జగన్ నమ్మకం అదేనా...ఊరిస్తున్న ట్రాక్ రికార్డు !
పార్టీని చక్క దిద్దుకోవడం చేసిన తప్పులు తిరిగి చేయకుండా ఉండడం ప్రజల మన్ననలు పొందేలా వ్యవహరించడం వంటివి చేయడం ద్వారానే వైసీపీ తిరిగి జనాదరణను పొందగలదని అంటున్నారు.
ఏపీ పాలిటిక్స్ లో చూస్తే వరసగా ఒకరికి రెండు సార్లు అధికారం ఇవ్వడం లేదు. ముఖ్యంగా విభజన ఏపీలో అదే జరుగుతోంది. 2014లో టీడీపీకి అధికారం అప్పగించిన ప్రజలు 2019లో ఆ పార్టీకి ఓడించారు. కేవలం 23 సీట్లకే పరిమితం చేశారు. నిజంగా టీడీపీ అంత తప్పు ఏమి చేసింది అన్నది విశ్లేషకులకు అర్థం కాలేదు. నిజంగా ఓడినా అంత తక్కువ నంబర్ ఎలా ఇచ్చారు అన్నది కూడా ఎవరూ విశ్లేషించలేకపోయారు.
ఇక 2024లో ఫలితాలు చూస్తే వైసీపీకి దిమ్మదిరిగేలా వచ్చాయి. టీడీపీకి 23 ఇస్తే అందులో సగం అన్నట్లుగా కేవలం 11 సీట్లను మాత్రమే వైసీపీకి ఇచ్చారు. వైసీపీ పాలనలో చాలా తప్పులు చేసి ఉండవచ్చు. కానీ అదే సమయంలో తుచ తప్పకుండా సంక్షేమం చేపట్టింది. సంక్షేమ పధకాలను మాత్రం అమలు చేస్తూ పోయింది.
మరి వాటిని కనుక జనాలు గుర్తు పెట్టుకుంటే ప్రతిపక్ష హోదాకు సరిపడా సీట్లు అయినా ఇవ్వలేకపోయారా అని అంతా అనుకున్నారు. ఈ రకమైన రిజల్ట్ ని ఎవరూ అసలు ఊహించలేదు. అయితే దీనిని పరిశీలించిన వారికి ఒక విషయం అయితే అర్ధం అవుతోంది. అదేంటి అంటే ఏపీలో ప్రజల ఆశలు ఆకాశమే హద్దు అన్నట్లుగా ఉన్నాయని అంటున్నారు.
అవి ఎన్నిక ఎన్నికకూ పెరిగిపోతున్నాయని అంటున్నారు. అంతే కాదు తమిళనాడులో మాదిరిగా ఏపీ ఓటర్లు కూడా ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. అంటే ఒకసారి గెలిచిన పార్టీని మరోసారి ప్రతిపక్షంలో కూర్చోబెట్టడం చేస్తున్నారు. ఆ సమయంలో ఆ పార్టీ చేసిన అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఓటర్ల మనసులోకి వెళ్తోందా అన్నది అర్ధం కావడం లేదు అని అంటున్నారు.
ఏపీ ప్రజలు ప్రతీ అయిదేళ్ళకూ మార్పు కోరుకుంటున్నారు అని అంటున్నారు. అదే గడచిన మూడు ఎన్నికల్లో వచ్చిన తీర్పు రూపంలో ప్రతిఫలిస్తోంది అని అంటున్నారు. దీని మీద వైసీపీకి చెందిన ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి విశ్లేషిస్తూ ప్రజల ఆశలను ఏ ప్రభుత్వం మ్యాచ్ చేయలేకపోతోంది అని అన్నారు. అందుకే ఎంత చేసినా ఎన్నికల్లో ప్రజలు మార్పు కోరుకుంటూనే ఉంటున్నారు అని అంటున్నారు.
ఆ విధంగా చూస్తే 2029 ఎన్నికల్లో టీడీపీ కూటమి ఎంత బాగా చేసింది అన్నది క్రెడిటేరియాగానే ఉండదని జనాలు మార్పు కోరుకుంటే వైసీపీకే కచ్చితంగా అధికారం దక్కుతుందని ఆయన అంటున్నారు. అయితే ఇదే రకమైన ఆలోచనలలో వైసీపీ అధినాయకత్వం కూడా ఉందని అంటున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం మీద ప్రజలకు విరక్తి కలిగితే వెంటనే అందుబాటులో ఉన్నది వైసీపీనే అని అధినాయకత్వం భావిస్తోంది.
అందుకే అయిదేళ్ల పాటు తాము విపక్ష పార్టీగా కనిపిస్తే చాలు అని జనాలు వరమాల తెచ్చి తమ మెడలోనే వేస్తారు అని భావిస్తోంది. తమిళనాడులో డీఎంకే అన్నా డీఎంకే అన్నట్లుగా అక్కడ రాజకీయం సాగుతూ వచ్చింది. ఒకసారే ఎవరికైనా అధికారం ఇచ్చి రెండోసారి మరో పార్టీని అక్కడ ప్రజలు ఎన్నుకుంటూ వస్తున్నారు అయితే 2016 ఎన్నికల్లో అది బ్రేక్ అయింది. రెండవసారి వరసగా జయలలిత సీఎం అయ్యారు.
ఇక ఏపీలో చూసుకుంటే ప్రతీ ఎన్నికల్లోనూ మార్పు కనిపిస్తోంది. మరి ఈసారి ఆ లెక్కన తమకే చాన్స్ అని వైసీపీ ధీమా పడుతోంది. కానీ అలా జరుగుతుందా అన్నది కూడా చూడాలని అంటున్నారు. ఏపీ ప్రజలు మార్పు కోరుకున్నా కూడా అది వైసీపీకి అనుకూలం అవుతుందా అన్నది కూడా ఆలోచించాలని అంటున్నారు.
ఇక చూస్తే 2019లో టీడీపీ ఓటమి తరువాత తనలో ఉన్న లోపాలను సవరించుకుంది. అంతే కాదు భేషజాలకు పోకుండా మిత్రులను కూడగట్టింది, కూటమి కట్టింది. కానీ వైసీపీ అతి ధీమాకు పోయి తన పార్టీని పటిష్టంగా నిర్మించుకోకుండా ఉంటే అపుడు ప్రజలు వైసీపీకే పట్టం కడతారు అన్న నమ్మకం ఎలా ఉంటుందని కూడా అంటున్నారు.
పార్టీని చక్క దిద్దుకోవడం చేసిన తప్పులు తిరిగి చేయకుండా ఉండడం ప్రజల మన్ననలు పొందేలా వ్యవహరించడం వంటివి చేయడం ద్వారానే వైసీపీ తిరిగి జనాదరణను పొందగలదని అంటున్నారు. అంతే తప్ప ఒకసారి వారికి ఒకసారి తమకు అవకాశం ఇస్తారు అన్న ట్రాక్ రికార్డుని పట్టుకుని ముందుకు వెళ్తే ఇబ్బందులు కూడా వస్తాయని అంటున్నారు.