మండలిలో లా అండ్ ఆర్డర్ పై వాడీవేడి చర్చ
జగన్ ప్రభుత్వం ఐదేళ్లతో పోలిస్తే ఈ ఐదు నెలల్లో క్రైమ్ రేటు తగ్గిందని అనిత చెప్పారు.
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆరో రోజు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ రోజు శాసన మండలిలో మహిళల అత్యాచార ఘటనలపై వాడివేడి చర్చ జరిగింది. ప్రశ్నోత్తరాల సమయంలో వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే ఆ వ్యవహారంపై మాట్లాడిన హోంమంత్రి వంగలపూడి అనిత..వైసీపీ సభ్యులకు దీటుగా కౌంటర్ ఇచ్చారు. జగన్ ప్రభుత్వం ఐదేళ్లతో పోలిస్తే ఈ ఐదు నెలల్లో క్రైమ్ రేటు తగ్గిందని అనిత చెప్పారు.
స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేసి త్వరితగతిన నేరస్తులకు శిక్ష పడేలా చూస్తామని అనిత అన్నారు.
మహిళలపై దాడులు, హత్యలు, అత్యాచారాలు పెరిగిపోయాయని వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి వేసిన ప్రశ్నకు అనిత సమాధానమిచ్చారు. మహిళల భద్రతకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసిందని, జగన్ తల్లికి, చెల్లికి అన్యాయం జరిగినా తాము అండగా నిలబడతామని చెప్పారు. వైసీపీ పాలనలో అనేక లోపాలున్నాయని, చట్టబద్ధత లేని..అసలు లేని దిశ చట్టం కింద కేసులు పెట్టారని, నిర్భయ చట్టం ఉందని, కానీ, నిర్భయ కింద కేసులు నమోదు చేయలేదని ఆరోపించారు. దిశా పోలీస్ స్టేషన్ రాజమండ్రిలో ప్రారంభించిన రోజే ఒక దళిత బాలికను రేప్ చేసి స్టేషన్ ముందు వదిలి వెళ్లారన విమర్శించారు.
తాను చెప్పిన దాంట్లో ఏం తప్పుందో చెప్పాలని, వైసీపీ సభ్యులంతా ఎందుకు నిలుచున్నారో చెప్పాలని అనిత డిమాండ్ చేశారు. నిందితులను 24-48 గంటల్లో అరెస్టు చేసి రిమాండ్ కు పంపించామని అన్నారు. మీరైనా, మేమైనా మహిళల భద్రత విషయంలో అలర్ట్ గా ఉండాలని చెప్పారు. గత ఐదేళ్లలో మహిళల భద్రత గురించి వైసీపీ సభ్యుల మాట్లాడడం హాస్యాస్పదమని, సీఎం జగన్ ఇంటి సమీపంలో రేప్ జరిగితే న్యాయం జరగలేదని ఆరోపించారు.
గత ఐదేళ్లపాటు చెట్లు నరకడానికి, పరదాలు కట్టడానికి, టీడీపీ నేతల హౌస్ అరెస్టులకు పోలీసులు ఉన్నారని ఆరోపించారు. అమరావతిలో 200 కోట్ల రూపాయలతో ఫోరెన్సిక్ ల్యాబ్ కట్టమని కేంద్రం నిధులిస్తే వైసీపీ ప్రభుత్వం కట్టలేదని విమర్శించారు. లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని వైసీపీ సభ్యులు నినాదాలు చేయగా..లా అండ్ ఆర్డర్ ఫెయిల్ కాబట్టే దువ్వాడ శ్రీనివాస్ వంటి వారు సభకు వస్తున్నారని దువ్వాడనుద్దేశించి అనిత చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఆ సమయంలో అనిత వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. తన సమాధానం వినటానికి దమ్ము, ధైర్యం కావాలని అనిత అన్నారు.