ముహూర్తం పెట్టేశారు.. పేదలకు పండగే!
ఎన్నికలకు ముందు ప్రజలకు హామీ ఇచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు.. ఇప్పుడు దానిని సాకారం చే సేందుకు ముహూర్తం నిర్ణయించారు
ఎన్నికలకు ముందు ప్రజలకు హామీ ఇచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు.. ఇప్పుడు దానిని సాకారం చేసేందుకు ముహూర్తం నిర్ణయించారు. అదే.. పేదల ఆకలి తీర్చే.. అన్న క్యాంటీన్ల ఏర్పాటు. ఇప్పటి వరకు ఎప్పుడు ఏర్పాటు చేస్తారనే అంశంపై సందేహాలు నెలకొన్నాయి. ఆగస్టు 15 నుంచి ప్రారంభిస్తామని కూటమి నాయకులు చెబుతున్నా.. ఇప్పటివరకు స్పష్టమైన వైఖరి మాత్రం వెల్లడించలేదు. తాజాగా చంద్రబాబు దీనిపై ప్రకటన చేశారు.
ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎంపికచేసిన నగరాలు, పట్టణాల్లో రద్దీ ప్రాంతాలైన చోట అన్న క్యాంటీ న్లను ఏర్పాటు చేస్తున్నట్టు చంద్రబాబు తెలిపారు. అయితే.. ఆగస్టు 15కు ప్రత్యేకత ఉందని..ప్రతి ఒక్కరికీ స్వాతంత్య్రం వచ్చిన రోజని.. అలానే ఇప్పుడు పేదలకు స్వాతంత్య్రం వచ్చి.. వారి కడుపు నింపే రోజు ప్రారంభం కానుందనిచంద్రబాబు పేర్కొన్నారు. ఆగస్టు 15న ఒక క్యాంటీన్‌ను తాను ప్రారంభిస్తున్నానని.. తర్వాత రోజు నుంచి 99 క్యాంటీన్లను మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు ప్రారంభిస్తారని చెప్పారు.
దీంతో పేదల పండుగకు చంద్రబాబు ముహూర్తం పెట్టినట్టు అయింది. ఇక, ఆగస్టు 15న కృష్ణా జిల్లా ఉయ్యూరులోని బస్ స్టాండ్ సమీపంలో సాయంత్రం 6.30 గంటలకు అన్న క్యాంటీన్‌ను చంద్రబాబు అధికారికంగా ప్రారంభించనున్నారు. అక్కడే ఆయన భోజనం చేయనున్నారు. అనంతరం.. మరుసటి రోజు ఎంపిక చేసిన ప్రాంతాల్లో 99 క్యాంటీన్లను కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభించనున్నారు. వాస్తవానికి 230 క్యాంటీన్లను ప్రారంభించాలని అనుకున్నా.. కొన్ని నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో అనువుగాలేని క్యాంటీన్లు ఉన్నాయి వాటిని మార్చాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తొలి విడతగా 100 క్యాంటీన్లు ప్రారంభించనున్నారు.
ఇవీ.. అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసే ప్రాంతాలు..
+ విజయవాడ = 12
+ తిరుపతి = 8
+ విశాఖపట్నం = 20
+ చిత్తూరు = 6
+ అనంతపురం = 12
+ తూర్పుగోదావరి(రాజమండ్రి) = 18
+ పశ్చిమ గోదావరి(ఏలూరు) = 10
+ గుంటూరు = 6
+ నెల్లూరు = 6
+ కర్నూలు = 2