రుషికొంత మహల్ సోకుల కాంట్రాక్టు ఆమెకు.. షాకింగ్ గా కొత్త నిజం!

ఇంత జరిగిందన్న ఆశ్చర్యానికి గురి చేసేలా వస్తున్న వివరాలు జగన్ అండ్ కోను

Update: 2024-06-18 10:30 GMT

ప్రభుత్వం మారినంతనే అంతకు ముందున్న సర్కారు మీదా.. అది తీసుకున్న నిర్ణయాల మీద విమర్శలు వచ్చే వివరాలు.. నాటి నిర్ణయాలు కొంత సంచలనంగా మారటం తెలిసిందే. ఇదే తీరును చంద్రబాబు ప్రభుత్వం సైతం చేస్తోంది. అదేమన్నా తప్పా? అంటే లేదనే చెప్పాలి. టార్గెట్ చేసినట్లుగా కాకుండా.. ఇంత జరిగిందన్న ఆశ్చర్యానికి గురి చేసేలా వస్తున్న వివరాలు జగన్ అండ్ కోను.. నాటి జగన్ ప్రభుత్వాన్ని వేలెత్తి చూపేలా పరిస్థితులు ఉన్నాయని చెప్పాలి.

ఎవరెన్ని సమర్థింపులు చేసినా.. విశాఖ రిషికొండ మీద నిర్మించిన భవనం.. ప్యాలెస్ ను తలపిస్తున్న సమాచారం.. దానికి సంబంధించిన వివరాలు కళ్లకు కట్టినట్లుగా వెలుగు చూసినప్పుడు.. ఒక కుటుంబం ఉండేందుకు మరీ ఇంత ఖర్చు అవసరమా? అన్న ప్రశ్న ప్రతి ఒక్కరి నోటి నుంచి రావటం ఖాయం. ఇదంతా ఒక ఎత్తు అయితే.. సదరు ఇంటికి సొగసులు అద్దే విషయంలో అస్మదీయులకు పనులు అప్పజెబితే అనవసరమైన విమర్శలు భవిష్యత్తులో వస్తాయన్న ఆలోచన ఎందుకు లేదు? ప్రభుత్వానికి పెద్దగా ఉన్నప్పుడు.. ప్రతి పని పారదర్శకంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవటంతో పాటు.. అన్ని అంశాలు సిస్టం ప్రకారం చేయాలన్న ఆలోచన లేకపోవటం ఏమిటి? అన్నది ప్రశ్న.

విశాఖ రిషికొండలో నిర్మించిన ప్యాలెస్ కు సంబంధించిన ఫోటోలు.. లోపల ఏర్పాటు చేసిన వసతులు.. ఫర్నీచర్ వివరాలు బయటకు రావటం ఒక ఎత్తు అయితే.. అందులోని ఏర్పాట్లు విస్మయానికి గురి చేసేలా మారాయి. బాత్రూంను మధ్యతరగతి జీవి ఇంటికి ఉండే మాస్టర్ బెడ్రూం కంటే రెట్టింపుగా ఉండటం లాంటివి చూసినప్పుడు ఎందుకంత విలాసం? అన్న భావన కలుగక మానదు.

రిషికొండ మీద నిర్మించింది భవనం కాదని.. ప్యాలెస్ అన్న విషయం దాని ఫోటోలు బయటకు వచ్చినంతనే అర్థమైన పరిస్థితి. ఈ సంచలనం ఒక కొలిక్కి రాక ముందే మరో సంచలన అంశం తెర మీదకు వచ్చింది. సదరు ప్యాలెస్ నిర్మాణానికి రూ.450 కోట్లు ఖర్చు కాగా.. అందులోని ఇంటీరియర్ కోసమే రూ.120 కోట్లు ఖర్చు అయినట్లుగా లెక్కలు తేలుతున్నాయి. ఇంత భారీ ఖర్చు అవసరం ఏమిటి? అన్నది ప్రశ్న. ఈ ప్యాలెస్ నిర్మాణం.. అందులోని అంశాలు ప్రతిది రహస్యంగా ఉంచటం ఏమిటన్నది మరో ప్రశ్న. ఒకవేళ జగన్ సొంత ఆస్తి అయితే దాన్ని సీక్రెట్ గా ఉంచుకోవటం తప్పేం కాదు.కానీ.. ప్రజాధనంతో కట్టిన మహాల్ ను గుట్టుగా ఎందుకు ఉంచాలన్నది మరో ప్రశ్న. దానికి సమాధానం ఇటీవల విడుదలైన ఫోటోలు.. వీడియోలతో విషయం అర్థమైన స్థితి.

ఈ ప్యాలెస్ ఇంటీరియర్ పనులను జగన్ కు దగ్గరి బంధువైన చెవ్వా సుప్రియారెడ్డికి అప్పజెప్పిన వైనం తాజాగా వెలుగు చూసింది. ఇంతకూ ఆమె ఎవరంటే.. జగన్ వద్ద ఐటీ సలహాదారుగా పని చేసిన దేవిరెడ్డి శ్రీనాధ్ రెడ్డి సతీమణినే ఈ సుప్రియారెడ్డి. ఆమెదీ.. జగన్ దీ ఒకే ఊరు. ఉమ్మడి కడప జిల్లాలోని భక్రాపురంలో వారివి పక్కపక్క ఇళ్లేనన్న విషయం అందరికి తెలిసిందే. ఆమెకు చెందిన పాంథియన్ డిజైన్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ కంపెనీకే రుషికొండ టూరిజం ప్రాజెక్టు డిజైన్స్.. ఆర్కిటెక్చర్.. ఇంటరీయర్ ప్రాజెక్టును అప్పజెప్పారు. వంద కోట్లకు పైగా ఖర్చుకు సంబంధించిన పనులను ఒక సంస్థకు అప్పజెప్పేటప్పుడు వారికి ఉన్న అనుభవంతో పాటు అర్హత కూడా ముఖ్యం.

అన్నింటికి మించి ఇదే పనిని వేరే వారు ఎంతకు కోట్ చేశారు? ఆమె ఎంతకు కోట్ చేశారు? ప్రజాధనం దుర్వినియోగం కాకుండా అప్పటి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందన్నది కూడా ప్రశ్నే. ఆ విషయాలన్నీ ఇప్పుడు జగన్ వైపు వేలెత్తి చూపేలా మారాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఇప్పుడు మరిన్ని అంశాలు బయటకు వచ్చాయి. అదేమంటే..జగన్ కు చెందిన బెంగళూరు.. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ కు సంబంధించిన ఇంటీరియర్.. ఆర్కిటెక్చర్ డిజైన్లు మొత్తం ఆమెనే ఇచ్చినట్లుగా తెలుస్తోంది. తాడేపల్లిలోని తన ఇంటికి ఆమె ఇంటీరియర్ గా వ్యవహరించారని చెబుతున్నారు. మొత్తంగా రుషికొండ మీద నిర్మించిన ప్యాలెస్ జగన్ హయాంలో నిర్ణయాలు ఎలా జరిగేవి? ఖర్చు ఎలా చేసేవారు? అన్న దానికి చిన్న నిదర్శనంగా చెబుతున్నారు.

Tags:    

Similar News