జగన్ కోరిక బాబు కోరిక అలా తీరిందా....?
ఇద్దరూ రాజకీయ ప్రత్యర్ధులు ఎంతలా అంటే ఒకరి ముఖాలు మరొకరు చూసుకోవడానికి కూడా ఇష్టపడరంటారు
ఇద్దరూ రాజకీయ ప్రత్యర్ధులు ఎంతలా అంటే ఒకరి ముఖాలు మరొకరు చూసుకోవడానికి కూడా ఇష్టపడరంటారు. ఇదిలా ఉంటే వైఎస్సార్ మరణానంతరం జగన్ మీద అక్రమ కేసులు బనాయించి పదహారు నెలలు జైలు పాలు చేసిన ఘటనలో కాంగ్రెస్ తో పాటు చంద్రబాబు హస్తం కూడా ఉందని వైసీపీ ఆది నుంచి అనుమానిస్తోంది. జగన్ కి కనీసం బెయిల్ కూడా రానీయకుండా అన్ని నెలల పాటు జైలులో ఉంచారన్నది వారి బాధ.
ఇక జగన్ విషయానికి వస్తే తనను అంతలా టార్గెట్ చేసిన చంద్రబాబు విషయంలో ఏ చిన్న కేసు దొరికినా అసలు వదిలిపెట్టకూడదన్నది పంతంగా ఉంది అంటారు. వైసీపీ ప్రభుత్వం గత నాలుగున్నరేళ్ల కాలంలో టీడీపీ మీద ఆ పార్టీ నాయకుల మీద ఎన్నో కేసులు పెట్టింది. చాలా మంది లీడర్స్ అరెస్ట్ అయ్యారు. అది అటూ ఇటూ తిరిగి చంద్రబాబు దాకా రావచ్చు అని ఎప్పటి నుంచో ఊహించారు.
అమరావతి రాజధాని అతి పెద్ద స్కాం అని వైసీపీ మొదటి నుంచి చెబుతూ వస్తోంది. దాని మీద ఎన్నో విచారణలు జరిగాయి కూడా. అయితే ఆ కేసులో కావాల్సిన ఆధారాలు లభించలేదో ఇంకా దానికి టైం ఉందో తెలియదు కానీ స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ కేసులో మాత్రం బాబు పాత్ర ఉందని ఆధారాలు పట్టుకుంది వైసీపీ అంటున్నారు.
అది కూడా ఆషామషీగా కాకుండా సుదీర్ఘమైన విచారణ జరిపించిన తరువాతనే చంద్రబాబుని అరెస్ట్ చేశారు అని అంటున్నారు. ఈ కేసుకు సంబంధించి 2020 లో వైసీపీ ప్రభుత్వం కదిపింది. ఆ తరువాత ఏపీ సీఐడీ విభాగం దీని మీద పూర్తి స్థాయి విచారణను 2021 డిసెంబర్ లో స్టార్ట్ చేసింది.
ఈ కార్పోరేషన్ ఎండీగా ఉన్న గంటా సుబ్బారావు నుంచి మొదలుపెట్టి ఎనిమిది మంది దాకా అరెస్టులు చేశారు. కేసులు పెట్టారు. ఇలా రెండేళ్లుగా సాగుతున్న ఈ కేసులో చివరికి అనూహ్యంగా చంద్రబాబు మీద కేసు పెట్టి అరెస్ట్ చేశారు. మొత్తం ఈ కేసులో సూత్రధారి చంద్రబాబే అని నిర్ధారిస్తూ ఆయనను ఏ వన్ గా పెట్టి మరీ అరెస్ట్ చేసారు.
మొత్తం మీద చూసుకుంటే ఈ కేసులో బాబుని ఎట్టకేలకు వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ చేయగలిగింది. జగన్ కోరిక అలా తీరింది అని టీడీపీ నేతలు శాపనార్ధాలు పెట్టినా అసలు విషయం కూడా అదేనా అని అంటున్న వారూ ఉన్నారు.
ఇక జగన్ కోరిక మాత్రమే కాదు చంద్రబాబు కోరిక కూడా ఈ కేసు ఫలితంగా తీరింది అని అంటున్నారు. బాబు తనను అరెస్ట్ చేయమని పదే పదే కోరుతూ వస్తున్నారు. ఒక్క అరెస్ట్ తో ఎక్కడ లేని ప్రచారం వస్తుంది. ప్రజలకు తప్పు ఎవరు చేసారు, కేసు వివరాలూ పూర్వాపరాలు అవసరం లేదు, ముందు అరెస్ట్ చేశారు అన్న వార్త వచ్చిన వెంటనే అయ్యో అన్న సానుభూతి క్రియేట్ అవుతుంది.
ఇపుడు ఎన్నికలు దగ్గరలో ఉన్న నేపధ్యంలో టీడీపీకి కావాల్సింది అదే అని అంటున్నారు. ఇక చంద్రబాబు తీరు చూసుకున్నా తనను అరెస్ట్ చేస్తారు అని ఆయన కొన్ని రోజులుగా చెబుతూ వస్తున్నారు. అంటే అరెస్ట్ కావడం వల్లనే మైలేజ్ దక్కుతుంది అన్నది టీడీపీ ఆలోచనగా ఉంది అని అంటున్నారు.
ఏది ఏమైనా ఒకే కేసు ఒకే అరెస్ట్ తో అటు చంద్రబాబు ఇటు జగన్ ఇద్దరి కోరికలు తీరిపోయాయని అంటున్నారు. ఏపీ సీఐడీ విభాగం ఇలా ఏపీకి చెందిన ఇద్దరు రాజకీయ ప్రముఖుల కోరికను ఒక్క దెబ్బతో తీర్చిందని ప్రచారం అయితే సాగుతోంది. చూడాలి మరి ఈ కేసు ఫలితాలు పర్యవశానాలు ఇంకా ఎంత దూరం పోతాయో.