమ్మూకశ్మీర్ ను దోచుకున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ లను ఉద్దేశించి షా ఈ వ్యాఖ్యలు చేశారు!

త్వరలో జమ్మూకశ్మీర్ లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది బీజేపీ. ఈ సందర్భంగా ప్రసంగించిన అమిత్ షా... గణేష్ చతుర్థి రోజున బీజేపీ తొలి ఎన్నికల ర్యాలీ ప్రారంభం కావడం యాదృచ్చికం అని అన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం తొలిసారిగా ఓటింగ్ జరుగుతుందని.. ఈ సందర్భంగా జమ్మూకశ్మీర్ ఓటర్లు రెండు జెండాల కింద కాకుండా.. ఒకే త్రివర్ణ పతాకం కింద ఓటు వేయబోతున్నారని అన్నారు.

ఈ నేపథ్యంలోనే పీడీపీతో కలిసి కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి ఈ ప్రాంతాన్ని ఉగ్రవాద మంటల్లోకి నెట్టేందుకు ప్రయత్నించిందని అమిత్ షా సంచలన ఆరోపణలు చేశారు. ఒకవేళ ఈ కూటమి అధికారంలోకి వస్తే.. ఉగ్రవాదం మళ్లీ విజృంభిస్తుందని అన్నారు. గత పదేళ్లలో మోడీ ప్రభుత్వం 70 శాతం ఉగ్రవాద చర్యలను అరికట్టగలిగిందని.. బీజేపీ అధికారంలో ఉంటే టెర్రరిజాన్ని నాశనం చేస్తుందని షా చెప్పుకొచ్చారు!

ఈ సమయంలోనే జమ్మూకశ్మీర్ కు రాష్ట్ర హోదా విషయాన్ని తెరపైకి తెచ్చారు షా. ఇందులో భాగంగా... బీజేపీ అధికారంలోకి వస్తే జమ్మూకశ్మీర్ కు రాష్ట్ర హోదాను పునరుద్దరిస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర హోదా హామీలతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని.. అలా చేసే అధికారం రాహుల్ గాంధీకి ఉందా అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నుంచి ఎలాంటి రియాక్షన్ రాబోతుందనేది వేచి చూడాలి!

Tags:    

Similar News