తమిళ బీజేపీలో ‘అక్కా’ ..‘అన్నా’ సంఘర్షణ.. వయా తెలంగాణ, ఏపీ

ఆరు నెలల కిందటి వరకు తెలంగాణ గవర్నర్ గా పనిచేశారు తమిళిసై. ఒకప్పుడు తమిళనాడు బీజేపీ చీఫ్ గా ఉన్న ఆమె పలు ఎన్నికల్లో పోటీ చేశారు.

Update: 2024-06-15 06:44 GMT

తెలంగాణలో ఏడాది కిందటి వరకు అధికారంలోకి వచ్చేస్తున్నాం అంటూ హడావుడి చేసింది బీజేపీ.. ఇదే విధంగా తమిళనాడులో ఇటీవలి లోక్ సభ ఎన్నికల్లో 2-3 సీట్లయినా గెలుస్తున్నాం.. అంటూ చెప్పుకొంది. కానీ, ఫలితాలు చూస్తే ఖాతానే తెరవలేదు. కనీసం పోటీ ఇవ్వలేకపోయింది. దీంతో డీఎంకే కాంగ్రెస్ కూటమి స్వీప్ చేసేసింది. అయితే, తమిళనాడులో కొన్నేళ్లుగా బీజేపీ గట్టి ప్రయత్నం చేస్తోంది. మాజీ ఐపీఎస్ అన్నామలైని రాష్ట్ర అధ్యక్షుడిగా చేసింది. ఆయన తన పోరాటంతో బీజేపీని బాగానే ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఇటీవలి ఎన్నికల్లో అన్నామలై కూడా ఓడిపోయారు. దీనికిముందుగా మరో ఘటన జరిగింది.

ఆరు నెలల కిందటి వరకు తెలంగాణ గవర్నర్ గా పనిచేశారు తమిళిసై. ఒకప్పుడు తమిళనాడు బీజేపీ చీఫ్ గా ఉన్న ఆమె పలు ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే, 2019లో తెలంగాణ గవర్నర్ గా వచ్చాక ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. మళ్లీ ఇటీవలి లోక్ సభ ఎన్నికలకు ముందు సొంత రాష్ట్రానికి వెళ్లిపోయారు. ఎన్నికల బరిలో దిగారు.

లోక్ సభ ఎన్నికల్లో ఓటమితో లుకలుకలు

అన్నామలై సారథ్యంలో లోక్ సభ ఎన్నికల్లో దారుణ ప్రదర్శన పట్ల తమిళిసై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఇది రాష్ట్ర పార్టీలో విభేదాలను బయటపెట్టింది. ఇదే సమయంలో ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా.. వేదికపైనే తమిళిసైతో సీరియస్‌ గా మాట్లాడారు. ఈ సన్నివేశంపై తీవ్ర చర్చ జరిగింది. కానీ, రాజకీయ, నియోజకవర్గ కార్యక్రమాలను ముమ్మరంగా చేపట్టాలని తమకు షా సలహా ఇచ్చారని తమిళిసై చెప్పారు. ఆ తర్వాత కొన్ని గంటలకే ఆమెతో అన్నామలై భేటీ కావడం గమనార్హం.

అక్కా అంటూ ట్వీట్..

అమిత్ షా ఆగ్రహం నేపథ్యంలో.. తమిళిసైతో అన్నామలై భేటీ అయ్యారు. ఆమెపై ప్రశంసలు కురిపిస్తూ.. తన రాజకీయ అనుభవం పార్టీ అభివృద్ధికి దోహద పడుతుందని కొనియాడారు. ‘‘సీనియర్ నాయకురాలు, పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా సమర్థంగా పనిచేసిన ‘అక్క తమిళిసై’తో భేటీ సంతోషంగా ఉంది’’ అంటూ ట్వీట్ చేశారు. . రాష్ట్రంలో కమలం (బీజేపీ గుర్తు) తప్పకుండా వికసిస్తుంది అంటూ నర్మగర్భంగా వ్యాఖ్యలు చేశారు. మరోవైపు తమిళిసై కూడా స్పందిస్తూ.. అన్నామలైతో సమావేశం సంతోషంగా ఉందన్నారు. చివరకు ‘అక్కా’, ‘అన్నా‘ వివాదానికి అలా తెరపడిందన్నమాట.

Tags:    

Similar News