ఇండియన్ నేవీ మరో డేరింగ్ ఆపరేషన్.. ఈసారి ఇలా!
కాగా ఈ ఆపరేషన్ చేపట్టడానికి కొద్ది గంటల ముందే భారత నౌకాదళం ఇదే తరహా ఆపరేషన్ చేపట్టిన సంగతి తెలిసిందే.
భారత నౌకాదళం తన సత్తా చాటుతోంది. అంచనాలకు మించి రాణిస్తోంది. గల్ఫ్ ఆఫ్ ఈడెన్ లో, ఎర్ర సముద్ర జలాల్లో సోమాలియా సముద్రపు దొంగలు, హౌతీ రెబల్స్ నౌకలపై చేస్తున్న దాడులను సమర్థవంతంగా తిప్పికొడుతోంది. ఈ క్రమంలో తాజాగా మరో డేరింగ్ ఆపరేషన్ చేపట్టింది. శత్రు దేశం పాకిస్థాన్ కు చెందిన 19 మంది నావికుల్ని ఇండియన్ నేవీ రక్షించింది.
వివరాల్లోకి వెళ్తే.. జనవరి 29న సోమాలియా తీరంలో ఇరాన్ జెండాతో ఉన్న అల్ నయీమీ అనే ఫిషింగ్ నౌకను 11 మంది సోమాలియా సముద్రపు దొంగలు చుట్టుముట్టారు. ఆయుధాలతో వచ్చిన వీరు నౌకలో ఉన్న 19 మంది పాకిస్థాన్ నావికులను బంధించారు.
దీనిపై సమాచారం అందుకున్న భారత యుద్ధనౌక.. ఐఎన్‌ఎస్ సుమిత్ర రంగంలో దిగింది. సోమాలియా సముద్ర దొంగల చేతుల్లో చిక్కిన ఇరాన్ ఓడను అడ్డగించి, అందులో ఉన్న బందీలను విజయవంతంగా విడిపించింది.
ఈ మేరకు భారత నేవీ వివరాలను వెల్లడించింది. మొత్తం 11 మంది సోమాలియా సముద్రపు దొంగల నుంచి 19 మంది పాకిస్తానీ సిబ్బందిని ఐఎన్‌ఎస్ సుమిత్ర రక్షించినట్లు భారత నేవీ ప్రతినిధి ఒకరు ఎక్స్ లో పోస్టు చేశారు.
కాగా ఈ ఆపరేషన్ చేపట్టడానికి కొద్ది గంటల ముందే భారత నౌకాదళం ఇదే తరహా ఆపరేషన్ చేపట్టిన సంగతి తెలిసిందే. శనివారం రాత్రి అరేబియా సముద్రంలో ఇరాన్ చేపల బోటు ఇమాన్ ను సోమాలియా దొంగలు హైజాక్ చేశారు. దీంతో తమను కాపాడలంటూ ఈ బోటు నుంచి ఆదివారం భారత్ నౌకాదళానికి ఎమర్జెన్సీ మెసేజ్ అందింది. దీంతో ఐఎన్‌ఎస్ సుమిత్ర, అడ్వాన్సుడ్ లైట్ హెలికాప్టర్.. ధ్రువ్ రంగంలోకి దిగి.. 17 మంది మత్స్యకారులను రక్షించాయి.
కాగా తిరుగుబాటుదారులు గత కొద్ది రోజులుగా ఎర్రసముద్రంలో వాణిజ్య నౌకలే లక్ష్యంగా దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల గల్ఫ్ ఆఫ్ ఈడెన్ లో ఆయిల్ ట్యాంకర్లతో వెళుతున్న మార్లిన్ లాండ నౌకపై క్షిపణితో దాడికి దిగారు. ఆ నౌక నుంచి వచ్చిన అత్యవసర సందేశానికి స్పందించిన భారత నేవీ.. సమీపంలోని ఐఎన్‌ఎస్ విశాఖపట్నం నౌకను రంగంలోకి దింపి, సహాయ చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే.
ముఖ్యంగా గతేడాది అక్టోబరు 7న ప్రారంభమైన ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం తర్వాత ఎర్రసముద్రంలో వ్యాపార నౌకలు అపహరణకు గురవుతున్నాయి. ఇరాన్ మద్దతు గల యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు.. క్షిపణులు, డ్రోన్ లతో ఎర్రసముద్రంలో వాణిజ్య నౌకలే లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్నారు.