ఏపీలో అన్న క్యాంటీన్ల 'పేరు' మార్పు!?

దీనిలో భాగంగా సెప్టెంబరు 21వ తేదీనే.. ఒకే సారి రాష్ట్ర వ్యాప్తంగా 203 క్యాంటీన్ల‌ను ఏర్పాటు చేయాల‌ని స‌ర్కారు నిర్ణ‌యించింది.

Update: 2024-06-28 05:50 GMT

రాష్ట్రంలో కూట‌మి ప్ర‌భుత్వం దూకుడుగా ముందుకు సాగుతోంది. ముఖ్యంగా ఎన్నికల స‌మ‌యంలో ఇచ్చిన ప‌లు హామీల‌ను అమ‌లు చేసేందుకు వ్యూహాత్మ‌కంగా, ప్ర‌ణాళికా బ‌ద్ధంగా సాగుతోంది. ఇప్ప‌టికే జూలై 1వ తేదీ నుంచి సామాజిక భ‌ద్ర‌తా పింఛ‌న్ల‌ను పెంచుతున్న విష‌యం తెలిసిందే. ఇక‌, మ‌రో కీల‌క‌మైన టీడీపీ పార్టీ ప‌రంగా చూసుకుంటే.. మ‌రింత గ్రాఫ్ పెంచేదైన‌.. అన్నా క్యాంటీన్ల‌ను ఏర్పాటు చేసేదిశ‌గా చంద్ర‌బాబు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

దీనిలో భాగంగా సెప్టెంబరు 21వ తేదీనే.. ఒకే సారి రాష్ట్ర వ్యాప్తంగా 203 క్యాంటీన్ల‌ను ఏర్పాటు చేయాల‌ని స‌ర్కారు నిర్ణ‌యించింది. ఈ మేర‌కు పుర‌పాల‌క శాఖ మంత్రి నారాయ‌ణ ప్ర‌క‌ట‌న చేశారు. వీటిలో ఉదయం టిఫిన్‌, మ‌ధ్యాహ్నం రాత్రి భోజ‌నం ఏర్పాటు చేయ‌నున్నారు. రూ.5కే పేద‌ల‌కు అందించాల‌ని నిర్ణ‌యించారు. త‌ద్వారా రాష్ట్ర ప్ర‌భుత్వంపై నెల‌కు రూ.200 కోట్ల వ‌ర‌కు భారం ప‌డుతుందున్న లెక్క‌లు వేసినా.. ఈ కార్య‌క్ర‌మంతో ప్ర‌జ‌ల‌కు మేలు జ‌రుగుతుంద‌ని భావిస్తున్నారు.

ఇక‌, అన్న క్యాంటీన్ల‌ను ఆద‌ర్శ‌వంతంగా తీర్చిదిద్దేందుకు కూడా చంద్ర‌బాబు ప్ర‌య‌త్నిస్తున్నారు. సామాజికంగా వీటిని చేరువ చేసేందుకు.. స్వ‌చ్ఛంద సంస్థ‌ల పాత్ర‌ను పెంచ‌నున్నారు. వారి నుంచి కూడా విరాళాలు తీసుకోవాల‌ని నిర్ణ‌యించారు. ఇక‌, పెళ్లిళ్లు, పుట్టిన రోజులు, వివాహ వార్షికోత్స‌వాలు.. వంటివి చేసుకున్న‌ప్పుడు కూడా.. అన్న క్యాంటీన్ల కేంద్రంగా చేసుకునేలా.. త‌ద్వారా పేద‌ల‌కు చేరువ అయ్యేలా వీటిని ఆద‌ర్శవంతం చేసేందుకు చంద్ర‌బాబు ప్ర‌యత్నిస్తున్నారు.

ఇదిలావుంటే.. అన్న క్యాంటీన్ల పేరు మార్పుపైనా చ‌ర్చ‌సాగుతోంది. పేద‌ల‌కు ఉప‌యుక్తంగా ప‌ట్టెడ‌న్నం పెట్టే విధంగా ఉన్న ఈ క్యాంటీన్ల‌లో మ‌రో పేరును కూడా చేర్చాల‌న్న‌ది కూట‌మి పార్టీ జ‌న‌సేన ఆలోచ‌న‌గా ఉంద‌ని తెలుస్తోంది. గ‌తంలో తూర్పు గోదావ‌రికి చెందిన డొక్కా సీత‌మ్మ అనే మ‌హిళ‌.. త‌న ఇంటికి వ‌చ్చిన వారికి అన్నం పెట్టి పంపేవారు. ఆమె సేవ‌ల‌కు గుర్తుగా అక్విడెక్ట్‌కు పేరుపెట్టుకున్నారు. గ‌తంలో ప‌వ‌న్ అనేక సార్లు సీత‌మ్మ అన్నం పెట్టిన ఇంటిని ద‌ర్శించి వ‌చ్చారు. ఇప్పుడు అన్నా క్యాంటీన్ల పేరులో డొక్కా సీత‌మ్మ పేరు చేర్చాల‌న్న‌ది ఆయ‌న ఆలోచ‌న‌. దీనిపై ప్ర‌స్తుతం ప్ర‌తిపాద‌న రెడీ అయిన‌ట్టు తెలుస్తోంది. మ‌రి దీనికి చంద్ర‌బాబు ఏమంటారో చూడాలి.

Tags:    

Similar News