అన్న కోపం.. చెల్లికి శాపం!
కానీ నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2009లో విష్ణువర్ధన్ రెడ్డి జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసి గెలిచారు.
ఆ అన్నాచెల్లెలు దివంగత కాంగ్రెస్ సీనియర్ నాయకుడి వారసులు. రాజకీయాల్లో తండ్రికున్న గొప్ప పేరును కొనసాగిస్తూ సాగుతున్నారు. రాబోయే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున చెరో నియోజకవర్గం నుంచి పోటీ చేద్దామనుకున్నారు. ఒకరి గెలుపు కోసం మరొకరు కష్టపడాలనుకున్నారు. కానీ పరిస్థితి తలకిందులైంది. అన్నకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వలేదు. దీంతో బీఆర్ఎస్ లో చేరిపోయారు. అది ఇప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న చెల్లికి శాపంగా మారిందనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు అన్న నుంచి ఎలాంటి సహకారం దొరకడం లేదు. ఆ అన్నాచెల్లెలు ఎవరో కాదు పి.విష్ణువర్ధన్ రెడ్డి, పి.విజయ. దివంగత కాంగ్రెస్ నాయకుడు పి. జానర్ధన్ రెడ్డి వారసులు వీళ్లు.
కాంగ్రెస్ తరపున ఖైరతాబాద్ నుంచి పి.జనార్ధన్ రెడ్డి నాలుగు సార్లు (1985, 1989, 1994, 2004)లో గెలిచారు. కానీ 2007లో పీజేఆర్ హఠాన్మరణంతో 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి విజయం సాధించారు. కానీ నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2009లో విష్ణువర్ధన్ రెడ్డి జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత మాత్రం మళ్లీ గెలవలేకపోయారు. 2018లో 16 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ సారి ఎన్నికల్లో మరోసారి జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేయాలని విష్ణువర్ధన్ రెడ్డి అనుకున్నారు. చెల్లె విజయను ఖైరతాబాద్ బరిలో దింపాలని చూశారు. కానీ విజయకు ఖైరతాబాద్ టికెట్ ఇచ్చిన కాంగ్రెస్.. విష్ణువర్ధన్కు మాత్రం మొండిచెయ్యి చూపించింది. దీంతో కాంగ్రెస్ పై ఆగ్రహంతో విష్ణువర్ధన్ బీఆర్ఎస్ లో చేరిపోయారు.
ఖైరతాబాద్లోనేమో విజయ పోటీ చేస్తున్నారు. అయితే కీలక నియోజకవర్గమైన ఖైరతాబాద్ లో గెలవడం అంత సులువు కాదు. అది కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్ ను దాటి విజయం సాధించాలనే చాలా కష్టపడాలి. కానీ ఈ విషయంలో విజయకు అన్న విష్ణువర్ధన్ రెడ్డికి ఎలాంటి సపోర్ట్ దక్కడం లేదు. కాంగ్రెస్ అంటేనే మండిపోతున్న విష్ణువర్ధన్.. సొంత సోదరి అయినప్పటికీ వెనక్కి తగ్గడం లేదనే చెప్పాలి. 13 మండలాలు ఉన్న ఖైరతాబాద్ పై విష్ణువర్ధన్ కు మంచి పట్టుంది. కానీ ఆయన ఇప్పుడు పార్టీ మారడం విజయకు నష్టం చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పోనీ లోలోపల అయినా మద్దతు నిలిచేందుకు విష్ణువర్ధన్ రెడ్డి సిద్ధంగా లేరని తెలిసింది. ఆయన అనుచరులు కూడా విజయ పిలిస్తే వెళ్లడం లేదని టాక్. కాంగ్రెస్ ను ఎలాగైనా ఓడిస్తానని చెబుతున్న విష్ణువర్ధన్ రెడ్డి చెల్లెలి కోసం త్యాగం చేసే పరిస్థితి కూడా కనిపించడం లేదు. మొత్తానికి అన్న కోపం.. చెల్లికి శాపంగా మారిందనే టాక్ వినిపిస్తోంది.