ఏపీ పాలిటిక్స్‌లో జనవరి 1 కాక రేపుతోందా... ఏంటా ట్విస్ట్...!
ఏపీలో ఇప్పటి వరకు ఎలాంటి రాజకీయాలు సాగినా.. ఇక, మరో వారం రోజుల్లో రాష్ట్రంలో రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారిపోనుంది.
ఏపీలో ఇప్పటి వరకు ఎలాంటి రాజకీయాలు సాగినా.. ఇక, మరో వారం రోజుల్లో రాష్ట్రంలో రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారిపోనుంది. జనవరి 1వ తేదీ నుంచి రాజకీయాల్లో మరింత కాక పుట్టనుంది. ఫిబ్రవరి చివరి వారంలోనే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం మెండుగా ఉండడం.. ఇప్పటికే దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం అన్నీ సమాయత్తం చేసుకోవడంతో పార్టీల్లోనూ కాక ప్రారంభమైంది.
జనవరి 1వ తేదీ నుంచి వైసీపీ అధినేత జగన్.. జిల్లాల పర్యటనలకు రెడీ అయినట్టు తెలుస్తోంది. ఈలో గానే దాదాపు 100 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేయాలని కూడా వైసీపీ నిర్ణయించినట్టు సమా చారం. దీంతో మిగిలిన 75 నియోజకవర్గాలకు సంబంధించి కూడా త్వరలోనే అభ్యర్థులను ఖరారు చేసి.. జనవరి నుంచి ఇక యుద్ధాన్ని ప్రారంభించనుందని అంటున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, విశ్వసనీయత అనే రెండు అంశాలను ప్రామాణికంగా చేసుకుని వైసీపీ దూకుడు పెంచుతుందని తెలుస్తోంది.
ఇక, టీడీపీ కూడా ఇప్పటికే అభ్యర్థులపై చర్చలు ప్రారంభించింది. కొందరిని ఇప్పటికే కేంద్ర కార్యాల యం ఎన్టీఆర్ భవన్‌కు పిలిపించి చర్చలు చేపట్టింది. వీరిలో టికెట్ పై ఆశలు పెట్టుకున్నవారు ఎక్కువ గా ఉండగా.. అదేసమయంలో నియోజకవర్గాల్లో బలమైన సామాజిక వర్గాలకు చెందిన కుల సంఘాల నాయకులు కూడా ఉన్నారు. వీరిని పార్టీ తరఫున మరింత వేగంగా పనిచేయించడంతోపాటు.. పార్టీని గెలిపించే బాధ్యతలను కూడా అప్పగించనున్నారు.
మరీ ముఖ్యంగా టికెట్ ఆశిస్తూ.. దక్కక పోతే.. రెబల్‌గా మారే అవకాశం ఉన్న వారిని ముందుగానే పసిగట్టి వారిని అనునయించే కార్యక్రమానికి కూడా టీడీపీ శ్రీకారం చుట్టింది. ఇక, జనసేనలో మాత్రం ఇంకా టికెట్ హడావుడి ప్రారంభం కాలేదు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి వెళ్తున్న నేపథ్యంలో టికెట్ల ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. దీనికి తోడు బీజేపీ కూడా కలిసివస్తుందనే ఆశలు ఇంకా సజీవంగా ఉండడంతో టికెట్ల ప్రక్రియను కొంత ఆలస్యం చేసే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే.. జనవరి 1నుంచి మాత్రం రాష్ట్రంలో కాక మరింత పెరుగుతుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.