అనీల్ ని జగన్ పార్లమెంట్ కు పంపుతున్నారా?
ఈ మేరకు నెల్లూరు సిటీఇ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, పారిశ్రామికవేత్త చలమలశెట్టి సునీల్ లతో సీఎం జగన్ తో వేర్వేరుగా భేటీ అయ్యారు.
అవిరామంగా సాగుతున్న వైసీపీ ఇన్ ఛార్జ్ ల మార్పులు చేర్పుల విషయంలో జగన్ మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలుస్తుంది. ఇందులో భాగంగా నరసరావుపేట ఎంపీ లావు శీకృష్ణదేవరాయులు రాజీనామాతో ఖాళీ అయిన ఆ స్థానానికి మంత్రులు, మాజీ మంత్రులను పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో తాజాగా అనిల్ కుమార్ యాదవ్ పేరు తెరపైకి వచ్చింది!
అవును... లావు శ్రీకృష్ణదేవరాయుల రాజీనామాతో ఖాళీ అయిన నరసరావుపేట ఎంపీ స్థానానికి ఇప్పటికే జగన్ పలువురి పేర్లను పరిశీలించినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా మంత్రి విడదల రజనీ పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. చిలకలూరిపేట నుంచి ఇప్పటికే గుంటూరు వెస్ట్ కి మార్చబడిన రజనీని... నరసరావుపేట ఎంపీగా పోటీ చేయించే అవకాశాలున్నాయనే చర్చ నిన్నటివరకూ జరిగింది.
అయితే... తాజాగా ఆ స్థానంలో మాజీమంత్రి అనీల్ కుమార్ యాదవ్ పేరును జగన్ పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు నెల్లూరు సిటీఇ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, పారిశ్రామికవేత్త చలమలశెట్టి సునీల్ లతో సీఎం జగన్ తో వేర్వేరుగా భేటీ అయ్యారు. ఈ మేరకు గురువారం సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు.
ఈ సమయంలో నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతను ఎంపికచేయాలని జగన్ భావిస్తున్న నేపథ్యంలో... అనీల్ ని నరసరావుపేట లోక్ సభ స్థానానికి పోటీ చేయాలని సీఎం జగన్ కోరారని సమాచారం. అయితే... ఈ విషయంలో ఆలోచించుకోవడానికి అనిల్ కు జగన్ కాస్త సమయం కూడా ఇచ్చారని అంటున్నారు. ఇదే సమయంలో మరికొన్ని నియోజకవర్గలలో కూడా జగన్ ఇన్ ఛార్జ్ ల మార్పు చేర్పులు చేసినట్లు తెలుస్తుంది.
ఇందులో భాగంగా... కాకినాడ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగాలని కొంతకాలంగా సునీల్ ను పార్టీ అధినాయకత్వం కోరుతోందని తెలుస్తుంది. అయితే ఇప్పటికే 2009లో ప్రజారాజ్యం, 2014లో వైసీపీ, 2019లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన సునీల్ మరోసారి అదృష్టం పరీక్షించుకునే విషయంలో కాస్త వెనకా ముందూ ఆలోచిస్తున్నారని అంటున్నారు. ఈ సమయంలో జగన్ స్వయంగా పిలిపించుకుని మాట్లాడినట్లు తెలుస్తుంది.
ఏది ఏమైనా... అధికార వైసీపీకి అసెంబ్లీ ఇన్ ఛార్జ్ లను ఎంపిక చేయడం ఒకెత్తు అయితే ఎంపీ అభ్యర్థులను ఎంపిక చేయడం క్లిష్టంగా మారిందని అంటున్నారు. ఈ క్రమంలోనే కర్నూల్ ఎంపీగా పోటీచేయమని అడిగితే గుమ్మనూరు సైలంట్ అయిపోవడంతో... బుట్టా రేణుకను ఎంపిక చేస్తున్నారని కథనాలొస్తున్న సంగతి తెలిసిందే.