15 రోజులు.. రూ.2,599 కోట్లు.. అనిల్ అంబానీకి నోటీసులు!

ఇంత భారీ మొత్తాన్ని తిరిగి ఇవ్వడానికి వారికి 15 రోజుల సమయం మాత్రమే ఉందని చెబుతున్నారు.

Update: 2024-05-24 07:17 GMT

ఒక పక్క తమ్ముడు ముఖేష్ అంబానీ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ పోతున్న పరిస్థితి.. మరోపక్క అన్న అనిల్ అంబానీ మాత్రం భారీ కష్టాలు ఎదుర్కొంటున్నారని అంటున్నారు. దీనికి మరో కారణం తాజాగా తెరపైకి వచ్చిన నోటీసులు. ఈ నోటీసుల ప్రకారం అనిల్ అంబానీ రూ.2,599 కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని చెల్లించాలంట. అందుకు ఆయనకున్న సమయం 15 రోజులు మాత్రమే!

అవును... రూ.2,599 కోట్ల భారీ మొత్తాన్ని చెల్లించాలంటూ అనిల్ అంబానీకి చెందిన ఓ కంపెనీ డీఏఎంఈపీఎల్‌ కి తుది నోటీసులు అందాయని తెలుస్తుంది. ఇప్పుడు ఈ విషయం బిజినెస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. ఇంత భారీ మొత్తాన్ని తిరిగి ఇవ్వడానికి వారికి 15 రోజుల సమయం మాత్రమే ఉందని చెబుతున్నారు.

వివరాళ్లోకి వెళ్తే... ఎన్‌.డీ.టీవీ ప్రాఫిట్‌ నివేదిక ప్రకారం.. రూ.2,599 కోట్లను ఎస్‌.బీ.ఐ ప్రైమ్ లెండింగ్ రేటుపై అదనంగా 2 శాతం చొప్పున వడ్డీతో పాటు చెల్లించాలని కోరుతూ రిలయన్స్ ఇన్‌ ఫ్రాకు చెందిన ఢిల్లీ ఎయిర్‌ పోర్ట్ మెట్రో ఎక్స్‌ ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్ (డీఏఎంఈపీఎల్‌)కి ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ (డీ.ఎం.ఆర్‌.సీ) నోటీసు జారీ చేసింది.

వాస్తవానికి... న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి సెక్టార్ 21 ద్వారక వరకు నడిచే ఎయిర్‌ పోర్ట్ మెట్రో ఎక్స్‌ ప్రెస్ లైన్ రూపకల్పన మరియూ నిర్వహణ నిమిత్తం ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌.. అనిల్ అంబానీకి చెందిన డీఏఎంఈపీఎల్‌ మధ్య ఒప్పందం జరిగింది. అయితే తాము గుర్తించిన కొన్ని నిర్మాణ లోపాలను ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ పరిష్కరించలేదని ఆరోపిస్తూ 2012లో డీఏఎంఈపీఎల్‌ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది.

దీంతో.. కంపెనీ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ 2017లో ఆర్బిట్రల్‌ ట్రిబ్యునల్‌ రూ. 2,950 కోట్లు వడ్డీతో సహా డీఏఎంఈపీఎల్‌ కి చెల్లించాలని ఆదేశించింది. దీంతో డీఎంఆర్‌సీ రూ.2,599 కోట్లను యాక్సిస్ బ్యాంక్ వద్ద ఎస్క్రో ఖాతాలో జమ చేసింది.

అయితే తాజాగా సుప్రీం కోర్టు తీర్పు డీ.ఎం.ఆర్.సీ కి అనుకూలంగా వచ్చింది. దీంతో... తాము డిపాజిట్‌ చేసిన రూ.2,599 కోట్ల మొత్తాన్ని తిరిగి చెల్లించాలని అనిల్ అంబానీ సంస్థకు ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ నోటీసులు పంపించింది. దీనికోసం 15 రోజుల సమయం ఇచ్చింది!

Tags:    

Similar News