అంబటిని ఇరికించేసిన అనిల్!
ఇందుకు కేంద్రం అంగీకరించడంతో గత టీడీపీ ప్రభుత్వం దీని నిర్మాణ బాధ్యతలను తలకెత్తుకుంది.
ఆంధ్రుల జీవనాడి.. పోలవరం ప్రాజెక్టు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించింది. దీంతో కేంద్రమే ఈ ప్రాజెక్టును నిర్మించాల్సి ఉంది. అయితే కేంద్రం నిధులు అందిస్తే రాష్ట్ర ప్రభుత్వమే నిర్మిస్తుందని గత టీడీపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఇందుకు కేంద్రం అంగీకరించడంతో గత టీడీపీ ప్రభుత్వం దీని నిర్మాణ బాధ్యతలను తలకెత్తుకుంది. అయితే ఐదేళ్ల వ్యవధిలో పూర్తి చేయలేకపోయింది.
ఆ సమయంలో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ తాము అధికారంలోకి వస్తే జలయజ్ఞం కింద పోలవరం ప్రాజెక్టును యుద్ధప్రాతిపదిక నిర్మిస్తామని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా సైతం సాధిస్తామని నమ్మబలికింది. 20కిపైగా ఎంపీలను ఇస్తే కేంద్రం నుంచి నిధులు సాధిస్తామని ప్రజలకు హామీ ఇచ్చింది.
ప్రజలు వైసీపీని నమ్మడంతో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే ప్రధాన హామీలను నెరవేర్చలేకపోయింది. ప్రత్యేక హోదా అంశం ఎప్పుడో గాలిలో కలిసిపోయింది. ఇక పోలవరం ప్రాజెక్టును ఇదిగో పూర్తి చేస్తున్నాం.. అదిగో పూర్తి చేస్తున్నాం.. ఆ రోజు నుంచి నీళ్లు ఇస్తున్నాం అంటూ ప్రకటనలు చేయడమే తప్ప పోలవరాన్ని పూర్తి చేయలేకపోయారు.
ఇప్పుడు తీరిగ్గా ఒకరిపై ఒకరు నిందలేసుకుంటున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా మాజీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఈ అంశంలో మరో మంత్రి అంబటిని ఇరికించేశారని అంటున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక జలవనరుల శాఖ మంత్రిగా నెల్లూరు సిటీ వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ బాధ్యతలు చేపట్టారు. ఇందులో భాగంగా
అసెంబ్లీ సాక్షిగా మీసాలు తిప్పి మరీ నవంబర్ 2021కే పోలవరం పూర్తి చేస్తామని అప్పట్లో ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆ తర్వాత 2022 మార్చికి పూర్తి చేస్తామన్నారు. అది కూడా పూర్తయిపోయింది. పోలవరంను ప్రారంభించింది.. వైఎస్సార్ అని.. దాన్ని పూర్తిచేసే మొనగాడు ఆయన బిడ్డ జగన్ అని కూడా కోతలు కోశారు. అయితే అనిల్ కుమార్ యాదవ్ చెప్పిన డెడ్ లైన్లకు పోలవరం పూర్తి కాలేదు.
ఈలోపు అనిల్ కుమార్ మంత్రిపదవే ఊడిపోయింది. ఇప్పుడు నాకేం సంబంధం.. నేను మంత్రిని కాదుగా అని ఆయన తప్పించుకుంటున్నారు. పోలవరం గురించి ఎవరైనా ఆయనను ప్రశ్నిస్తే నాకేం సంబంధం.. తాను మంత్రిని కాదంటున్నారు. ఇప్పుడు జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు కాబట్టి ఆయననే అడగాలంటున్నారు.
ఇక జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదంటున్నారు. ఆయనకు ఆ శాఖపై ఎలాంటి జ్ఞానం, పట్టు లేవంటున్నారు. పోలవరం డయాఫ్రమ్ వాల్ పోయిందని.. పోలవరం ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమని గతంలోనే అంబటి రాంబాబు సెలవిచ్చారు. డయాఫ్రమ్ వాల్ అంటే ఏంటో తనకు తెలియాలని రూల్ ఏమీ లేదని.. అది ఇంజనీర్ల పని అని ఆయన అప్పట్లో చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు విమర్శలు కూడా చేశాయి. పోలవరం పూర్తి కాకపోవడానికి చంద్రబాబే కారణమని.. ఇటీవల నుంచి ఆయనపై అంబటి నెపాన్ని నెట్టేస్తున్నారు.
ఓవైపు అనిల్ కుమార్ యాదవ్ తాను మంత్రిని కాదు కాబట్టి పోలవరం విషయాన్ని అంబటి రాంబాబును అడగాలంటున్నారు. అంబటి ఏమో చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్లే పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడం లేదంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఇలా అయితే ఇక పోలవరం ఎప్పటికి పూర్తయ్యేనో!