అనపర్తి పితలాటకం : రాజమండ్రి ఎంపీ సీటుకే ఎసరు...!?
అవతల వైపు వైసీపీ సిట్టింగ్ అభ్యర్థి అయిన సత్తి సూర్యనారాయణ రెడ్డికే మరోసారి టికెట్ ఖరారు చేసింది.
అనపర్తి సీటు అన్నది ఎపుడూ డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉంటుంది. ఇక్కడ వచ్చే మెజారిటీతో రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి సునాయాసంగా గెలిచి వస్తున్నారు. రాజమండ్రి ఎంపీ తల రాతను మార్చే ఈ సీటు మీద ఇపుడు రాజకీయ రచ్చ సాగుతోంది. అది టీడీపీ కూటమిలోనే. అవతల వైపు వైసీపీ సిట్టింగ్ అభ్యర్థి అయిన సత్తి సూర్యనారాయణ రెడ్డికే మరోసారి టికెట్ ఖరారు చేసింది.
టీడీపీ తరఫున గత రెండు ఎన్నికల్లో పోటీ చేసి ఒకసారి గెలిచిన మాజీ ఎమ్మెల్యే నల్లమల్లి రామక్రిష్ణారెడ్డికే టికెట్ అని అంతా అనుకున్నారు. కానీ పొత్తులో భాగంగా బీజేపీకి ఈ సీటు ఇచ్చేశారు. అది కూడా ఎం శివరామ క్రిష్ణం రాజుకే అంటూ ప్రకటించారు.
దీంతో అనపర్తిలో అగ్గి రాజుకుంది. రామక్రిష్ణారెడ్డి వర్గం రెబెల్ గా పోటీ చేయమంటోంది. టీడీపీ ఇలా నమ్మించి మోసం చేసింది అని నల్లమల్లి వర్గం మండిపోతోంది. మాజీ ఎమ్మెల్యే నల్లమల్లి కూడా టీడీపీ హై కమాండ్ మీద ఫైర్ అవుతున్నారు. కనీస మాత్రం చెప్పకుండా సీటు వేరే పార్టీకి ఇచ్చేస్తారా అని ఆయన బిగ్ సౌండ్ చేశారు.
తనకు పార్టీ క్యాడర్ ముఖ్యమని వారి అభిప్రాయం మేరకే నడుచుకుంటాను అని బాంబు పేల్చారు. ఆయన కనుక ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే గెలుపు సంగతి పక్కన పెడితే వైసీపీకి రాజకీయ లాభం కలుగుతుంది అని అంటున్నారు.
ఇక తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న అనపర్తి సీటు గురించి ఒకసారి చూస్తే కనుక ఈ సీటులో రెడ్డి సామాజిక వర్గం చాలా ఎక్కువ. ఎంత ఎక్కువ అంటే పులివెందుల కంటే అని చెప్పాలి. ఇక గోదావరి జిల్లాలో రెడ్డీలు ఎక్కువగా ఉండే సీటు ప్రతీ సారీ వారే గెలిచే సీటు కూడా ఇదే కావడం విశేషం. కేవలం మూడు సార్లు తప్ప 1952 నుంచి ఈ సీటులో రెడ్డీలే గెలుస్తూ వస్తున్నారు.
అంతటి బలమైన సామాజిక వర్గం ఇక్కడ ఉన్నారు. పైపెచ్చు అనపర్తి రాజమండ్రి ఎంపీ సీటులో అభ్యర్ధి విజయానికి డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉంటోంది. మొత్తం రాజమండ్రిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే అనపర్తిలో వచ్చే మెజారిటీతో అభ్యర్ధి గెలిచిన సందర్భాలు కూడా గతంలో అనేకం ఉన్నాయి.
దానికి ఒక ఉదాహరణ 2009లో జరిగిన ఎన్నికల్లో రాజమండ్రి నుంచి ఎంపీ సీటుకు టీడీపీ తరఫున మురళీమోహన్, కాంగ్రెస్ నుంచి ఉండవల్లి అరుణ్ కుమార్ పోటీ చేస్తే ఆరు అసెంబ్లీ సీట్లలో మురళీమోహన్ కి మెజారిటీ రాగా అనపర్తి ఫలితమే ఉండవల్లిని మరోసారి ఎంపీగా చేసింది. ఆ ఎన్నికల్లో అరవై వేల దాకా మెజారిటీ ఉండవల్లికి దక్కినట్లుగా లెక్కలు చెబుతున్నాయి.
అలాంటి సీటుని ఇపుడు బీజేపీ తీసుకుని తప్పు చేసిందా అన్న చర్చ సాగుతోంది. బలమైన అభ్యర్ధిగా టీడీపీ నుంచి ఉన్న నల్లమల్లిని కాదని రాజుకు టికెట్ ఇవ్వడం వల్ల మరోసారి అనపర్తిలో వైసీపీ జెండా ఎగరేయడమే కాదు, రాజమండ్రి ఎంపీ సీటుని కూడా కోల్పోయే ప్రమాదం ఉందని అంటున్నారు. ఈ విషయంలో టీడీపీ బీజేపీ అధినాయకత్వాలు మరోసారి కూర్చుని పునరాలోచన చేయకపోతే మాత్రం రెండిందాలా చేటు జరిగే పరిస్థితి ఉంటుందని అంటున్నారు.