మోడీ సీటుకు పోటా పోటీ... రేసులో అమిత్ షా ముందు !

ముచ్చటగా మూడవసారి నరేంద్ర మోడీ కేంద్రంలో ప్రధానిగా ఇటీవలే ప్రమాణం చేశారు.

Update: 2024-08-24 08:30 GMT

ముచ్చటగా మూడవసారి నరేంద్ర మోడీ కేంద్రంలో ప్రధానిగా ఇటీవలే ప్రమాణం చేశారు. 2029 లో కూడా మళ్లీ ఆయనే ని హోం మంత్రి అమిత్ షా ఈ మధ్యనే పదే పదే ప్రకటించారు. నిజానికి ఏడున్నర పదుల వయసులోకి నరేంద్ర మోడీ 2025 సెప్టెంబర్ 17 నాటికి వస్తారు. బీజేపీ నరేంద్ర మోడీ అమిత్ షాల సారధ్యంలోకి వచ్చిన తరువాత ఈ వయసు నిబంధనను తెచ్చారు.

అలా ఎల్కే అద్వానీ మురళీ మనోహర్ జోషీ వంటి వారు తప్పుకున్నారు. ఇపుడు ఆ సమస్య నరేంద్ర మోడీకి రాబోతుందా అన్నదే చర్చ. అయితే మోడీకి వచ్చే ఏడాదికి ఏడున్నర పదులు నిండినా ప్రధాని పదవి నుంచి తప్పుకోమని చెప్పే సాహసం ఇటు బీజేపీలో కానీ అంటు ఆరెస్సెస్ లో కానీ చేసేవారు ఎవరూ లేరు అన్నది స్పష్టం.

అయితే సర్వే సంస్థలు మాత్రం ఎప్పటికపుడు మోడీ ప్రధాని పదవికి బీజేపీలో ఆయన వారసులుగా ఎవరు అన్నది చేస్తూ జనాలలో రాజకీయ ఆసక్తిని పెంచుతూనే ఉన్నాయి. అలా ఇపుడు లేటెస్ట్ గా ఒక సర్వే ఫలితాలు వెలువడ్డాయి.

ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే -2024 పేరుతో చేసిన ఈ సర్వేలో మోడీ తరువాత ప్రధానిగా బాధ్యతలు నిర్వహించేందుకు బీజేపీలో ఎవరు ఉత్తమ నాయకుడు అంటే కేంద్ర హోం మంత్రి అంటూ ఆయనకు ఎక్కువ మంది ఓటేశారు. అమిత్ షాకు అలా పాతిక శాతం మద్దతు జనం నుంచి దక్కింది.

ఇక మోడీ వారసుడు యూపీ సీఎం ఆదిత్యనాథ్ యోగి అని చాలా కాలంగా అందరూ అంటున్నదే. ఆయనను ఆరెస్సెస్ కూడా ప్రమోట్ చేయవచ్చు అన్న ప్రచారం కూడా ఉంది. పూర్తి హిందూత్వ భావాలతో ఉన్న యోగీ అయితేనే బీజేపీకి బెటర్ అన్న ఆలోచన కూడా ఉంది. మరి యోగీకి ఎంత శాతం మద్దతు దక్కింది అంటే 19 శాతమే అని ఈ సర్వే తేల్చింది.

అలాగే పాలనా వ్యవహారాలలో సమర్ధుడిగా బీజేపీలో మితవాదిగా వాజ్ పేయి లక్షణాలను పుణికి పుచ్చుకుని ప్రతిపక్షాలకు సైతం నచ్చే నేతగా మోడర్న్ ఇండియాకు తగిన ప్రధానిగా అందరూ అనుకునే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి మూడవ స్థానమే ఈ సర్వే ఇచ్చింది. ఆయనకు 13 శాతం మంది మాత్రమే మద్దతుగా నిలిచారు. అంటే మోడీ తరువాత ప్రధాని అయ్యే రేసులో నితీన్ గడ్కరీది థర్డ్ ప్లేస్ అన్న మాట. అలాగే ఆయన చాలా దూరంలో ఉన్నారు అన్న మాట.

ఇక కేంద్ర రక్షణ మంత్రి యూపీకి చెందిన దిగ్గజ నేత రాజ్ నాధ్ సింగ్ కానీ బీజేపీలో అత్యధిక కాలం సీఎం గా పనిచేసిన వారుగా గుర్తింపు తెచ్చుకున్న మధ్యప్రదేశ్ సీనియర్ నేత కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ కానీ చూస్తే జస్ట్ అయిదు శాతం మాత్రమే మద్దతుతో నిలిచి ఉన్నారు అంటోంది ఈ సర్వే.

అంటే మోడీ బీజేపీ కొత్త వయసు నిబంధలన ప్రకారం వచ్చే ఏడాది సెప్టెంబర్ 17 తరువాత నిజంగా దిగిపోతే గద్దెనెక్కేది అమిత్ షా అని ఈ సర్వే చెప్పకనే చెప్పేసింది అన్న మాట. ఒకవేళ మోడీ 2029 దాకా కంటిన్యూ అయి ఆ ఎన్నికల్లో బీజేపీ మళ్లీ గెలిస్తే అపుడు ప్రధాని పదవిని అందుకునేది కూడా అమిత్ షాయే అని కూడా ఈ సర్వే బట్టి అర్ధం అవుతోంది.

అయితే ఈ సర్వేలు ఎప్పటికపుడు మారుతూ ఉంటాయి. ఈ రోజున బీజేపీలోనూ ప్రభుత్వంలోనూ అమిత్ షా పవర్ ఫుల్ గా ఉన్నారు. రేపటి రోజున ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు అని అంటున్నారు. బీజేపీలో జాతీయ స్థాయిలో ఎందరో ఉద్ధండులు ఉండగా గుజరాత్ సీఎం గా ఉన్న మోడీ జాతీయ తెర మీదకు దూసుకుని వచ్చి ప్రధాని కాలేదా అని గతాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. అయినా మోడీ పూర్తి ఆరోగ్యంతో బలంగా ఉన్న వేళ మళ్లీ మళ్లీ ఆయనే ప్రధాని అవుతారు అని ఒక వైపు ప్రచారం సాగుతున్న వేళ ఆయన వారసుడి గురించి చర్చ ఎందుకు అన్నది కూడా కమలం పార్టీలో ఉందిట.

Tags:    

Similar News