ఏపీలో ప్ర‌జాద‌ర్బార్ - వాణి మ‌ధ్య‌లో అస‌లు స‌మ‌స్య ఇదీ..!

క‌ట్ చేస్తే.. రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌స్తుతం ఇలాంటి ప‌రిస్థితే నెల‌కొంది. ముందు ప్ర‌జాద‌ర్భార్‌కో.. ప్ర‌జావాణికో వెళ్లాలి!

Update: 2024-08-15 11:30 GMT

ఒక‌వైపు ప్ర‌జాద‌ర్బార్‌.. మ‌రోవైపు ప్రజావాణి.. ఈ రెండు కార్య‌క్ర‌మాల‌కు కూడా ప్ర‌జ‌ల నుంచి విశేష స్పంద న వ‌స్తోంది. ప్ర‌జ‌లు త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకొనేందుకు ఆయా పార్టీల కార్యాల‌యాల‌కు పోటెత్తుతున్నారు. పెద్ద ఎత్తున స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇది త‌ప్పుకాదు. కానీ, ఇక్క‌డే ప్ర‌ధాన స‌మ‌స్య ఉంటుంది. ఇటీవ‌ల అనంత‌పురంలోని రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గంలో ఒక కుటుంబం పోలీసుల‌ను ఆశ్ర‌యించి.. త‌మ స‌మ‌స్య చెప్పుకొనే ప్ర‌య‌త్నం చేసింది.

అయితే.. పోలీసులు కేసు న‌మోదు చేయ‌లేదు. క‌నీసం వారు చెప్పే వాద‌న‌ను కూడా వినిపించుకోలేదు. దీనికి కార‌ణం.. ''ముందు ప్ర‌జాద‌ర్బార్‌లో అప్లికేష‌న్ ఇవ్వండి'' అని పోలీసులు ఉచిత స‌ల‌హా ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. ఇదే త‌ర‌హా ఘ‌ట‌న తూర్పుగోదావ‌రి జిల్లా పిఠాపురంలోనూ జ‌రిగింది. పిఠాపు రం జమీందార్ త‌మ‌కు ఇచ్చిన ఇంటిని, తాము 70 ఏళ్ల‌కు పైగా ఉంటున్న ఇంటిని కొంద‌రు ఆక్ర‌మించు కునే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని ఓ కుటుంబం ఆవేద‌న వ్య‌క్తం చేసింది.

ఇది సోష‌ల్ మీడియాలోనూ వైర‌ల్ అయింది. దీనిపై ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ స్పందించి.. స్థానిక అధికారుల‌కు ఫోన్ చేసి మాట్లాడిన త‌ర్వాత ఆ స‌మ‌స్య‌పై రెవెన్యూ అధికారులు, పోలీసులు దృష్టి పెట్టా రు. అయితే.. ఈ వ్య‌వ‌హారం సోష‌ల్ మీడియాలో రాక‌ముందే.. స‌ద‌రు కుటుంబం పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. కానీ వారు కేసు పెట్ట‌లేదు., క‌నీసం వీరి ఆవేద‌న‌ను కూడా అర్థం చేసుకోలేదు. ఈ విష‌యాన్ని కూడా స‌ద‌రు కుటుంబం చెప్పుకొచ్చింది. అనంత‌రం.. ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు విన్నవించాక‌.. పై నుంచి ఆదేశాలు వ‌చ్చాక ప‌ట్టించుకున్నారు.

క‌ట్ చేస్తే.. రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌స్తుతం ఇలాంటి ప‌రిస్థితే నెల‌కొంది. ముందు ప్ర‌జాద‌ర్భార్‌కో.. ప్ర‌జావాణికో వెళ్లాలి! అని పోలీసులు, రెవెన్యూ అధికారులు స‌హా క‌లెక్ట‌ర్లు కూడా.. ప్ర‌జ‌లకు సూచిస్తున్నారు. ఇది స‌రైన ప‌రిణామం కాదు. ఎందుకంటే.. ప్రభుత్వ వ్య‌వ‌స్థ‌ల‌ను పార్టీలు న‌డిపించ‌కూడ‌దు. ప్ర‌భుత్వ‌మే న‌డిపించా లి. రేపు మ‌రేదైనా స‌మ‌స్య వ‌స్తే.. ప్ర‌జాద‌ర్బార్ నుంచి త‌మ‌కు స‌మాచారం లేద‌ని.. ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేయ‌లేదని త‌ప్పించుకునే ప‌రిస్థితి అధికారుల‌కు ఇచ్చిన‌ట్టు అవుతుంది. సో.. ఈ కీల‌క స‌మ‌స్య‌పై స‌ర్కారు దృష్టి పెట్టాలి.

Tags:    

Similar News